బాహుబలిలా ప్రయత్నించి.. ప్రాణం కోల్పోయాడు
పెద్దపల్లి (కరీంనగర్): ఎంతో ఎత్తయిన కొండపై నుంచి జలపాతాలు ఎగసి పడుతుంటే ఆ కొండపైకి చేరుకోవాలన్న పట్టుదలతో శివుడు (ప్రభాస్) పడే కష్టాన్ని బాహుబలి సినిమాలో చూసే ఉంటారు. అది సినిమా. కానీ, వాస్తవంలో అలానే ప్రయత్నించి ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సినిమాలో అయితే సెట్టింగులు, వెనక రక్షణ కోసం వైర్లు.. అన్నీ ఉంటాయి. నిజజీవితంలో అవేవీ ఉండవని తెలియక.. పట్టుమని పాతికేళ్లు కూడా రాకుండానే ప్రాణాలు కోల్పోయాడు.
కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎలుకలపల్లి గ్రామానికి చెందిన షబ్బీర్ (23) శుక్రవారం స్నేహితులతో కలిసి పెద్దపల్లి మండలం గట్టు సింగారం జలపాతాలు చూసేందుకు వెళ్లాడు. స్నేహితుల ముందు అతడు వీరోచిత ప్రదర్శనలు చేయాలనుకున్నాడేమో! కొండ పైన ఫీట్లు చేస్తుండగా జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.