21న వైఎస్ జగన్ జన్మదినం
- మెగా రక్తదాన శిబిరం విజయవంతం చేయండి
- యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి పిలుపు
అనంతపురం రూరల్ : వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హాజరై మెగా రక్తదాన శిబిరం పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువజ విభాగంలో రాజకీయ కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను సైతం విస్తృతంగా చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈనెల 21న అనంతపురంలోని సిద్ధార్థ పంక‌్షన్ హాల్‌లో వెయ్యి యూనిట్లు రక్తం సేకరించడమే లక్ష్యంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, విద్యార్థి, యువజన విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకర్గం నుంచి 100 మందికి తక్కువ కాకుండా రక్తదానం చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రక్తదానం చేయాల్సిన వారు తమ నియోజకవర్గంలోని సమన్వయకర్త దగ్గర ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రక్తదానం ఆవశ్యకతపై యువత, విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్ రాగే పరశురాం, సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, నదీమ్ యువజన విభాగం నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మారుతీనాయుడు, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, రైతు విభాగం నాయకులు యూపీ నాగిరెడ్డి, అనీల్‌కుమార్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.