పరువు తీసిన టీడీపీ ఏపీ కార్పొరేటర్లు
విజ్ఞాన యాత్రకు వెళుతూ రైల్లో మహిళపై అనుచిత వ్యాఖ్యలు
విజయవాడ సెంట్రల్: విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు 36 మంది గత నెల 29న ఉత్తర భారతదేశ విజ్ఞాన యాత్రకు వెళ్లారు. వీరిలో ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు గత నెల 30 రాత్రి రైల్లో మద్యం తాగి ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిసింది. దీంతో మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పూణే రైల్వే పోలీసులు రంగప్రవేశం చేసి కార్పొరేటర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. తామంతా విజయవాడ కార్పొరేటర్లమని, విజ్ఞాన యాత్రకు వచ్చామని చెప్పి ప్రాధేయపడడంతో పోలీసులు చీవాట్లు పెట్టి వదిలేసినట్లు సమాచారం. ఈ విషయం బుధవారం వెలుగులోకి రావడంతో నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మేయర్ కోనేరు శ్రీధర్ కూడా వారిని ఫోన్‌లో మందలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, మేయర్ కోనేరు శ్రీధర్‌తోపాటు మరో 22 మంది టూర్‌కి దూరంగా ఉన్నారు.