హ్యాపీ బర్త్‌ డే.. లే నాన్నా! | Student died by toxic bite | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌ డే.. లే నాన్నా!

Published Thu, Aug 24 2017 2:54 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

హ్యాపీ బర్త్‌ డే.. లే నాన్నా! - Sakshi

హ్యాపీ బర్త్‌ డే.. లే నాన్నా!

పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు..
కోడుమూరులో విషపురుగు కాటుతో విద్యార్థి మృతి


‘పొద్దుపొడిస్తే పుట్టిన రోజు.. పుట్టిన రోజున ఎవరెవరికి చాక్లెట్లు ఇవ్వాలి. ఎన్ని గంటలకు కేకు కట్‌ చేయాలంటూ రాత్రి ముచ్చటగొలిపే మాటలు చెబితివి..  హ్యాపీ బర్త్‌డే లే నాన్నా లే... మీ సారొళ్లు వచ్చారు.. మీ స్నేహితులు వచ్చారు.. చాక్లెట్లు పంచు.. నాన్నా’ అంటూ విగతజీవిగా మారిన ముద్దుల కుమారుడిని ఒడిలో పెట్టుకొని బేలగా బతిమాలుతూ ఆ తల్లి తల్లడిల్లిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

కోడుమూరు రూరల్‌: పట్టణంలోని చేనేత కాలనీలో ఓ విద్యార్థి విషపురుగుకాటుతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. కాలనీకి చెందిన నాగెళ్ల శేఖర్, నాగమణి దంపతులకు కుమార్తె శ్వేత , కుమారుడు కౌసిక్‌ (11) సంతానం. కౌశిక్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 4 వతరగతి చదువుతున్నాడు. బుధవారం తన పుట్టిన రోజు కావడంతో మంగళవారమే పుట్టిన రోజుకు కావాల్సిన కొత్త దుస్తులు, కేక్, చాక్లెట్లను సిద్ధంగా ఉంచుకున్నాడు. రాత్రి యథావిధిగా తల్లిదండ్రులతో కలిసి నిద్రించాడు. బుధవారం తెలవారుజామున ఒంట్లో నలతగా ఉందంటూ తల్లిదండ్రులను నిద్రలేపాడు. వాంతులు, విరేచనాలు కావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేట్‌ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా వైద్యుడు పరిశీలించి మందులిచ్చి పంపాడు.

అయినప్పటికీ నయం కాకపోగా మరింత ఎక్కువ కావడం, నోట్లో నుంచి నురగ రావడంతో బెంబేలెత్తిన తల్లిదండ్రులు మళ్లీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యుడు చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలారు. విషపురుగు ప్రభావంతో ఇలా జరిగిందని వైద్యుడు నిర్ధారించాడు. తల్లి కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని హ్యాపీ బర్త్‌డే నాన్న లే అంటూ రోదించిన తీరు చూపరులను కలచివేసింది. విద్యార్థి మృతితో చేనేత కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement