నగర మేయర్ ఎస్సీలకు కేటాయించాలి
Published Mon, Jul 18 2016 5:59 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ పదవి ఎస్సీకి రిజర్వేషన్ చేయాలని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్నారు. 110 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఇప్పటికి 23 మంది చైర్మన్లు మారారని, వీరిలో ఒక్కరు కూడా ఎస్సీ సమాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడం బాధాకరమన్నారు. శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధి ఎస్‌వీ రమణమాదిగ ఆధ్యక్షతన శ్రీకాకుళంలోని విజేత ఇన్‌లో ఆదివారం అన్ని పార్టీల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు మాట్లాడుతూ ఈ దఫా జరిగే నగరపాలక సంస్థ ఎన్నికలకు మేయర్ సీటును ఎస్సీలకు రిజర్వ్ చేయాలన్నారు. ఎస్సీకులమంతా ఐకమత్యంగా ఉద్యమిస్తే అనుకున్నది సాధించుకోవచ్చన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్ మాట్లాడుతూ సమాజంలో దళితులకు ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్నారన్నారు. మేయర్ పదవి ఎస్సీలకు కేటాయించాలని ఇందుకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీనియర్ దళిత నాయకుడు బొడ్డేపల్లి నర్సింహులు మాట్లాడుతూ శ్రీకాకుళం మున్సిపాలిటీ పరంగా ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా మేయర్ పదవిని ఎస్సీలకు కేటాయించి ఎస్సీ సామాజిక వర్గానికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి తాండ్ర ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బాన్న రాము మాట్లాడుతూ ఎస్సీలు ఏ ప్రభుత్వానికీ వ్యతిరేకం కాదన్నారు. ఈ సందర్భంగా నగర పాలకసంస్థ మేయర్ పదవి ఎస్సీలకు కేటాయించాలని తీర్మానిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసేందుకు నిర్ణయించారు. సమావేశంలో పలువురు సంఘ నేతలు కంఠ వేణు, శవ్వాన ఉమామహేశ్వరి, చాపర సుందరలాల్, వి.అప్పలరాజు, మామిడి రాంబాబు, కానుకుర్తి శంకరమాదిగ, రానా శ్రీనివాసరావుమాదిగ, ఎం.నాగపండు, కంఠ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement