ప్రతి ఏటా నిరాశే!
అర్హుల దరి చేరని సబ్సిడీ రుణాలు
ప్రతి ఏటా పెరుగుతున్న ఆశావహులు
అనంతపురం సప్తగిరి సర్కిల్: పేదల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా అందజేస్తున్న సబ్సిడీ రుణాలు అర్హుల దరి చేరడం లేదు. లబ్ధిదారుల ఎంపికలో మితిమీరిన జోక్యం వల్ల అర్హులైన పలువురు అభ్యర్థుల్లో నిరాశ చోటు చేసుకుంటోంది. ప్రతి ఏటా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో బ్యాంకు లింక్‌జీ కింద 6,551 యూనిట్లు ఉండగా 23,022 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీలకు 650 యూనిట్లు మంజూరు కాగా 3,350 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో క్రిష్టియన్లకు జిల్లా వ్యాప్తంగా 60 యూనిట్లు మంజూరు కాగా 226 మంది, ముస్లింలకు 1,646 యూనిట్లు ఉండగా 15,226 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా మార్జిన్ మనీ సబ్సిడీ పథకం కింద 4,657 యూనిట్లు మంజూరు కాగా వీటికి 28,473 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీసీ అభ్యుదయ యోజన పథకం(12 మునిసిపాలిటీలకు మాత్రమే) కింద 572 యూనిట్లు ఉండగా 7,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాపు కార్పొరేషన్ పరిధిలో ఐదు వేల యూనిట్లు మంజూరు కాగా 14,585 మంది దరఖాస్తు చేసుకున్నారు.
సహకార సంఘాల్లోనూ
జిల్లా వ్యాప్తంగా 11 సహకార సంఘాలకు మొత్తం 240 యూనిట్లు మంజూరు కాగా వీటికి దరఖాస్తు చేసుకున్న వారు 24,300 మంది ఉన్నారు. రజక సహకార సంఘాలకు సంబంధించిన 16 యూనిట్లుకు 171 గ్రూపులకు చెందిన 2,030 మంది సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. నాయీ బ్రాహ్మణ సహకార సంఘానికి 21 యూనిట్లు మంజూరు కాగా 93 గ్రూపులకు చెందిన 1,154 మంది, వడ్డెర సహకార సంఘానికి 27 యూనిట్లు మంజూరు కాగా 336 గ్రూపులకు చెందిన 4,423 మంది, వాల్మీకి సహకార సంఘానికి 68 యూనిట్లు మంజూరు కాగా 811 గ్రూపులకు చెందిన 11,052 మంది, సగర(ఉప్పర) సహకార సంఘానికి 27 యూనిట్లు మంజూరు కాగా 140 గ్రూపులకు చెందిన 1,869 మంది, కృష్ణ బలిజ, పూసల సహకార సంఘానికి 13 యూనిట్లు మంజూరు కాగా 8 గ్రూపులకు చెందిన 96 మంది, భట్రాజు సహకార సంఘానికి 10 యూనిట్లు మంజూరు కాగా 13 గ్రూపులకు 170 మంది, కుమ్మరి శాలివాహన సహకార సంఘానికి 16 యూనిట్లు మంజూరు కాగా 122 గ్రూపులకు చెందిన 1,230 మంది, విశ్వ బ్రాహ్మణ సహకార సంఘానికి 10 యూనిట్లు మంజూరు కాగా 26 గ్రూపులకు చెందిన 353 మంది, మేదర సహకార సంఘానికి 12 యూనిట్లు మంౖజూరు కాగా 17 గ్రూపులకు చెందిన 201 మంది సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘానికి 20 యూనిట్లు మంజూరు కాగా 126 గ్రూపులకు చెందిన 1,722 మంది సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇంటర్వ్యూలు నిర్వహణలోనూ జాప్యం
అందిన దరఖాస్తులను ఆధారంగా చేసుకుని ఆగస్టు 1 నుంచి 15 వరకు అన్ని మండలాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉండగా నేటికీ జిల్లాలోని ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల్లో ఇంటర్వ్యూల ఊసే లేకుండా పోయింది. గతేడాది రుణాల మంజూరులో తీవ్ర అంతరాయం తలెత్తింది. నోట్ల రద్దు ద్వారా ఆయా బ్యాంకులు సబ్సిడీ రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టలేదు. నోట్ల రద్దు కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు చాలా సమయం పట్టింది. దీంతో గతేడాది అందాల్సిన రుణాలు ఈ ఏడాది జూన్‌లో అందించారు.