సంప్రదాయ వంటలతోనే ఆరోగ్యం
- కాలానుగుణంగా ఆహార అలవాట్లు మార్చుకోవాలి
- నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్
- సంస్కృతి సంప్రదాయాలను చాటే సంక్రాంతి వంటల పోటీలు
హిందూపురం అర్బన్ : సంప్రదాయ వంటల్లో ఎంతో ఆరోగ్యం దాగుందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. కాలానుగుణంగా ఏఏ వంటలు, ఏ ఆహారం తీసుకోవాలో పెద్దలు ఏనాడో నిర్ణయించారన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం స్థానిక కేహెచ్ ఫంక‌్షన్ హాలులో సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్టు, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో మహిళలకు సంప్రదాయ వంటల పోటీలు నిర్వహించారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పోటీలకు సుమారు వంద మంది మహిళలు వివిధ వంటలు పోటీపడి తయారు చేశారు. సుమారు ఒకటిన్నర గంట సమయంలో వంట సిద్ధం చేయడానికి నిర్ణయించారు. జ్యోతి, త్రివేణి, సునంద, కీర్తి, శిల్ప, సంగీత న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మొదటి బహుమతిగా ఫ్రిజ్‌ను గౌరిబిదనూరుకు చెందిన పునితవంశీ (గుమ్మడికాయ, చెరుకుపాలతో పాయసం) వంటకు ఇచ్చారు. రెండో బహుమతి గ్రైండర్‌విత్ ఫ్రిజ్‌ను సత్యవాణి (చెక్కిళాలు, సద్దరొట్టె) దక్కించుకున్నారు. మూడో బహుమతి చికెన్ సెట్‌ను సవితభూషన్ (తీపి గుమ్మడికాయ బూందీలు, చిలకడదుంప బొబ్బట్లు)కు అందించారు. అనంతరం పోటీలకు హాజరైన మహిళలందరికీ బహుమతులు ప్రదానం చేశారు.
ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ కారేషుదాశి, కరనేషుమంత్రి, భోజషు మాత అని చెప్పారు. మహిళలు కరుణమూర్తులు శుద్ధమైన వంటలు చేసి భర్త, పిల్లలను ఆనందపర్చాలన్నారు. పని ఒత్తిడితో ఇంటికి వచ్చిన భర్తలకు భారం కలిగించరాదని సూచించారు. ప్రతి ఏటా ఇలాంటి సంప్రదాయ వంటలు, ముగ్గులు పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ పట్టణ ఏ,బీ బ్లాక్ కన్వీనర్లు ఈర్షద్, మల్లికార్జున, జిల్లా కార్యదర్శి ఫజులూరెహెమాన్, మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, మండల కన్వీనర్లు నారాయణస్వామి, సదాశివరెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, అంజినప్ప, షాజియా, ఎంపీటీసీ సభ్యురాలు సునిత, నాయకులు సమద్, రంగారెడ్డి, నాగిరెడ్డి, రవి, శివశంకర్‌రెడ్డి, నారాయణస్వామి, శంకర్‌రెడ్డి, రమేష్, నరసింహరెడ్డి, రియాజ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.