పెళ్లి ఇష్టం లేదని..
ఉపాధ్యాయురాలి బలవన్మరణం
మోర్తాడ్ (బాల్కొండ): పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మోర్తాడ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై అశోక్‌రెడ్డి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా అడవిరాజు పాలెం గ్రామానికి చెందిన దంపతులు ఉపాధి కోసం మోర్తాడ్‌కు వలస వచ్చారు. ఇక్కడే ఉంటూ జ్యూస్ స్టాల్ నడుపుతున్నారు. వారి కూతురు మద్దసాని మౌనిక (27) ప్రకాశం జిల్లాలోని యంత్రవల్లి గ్రామం పుల్ల చెరువు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.
వేసవి సెలువులు కావడంతో ఆమె మోర్తాడ్‌లో ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే, కూతురికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు, బంధువులు సంబంధాలు వెతుకున్నారు. తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనను ఎవరికో కట్టబెట్టాలని యత్నిస్తున్నారని కుమిలిపోయిన మౌనిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఎంతసేపు తలుపు తట్టినా తీయకపోవడంతో వారు స్థానికులకు సమాచారమిచ్చా రు.
చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా మౌనిక వేలాడుతూ కనిపించింది. విగత జీవిగా మారిన కూతుర్ని చూసి కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు.