రైతుల హక్కులను గౌరవించాలి
రైతుల హక్కులను గౌరవించాలి
Published Sun, Aug 21 2016 7:24 PM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
పెనుగొండ : అన్నదాత మనోభావాలను గుర్తిస్తూ, వారికి భూమిపై ఉన్న హక్కులను ప్రభుత్వాలు గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి మాజీ సభ్యులు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన మానవహక్కుల విద్య జాతీయ సదస్సు ముగింపు సభలో పాల్గొని ప్రసంగించారు.
ప్రత్యేక ఆర్థిక మండళ్లు, రాజధాని నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ది అంటూ ప్రభుత్వాలు రైతుల హక్కులను హరించివేస్తున్నాయన్నారు. వారి మనోభావాలు పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే భూసమీకరణ అని, రైతులు భూమి ఇవ్వడానికి నిరాకరిస్తే ‘భూసేకరణ’ అనే భావనలను చట్టం ద్వారా రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలు సేకరించారని వివరించారు. రాజకీయ హక్కుల కోసం చేపట్టిన ఉద్యమాలు విజయవంతమయ్యాయని, ఆర్థిక, సామాజిక హక్కులపై చేసిన ఉద్యమాలు విజయవంతం కాలేదని వివరించారు. మానవ హక్కుల విద్యతో ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుందన్నారు. డాక్టర్ దుర్గాభాయ్ దేశ్‌ముక్ మహిళా విద్యా కేంద్రంకు చెందిన ఆచార్య బి.రత్నకుమారి మాట్లాడుతూ సమాజంలో సమానత్వపు హక్కులేకుండా మహిళకు రెండవ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. గర్భస్త శిశువు ఆడపిల్ల అయితే, గర్భస్రావం చేయించుకునే సమాజంలో బతుకుతున్నామన్నారు. దేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి సమానం కానంత వరకూ పురుషుల ఆధిపత్యం, అత్యాచారాలు, గృహహింసలు జరుగుతూనే ఉంటాయన్నారు. విశ్వ విద్యాలయాలు ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ సబ్జెక్టులో మహిళా సాధికారత అంశాన్ని చేర్చాలన్నారు. మహిళల స్వీయరక్షణకు కరాటే విద్యను ప్రభుత్వం నేర్పించి ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్నారు. జాతీయ సదస్సు ద్వారా ప్రభుత్వానికి, యూజీసీకి పంపే నివేదిక వీటిని చేర్చాలన్నారు.
91 పరిశోధన పత్రాలు
జాతీయ సదస్సులో124 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, 91 పరిశోధనాపత్రాలు సమర్పించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ నరసింహరాజు తెలిపారు. పరిశోధన పత్రాలను సావనీర్‌గా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సెమినార్ సంచాలకులు డాక్టర్ ఎన్.సూర్యనారాయణరాజు, పాలకవర్గ ఉపాధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి పీవీ సుబ్రహ్యణ్యంరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్, పిల్లి పుల్లంశెట్టి, కాకర శశికుమార్, కేవీ సురేష్‌బాబు పాల్గొన్నారు.
Advertisement