ఉపాధ్యాయులతో విద్యార్థుల తల్లిదండ్రుల ఘర్షణ
దేవుదళ (రేగిడి) : విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగిన సంఘటన మంగళవారం రేగిడి మండలం దేవుదళ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థినులు, ఉపాధ్యాయులు, అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
పాఠశాలలో ఎనిమిది, తొమ్మిదో తరగతులకు చెందిన పలువురు విద్యార్థినులు మంగళవారం పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు.తెలుగు ఉపాధ్యాయుడు మండల వెంకటరమణ, వ్యాయామ ఉపాధ్యాయుడు యు.సుదర్శనరావు, పీఎస్ టీచర్ íపి. వెంకటేశ్వరరావులు తమతో అసభ్యకరంగా ప్రవరిస్తున్నారని ఆరోపించారు. వెంకటరమణ టీచర్ ప్రతిరోజూ అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బందులుకు గురిచేస్తున్నారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముడిదాన ఆనందరావు వద్ద వాపోయారు. ఈయన సర్దిచెప్పేలోగానే విషయం గ్రామస్తులకు చేరింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు, మరికొందరు గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులను నిలదీశారు. ఈసమయంలో అక్కడ ఘర్షణవాతావరణం చోటుచేసుకుంది.
మరోవైపు ఈ విషయాన్ని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న రేగిడి ఎస్‌ఐ వి.రమేష్ సిబ్బందితో కలిసి పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎంఈఓ ఎం.వి.ప్రసాదరావు పాఠశాల వద్దకు చేరుకుని పాలకొండ ఉప విద్యాశాఖాధికారి ఐ.వెంకటరావుకు సమాచారం అందించారు. ఆయన మండలంలోని సీనియర్ మహిళా ఉపాధ్యాయురాలు బి.విమలకుమారిని విచారణ అధికారిగా తీసుకొచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వివరాలు నమోదు చేసుకుని తాత్కాలికంగా వివాదానికి తెరదించారు. తరగతుల వారీగా విచారణ చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో పీఎస్ స్కూల్ అసిస్టెంట్ పి. వెంకటేశ్వరరావుపై ఎటువంటి ఆరోపణలు విద్యార్థుల నుంచి రాలేదని ఉప విద్యాశాఖాధికారి తెలిపారు.
టీడీపీ జెడ్పీటీసీ భర్తపై ఆరోపణలు..
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో వ్యాయామ ఉపాధ్యాయుడు యు.సుదర్శనరావు మండల టీడీపీ జెడ్‌పీటీసీ సభ్యురాలు మంతిన ఉషారాణి భర్త. ఈయన కొంతకాలంగా ఇక్కడ పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు మండల వెంకటరమణ ప్రస్తుతం మెడికల్ లీవులో ఉన్నారు. ఈయన ఈ నెల 2 నుంచి మెడికల్ లీవులో ఉన్నట్లు హెచ్‌ఎం ఎం.ఆనందరావు విలేకరులకు తెలిపారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఈయనపైనే ఆరోపణలు చేయడం గమనార్హం.
పక్షం రోజులుగా!
పాఠశాల హెచ్‌ఎం వద్దకు ఈ వివాదం పక్షం రోజులుగా నడుస్తున్నా పరిష్కరించకపోవడంపై డిప్యూటీ ఈఓ మండిపడినట్లు తెలిసింది. బాధిత విద్యార్థినులు గతంలోనూ ఈ విషయాన్ని పాఠశాల గణిత ఉపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లగా అప్పట్లో స్టాఫ్ సమావేశంలో ఈ అంశంను బయటకు రానివ్వకుండా హెచ్‌ఎం జాగ్రత్తపడటంతో పాటు ఉపాధ్యాయులను హెచ్చరించినట్లు కూడా తెలిసింది.
చర్యలు తప్పవు
విద్యార్థినుల ఆరోపణనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వద్ద కూడా వివరాలు సేకరించారు. మిగిలిన అంశాలను జిల్లా అధికారులు చూసుకుంటారు.
–ఐ. వెంకటరావు, డిప్యూటీ ఈఓ, పాలకొండ
కక్ష సాధింపు..
నేను ఎటువంటి తప్పు చేయలేదు. వ్యక్తిగత కక్షతో కిట్టని వారు ఇలా చేయిస్తున్నారు. విద్యార్థులకు లేనిపోనివి ఉసిగొల్పి తనపై ఆరోపణలు చేయించారు.
–సుదర్శనరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు, దేవుదళ