ఒక్క యూనిట్టూ!
Published Mon, Dec 16 2013 4:16 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పేదల సంక్షేమమే లక్ష్యమని ప్రకటించుకుంటున్న సర్కారు.. ఆ మేరకు పథకాల లక్ష్యాలను భారీగానే నిర్ధేశిస్తోంది. ఎటొచ్చీ వాటి అమలుకు సంబంధించి మార్గదర్శకాల జారీ.. నిధుల విడుదలలో సాచివేత ధోరణి అవలంబిస్తుండటంతో పథకాలు పడకేస్తున్నాయి. బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాల పరిస్థితి దీన్నే స్పష్టం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పావు దాటిపోయినా ఒక్కటంటే ఒక్క యూనిట్ అయినా మంజూరు కాలేదు. ఈ పథకాలకు సబ్సిడీపై స్పష్టత లేకపోవడం, దానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడమే దీనికి కారణమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అవి వస్తే తప్ప ముందడుగు వేయలేమని చేతులెత్తేస్తున్నాయి. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ప్రతి ఏటా ఆయా సామాజికవర్గాలకు చెందిన యువతకు సబ్సిడీ రుణాలతో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తున్నారు.
అదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మంజూరు చేయాలని ఆర్థిక సంవత్సరం ఆరంభంలో అంటే ఏప్రిల్‌లో లక్ష్యాలు నిర్దేశించారు. అయితే తొమ్మిది నెలలు గడిచిపోతున్నా సబ్సిడీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఏ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటుంటే, రుణాలు అందక లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో స్వయం ఉపాధి రుణాల యూనిట్ విలువలు రూ.30 వేలు, రూ.60 వేలు, రూ.లక్ష చొప్పున ఉండేవి. గరిష్టంగా రూ.30 వేలకు మించకుండా యూనిట్ స్థాయిని బట్టి సబ్సిడీ ఇచ్చేవారు. మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణంగా మంజూరు చేసేవారు. అయితే ఈ ఏడాది సబ్సిడీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు పంపిస్తామని, అంతవరకు రుణాలు మంజూరు చేయవద్దని ప్రభుత్వం అధికారులకు సూచించింది. తర్వాత ఆ విషయమే పట్టించుకోవడం మానేసింది.
లక్ష్యాలు ఇవీ..
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది 1489 మందికి సబ్సిడీ యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా తీసుకన్నారు. ఇందుకోసం రూ. 15.75 కోట్లు కేటాయించారు. ఈ యూనిట్ల కోసం సుమారు 400 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత స్థానిక సంస్థల అధికారులు, బ్యాంకుల పరిశీలన కూడా పూర్తి చేసి, యూనిట్లను నిర్థారించి సిద్ధంగా ఉంచారు. అయితే మార్గదర్శకాలు రాకపోవడంతో ఈ దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. ఇక బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ ఏడాది 3856 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయాలని నిర్దేశించి, రూ. 23.13 కోట్లు కేటాయించారు. ఈ మేరకు సుమారు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా మండల, మున్సిపల్ కార్యాలయాలు, బ్యాంకుల అనుమతి కూడా పొందారు. వీరికి రుణాలు విడుదలైతే, మరింత మంది దరఖాస్తు చేసే పరిస్థితి ఉంది.
లక్ష్యాలు ప్రశ్నార్థకమే
ఇంతవరకు ఒక్క యూనిట్టూ మంజూరు కాని పరిస్థితుల్లో ఈ ఏడాది బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు లక్ష్యాలు సాధిస్తాయా? అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో మూడున్నర నెలలే మిగిలాయి. ఇప్పటికీ మార్గదర్శకాలు రాలేదు. ఈ పరిస్థితుల్లో బ్యాంకు క్లియరెన్సులు, యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్, తదితర ప్రక్రియలు పూర్తికావడం అనుమానమే. ఇదే విషయమై బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ఈడీలు బలరాం, మహాలక్ష్మిల వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా మార్గదర్శకాలు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు అందజేస్తామన్నారు. మార్చి నాటికి లక్ష్యాలు పూర్తి చేస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement