►టార్గెట్ ఎమ్మెల్యే సుజాత !
►ఎంపీ మాగంటి వర్గం తిరుగుబాటు
►చింతలపూడి టీడీపీలో రోడ్డెక్కిన గ్రూపులు
►మూకుమ్మడి రాజీనామాలకు అల్టిమేటం
ఏలూరు : చింతలపూడి నియోజకవర్గం అధికార పార్టీలో అంతర్గత కలహాలు రేగాయి. గ్రూపులు రోడ్డున పడ్డాయి. మూడేళ్లుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాతను టార్గెట్ చేస్తూ వచ్చిన ఎంపీ మాగంటి బాబు వర్గం ఇప్పుడు మంత్రి పదవి పోవడంతో నేరుగా రంగంలోకి దిగిపోయింది. తమ మాట నెగ్గకపోతే నాయకులంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ అల్టిమేటం కూడా ఇచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకున్నా.. పరిస్థితిలో మార్పు రాకుండా పోయింది.
ఏఎంసీ పాలకవర్గ నియామకమే విభేదాలకు కారణం
మూడేళ్లుగా ఏఎంసీ పాలకవర్గం నియామకం చేపట్టక పోవడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నిరాశను నింపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుజాత తన వర్గానికి చెందిన వ్యక్తులకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గం మాత్రం ఎంపీ మాగంటి బాబుతో అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చి తమ వర్గానికే ఈ పదవిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రెండు వర్గాలూ తమ వారికే ఏఎంసీ పాలకవర్గ చైర్మన్‌గిరీ ఇప్పించుకోవాలని పట్టుదలతో ఉండడంతో విభేదాలు రచ్చకెక్కాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ 2014 ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థిని గెలిపించిన నిజమైన కార్యకర్తలకు పార్టీలో విలువ లేదని ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పీతల సుజాత వర్గం మాత్రం దళిత మహిళ కావడంతో మొదటి నుంచి ఆమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు.
మొదటి నుంచీ కలహాలే
చింతలపూడి మార్గెట్ యార్డు చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే దానిపై మొదటి నుంచి పీతల సుజాత, మాగంటి బాబు వర్గాల మద్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఏఎంసీలకు చైర్మన్ల నియామకం జరిగిపోయినా.. ఇంతవరకూ చింతలపూడి ఏఎంసీ నియామకం జరగలేదు. ఇటీవల పార్టీ మండల అధ్యక్ష పదవులూ తమ వర్గానికే ఇవ్వాలంటూ ఎంపీ మాగంటి వర్గం పట్టుపడుతూ వచ్చింది. అయితే ఎమ్మెల్యే పీతల సుజాత తన వర్గం వారినే కొనసాగించేందుకు మొగ్గుచూపారు. దీంతో ఎంపీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల సమన్వయ కమిటీ సమావేశం ఎదుట కూడా ఇదే విషయంపై రచ్చ జరిగింది. తర్వాత అమరావతిలోనూ దీనిపై సమావేశం నిర్వహించినా ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరలేదు.
ఎంపీ వర్గం అల్టిమేటం
తాజాగా ఎంపీ వర్గానికి చెందిన నాయకులంతా మూకుమ్మడి రాజీనామాలకు అల్టిమేటం జారీచేశారు. మంగళవారం జంగారెడ్డిగూడెంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పీతల సుజాత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గంలో కమిటీలను పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా నియమించారని నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు నియోజకవర్గంలో పీతల సుజాత అంటే ఎవరో తెలియదని, అయితే తామంతా కలిసి కట్టుగా పనిచేసి పీతల సుజాతను అత్యధిక మెజార్టీతో గెలిపించామని, అయినా కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలోనూ ఒకసారి నాయకులంతా రహస్య సమావేశం నిర్వహించి పీతల సుజాతకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. ఇటీవల భీమడోలులో జరిగిన పార్టీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం సందర్భంగా, తర్వాత అమరావతిలో జరిగిన సమావేశంలోనూ పీతల సుజాత కమిటీలను పునర్‌వ్యవస్థీకరిస్తామని హామీ ఇచ్చారని నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు వెల్లడించారు. అయితే ఇది జరిగి చాలా రోజులు అయినా.. ఇప్పటికీ ఎటువంటి చర్యలూ లేవని, కేవలం పీతల సుజాత వల్ల నియోజకవర్గంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. త్వరలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి ఒక నిర్ణయానికి రానున్నట్టు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ పరిస్థితి గురించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు వెల్లడించారు.
సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ సమన్వయ కర్త మండవ లక్ష్మణరావు, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, నగరపంచాయతీ వైస్‌చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, కౌన్సిలర్ చింతల వెంకటేశ్వరరావు, అబ్బిన దత్తాత్రేయ, పెనుమర్తి రామ్‌కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, మందపల్లి లక్ష్మయ్య, తడికమళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.