నల్లా.. నీరు నిల్లే..!
-
రూపాయి కనెక్షన్‌కు కుప్పలుగా దరఖాస్తులు
-
రెండు నెలలుగా ఎదురుచూస్తున్న ప్రజలు
-
ఉన్న కనెక్షన్లకే నీళ్లు లేవు.. కొత్త వాటికెలా..
-
తర్జన భర్జన పడుతున్న అధికారులు
-
విలీన పంచాయతీలకు విస్తరించని పైపులు
-
ఖమ్మం : మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి.. ఒక్క రూపాయికే నల్లా.. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు.. రెండు నెలలు గడిచినా దిక్కులేని కనెక్షన్లు.. ఉన్నవాటికే రెండు మూడు రోజులకోసారి నీరు.. ఏళ్ల నాటి పైపులైన్లు.. విలీన పంచాయతీలకు విస్తరించని పైపులు.. లీకేజీలు.. మరమ్మతులు.. ఆర్భాటంగా ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ అంటూ గుప్పించిన నేతల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. కనెక్షన్ కోసం డబ్బులు కట్టిన వారికి తొందరేమిటంటూ కార్పొరేషన్ అధికారుల ఈసడింపులు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిరుపేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగర మేయర్ పాపాలాల్, కమిషనర్, కార్పొరేటర్లు ఆయా డివిజన్లలో రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే నల్లా బిగిస్తామని నిరుపేదలకు హామీ ఇచ్చారు. నల్లా కనెక్షన్లు లేని వారు దరఖాస్తు చేసుకునేందుకు అధికారుల వద్దకు వస్తే.. ఇంటి పన్నులు సక్రమంగా చెల్లించిన వారికే కనెక్షన్ ఇస్తామని మెలిక పెట్టారు. దీంతో అప్పో సప్పో చేసి ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నుల బకాయిలు చెల్లించారు. ఒక్క రూపాయి నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్ నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలు పెట్టారు. ఇప్పటివరకు సుమారు 1,200లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా.. రూపాయి నల్లా కనెక్షన్ గురించి అంతగా పట్టించుకోవడం లేదని.. డబ్బులు కట్టి కనెక్షన్ తీసుకునే వారికే ఆలస్యమవుతుంది.. మీకేం తొందర అంటూ పలువురు అధికారులు చీదరించుకుంటున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు నెలలు దాటినా.. ఇప్పటివరకు 300 కనెక్షన్లు మాత్రమే మంజూరు చేయగా.. వీటిలో 100 కనెక్షన్లు కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం గమనార్హం.
కనెక్షన్లు సరే.. నీరెలా?
రూపాయికే నల్లా కనెక్షన్ వస్తుందని భావించిన నగర ప్రజలు పోటీపడి దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో గ్రీన్ జోన్ అంటే.. పైపులైన్, నీటి సరఫరా సక్రమంగా ఉన్న ప్రాంతం. బ్లూజోన్ అంటే.. నీటి వసతి ఉండి పైపులైన్లు లేని ప్రాంతం. రెడ్ జోన్ కింద పైపులైన్ లేకుండా, నీటి సరఫరా లేకుండా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. అయితే విలీన పంచాయతీలను కలుపుకొని నగరంలో 54వేల ఇళ్ల పరిధిలో 3.9లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుతం 32వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీరికి రోజుకు ఒక్కొక్కరికి 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలి. అంటే సుమారు 60 మిలియన్ లీటర్ల నీరు కావాలి. కానీ.. నగరానికి నీరు సరఫరా చేసే విభాగం ద్వారా కేవలం రోజుకు 40 మిలియన్ల లీటర్లు మాత్రమే సరఫరా చేసే సామర్థ్యం ఉంది. ఇప్పుడున్న కనెక్షన్లకే రెండు.. మూడు రోజులకోమారు నీటిని సరఫరా చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే నగరంలోని అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా చేయాలంటే 500 కిలోమీటర్ల పొడవున పైపులైన్లు వేయాలి. కానీ.. ఇప్పటి వరకు కేవలం 230 కిలో మీటర్ల మాత్రమే పైపులైన్లు ఉన్నాయి. అంటే 270 మీటర్ల పైపులైన్ లేకుండా.. నీరు సరఫరా చేయడం ఏలా సాధ్యమని అధికారులు అంటున్నారు. గత ఏడాది తాగునీటి కోసం మంజూరైన రూ.74కోట్లతో చేపట్టిన పనుల్లో సరితా క్లినిక్ నుంచి బోనకల్ రోడ్డు వరకు పైపులైన్ వేయకుండా పాత పైపులైన్‌కే కనెక్షన్ ఇచ్చారు. దీంతో అది తరచూ పగలడం, అది వర్షపు నీరు, ఇతర డ్రెయినేజీ నీటితో కలవడంతో కలుషిత నీటిని సరఫరా చేయడం.. అదీ కూడా రెండు మూడు రోజుల తర్వాత మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ఇలా విలీన పంచాయతీలు అల్లీపురం, దంసులాపురం, శ్రీనగర్ కాలనీతోపాటు నగరంలోని ఎత్తు ప్రాంతాలైన రమణగుట్ట, రంగనాయకులగుట్ట, బ్యాంక్ కాలనీ ప్రాంతాలకు సక్రమంగా పైపులైన్లు లేవు. ఎగువ ప్రాంతాల్లో ఇళ్లు ఉండటం వల్ల పైకి నీరు వెళ్లేంత ప్రెషర్ లేదు. ఉన్న పైపులైన్లు ఎప్పుడు లీకేజీ అవుతూనే ఉంటాయి.. ఇటువంటి పరిస్థితిలో రూపాయి నల్లా కనెక్షన్ ముందుకు సాగాలంటే ముందుగా పైపులైన్లు వేయడం.. నీటి సామర్థ్యం పెంపు చేపట్టాల్సి ఉంటుంది. అందుకే కొత్త కనెక్షన్లకు ఏ విధంగా నీరు ఇవ్వాలనే ఆలోచనలో అధికారులు, ప్రజాప్రతినిధులు తర్జన భర్జన పడుతున్నారు.