ఎట్టకేలకు స్టాంపులొచ్చేశాయ్!
- జిల్లాకు చేరిన రూ.6 కోట్ల 38 లక్షల విలువైన స్టాంపులు
అనంతపురం టౌన్ : జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఎట్టకేలకు రూ.6 కోట్ల 38 లక్షలు విలువ చేసే వివిధ రకాల స్టాంపులు వచ్చాయి. స్టాంపుల కొరతతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ విషయమై సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. దీంతో జిల్లా యంత్రాంగంలో చలనం వచ్చింది. నెలల తరబడి స్టాంపులు లేకపోవడంతో తలెత్తుతున్న సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఎన్ని స్టాంపులు కావాలో అందులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం రూ.6 కోట్ల 38 లక్షలు విలువ చేసే స్టాంపులు వచ్చాయి. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని 11 కార్యాలయాలకు రూ.3 కోట్ల 78 లక్షలు, హిందూపురం రిజిస్ట్రార్ పరిధిలోని 9 కార్యాలయాలకు రూ.2 కోట్ల 60 లక్షలు విలువైన సాంపులు సరఫరా అయ్యాయి.