'సీను’ చకచకా మారిపోయింది | Visakhapatnam as a film hub says HRD minister Ganta Srinivas Rao | Sakshi
Sakshi News home page

'సీను’ చకచకా మారిపోయింది

Published Tue, Oct 13 2015 6:49 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

'సీను’ చకచకా మారిపోయింది - Sakshi

'సీను’ చకచకా మారిపోయింది

*ఫిల్మ్‌నగర్ కల్చరల్ సొసైటీకి ఆగమేఘాలపై భూమి కేటాయింపు
*లీజు ఖరారు కాకుండానే కోట్ల విలువైన భూమి ధారాదత్తం
 *వారంలోనే దస్త్రాలు సిద్ధం..
* తెరవెనుక 'గంటా' మంత్రాంగం

 
విశాఖపట్నం :  వందలకోట్ల విలువైన భూములను పప్పుబెల్లాల్లా పంచేస్తున్నారు. వడ్డించే వాడు మనవాడైతే అన్నట్టుగా ఉంది జిల్లాలో భూముల పందేరం పరిస్థితి. కనీసం లీజు ఎన్నేళ్లకు ఇస్తున్నాం? ఎంత మొత్తానికో కూడా ఖరారు చేయకుండానే ధారాదత్తం చేస్తున్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోనే శంకుస్థాపన చేసిన ఫిల్మ్‌నగర్ క్లబ్ కథా కమామిషు తెలుసుకుంటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
 
 
 హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న ఈ సొసైటీ కార్యకలాపాలను విశాఖలో విస్తరించేందుకు భూముల కేటాయింపు విషయమై తన బంధువైన ఓ సీనియర్ నిర్మాత ఒత్తిడితో మంత్రి గంటా శ్రీనివాసరావు తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు తెలిసింది. ఫిల్మ్ నగర్ సొసైటీకి భూముల కేటాయింపుపై అంతాతానై చక్రం తిప్పారు. వారంలోనే దస్త్రాలు సిద్ధమయ్యాయి. కాపులుప్పాడలో మంగమారిపేట పక్కనే తొట్లకొండను ఆనుకొని 395,413 సర్వే నెంబర్లలో ఉన్న 17 ఎకరాలను సొసైటీ పేరిట ధారాదత్తం చేశారు. ఇక్కడ గజం రూ.10వేల నుంచి 15 వేలవరకు ఉంది. 17 ఎకరాల మార్కెట్ విలువ అక్షరాలరూ.100కోట్లకు పైమాటే. ఈ భూముల ప్రభుత్వ విలువే గజం రూ.4,638గా నిర్ణయించారు. అంటే ఇక్కడ ఎకరా 2కోట్ల 22లక్షల 64వేలుగా జిల్లా కలెక్టర్ యువరాజ్ నిర్ణయించారు.

ఈ లెక్కన చూసుకున్నా 17 ఎకరాల విలువ రూ.37.85 కోట్లకు పైమాటే. ఇంత విలువైన భూమిని  ఎలాంటి సంప్రదింపులూ జరపకుండానే మంత్రి గంటా ఒత్తిడితో జిల్లాయంత్రాంగం సొసైటీపరం చేసింది. ఎన్నేళ్లకు ఇస్తున్నాం..ఎకరా ధర ఎంతకు ఇస్తున్నాం? అనేది కూడా నిర్ణయించలేదు. పైసా కూడా లీజు మొత్తం చెల్లించ లేదు. కనీసం భూములను అప్పగించే ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. అంతా గోప్యంగానే.

రెండ్రోజుల క్రితం ఏర్పాటు మీడియా సమావేశంలో ఫిల్మ్‌నగర్ సొసైటీకి 17 ఎకరాల కేటాయింపు విషయమై ప్రతిపాదన అందిందని.. లీజు నిర్ణయించలేదని అధికారికంగానే ప్రకటించారు. ఇంతలోనే భూమిని స్వాధీనం చేసుకుని ఫిల్మ్ నగర్ పెద్దలు ఆదివారమే భూమిపూజ చేశారు. సోమవారం సీఎం చంద్రబాబు ఎయిర్‌పోర్టులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేశారు.
 
 అప్పనంగా ఇస్తే ఊరుకోను..: ఎంపీ హరిబాబు
 ఎంపీ హరి బాబును ఆహ్వానించేందుకు సొసైటీ పెద్దలు  ప్రయత్నించగా ప్రతిఘటన ఎదురైంది. పరిశ్రమలకు, వాటర్ క్లబ్‌కు భూములివ్వ మని కోరితేలేవని చెబుతున్న జిల్లామంత్రులు ఏవిధంగా 17 ఎకరాలు కేటాయించారంటూ ఎంపీ వారిపై మండిపడ్డట్టు తెలిసింది. ఆర్‌టీఐ ద్వారా వివరాలు సేకరిస్తా..సీఎంను సైతం నిలదీస్తానంటూ తీవ్ర స్థాయిలో వారిని హెచ్చరించినట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement