ప్రాణం తీసిన ప్రతీకారం
డిష్ వైరు వివాదంలో వ్యక్తిహత్య
చేజర్ల : డిష్ వైరుపై తలెత్తిన చిన్నపాటి వివాదం చినికిచినికి ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన మండలంలోని మామూడూరు ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులు సమాచారం మేరకు.. కాలనీకి చెందిన మామూడూరు రమేష్ (23), దొంతాలి ప్రసాద్ మధ్య డిష్ వైరు విషయమై వివాదం ఉంది. రెండు నెలల క్రితం ఇద్దరు ఘర్షణ పడటంతో పోలీసులు ఇరువురిపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసుకున్నారు. అయితే తన అన్నపై దాడి చేశాడని రమేష్‌పై ప్రసాద్ సోదరుడు చిన్నప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. కొద్ది రోజులుగా చిన్నప్రసాద్ కత్తి చేతపట్టి రమేష్‌ను హతమారుస్తానని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటల సమయంలో రమేష్, అతని స్నేహితుడు మల్లికార్జున్ కాలనీలో వెళ్తుండగా ముందుగా పథకం ప్రకారం పక్కా ప్రణాళికతో కాపు కాసిన చిన్నప్రసాద్ వెనుకాలే వచ్చి కత్తితో ఒక్కసారిగా విచక్షణ రహితంగా మెడపై, చేతిపై నరికాడు. అప్రమత్తమైన మల్లికార్జున్ అడ్డుకోగా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను ఆటోలో చేజర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాలనీలో పోలీస్ పికెట్
ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన కాలనీ వాసుల్లో ఆందోళన నెల కొంది. సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, సీఐ ఖాజావళి, ఎస్సైలు కొండపనాయుడు, అబ్దుల్ రజాక్, సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టారు. కాలనీలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. హత్యకు పాల్పడిన దొంతాలి చిన్న ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లకు తాళాలు వేసి గ్రామం విడిచి పరారయ్యారు. డీఎస్పీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.