బాబు ప్రోత్సాహంతోనే శిల్పాపై హత్యాయత్నం
►రౌడీషీటర్‌కు గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారు?
►అభిరుచి మధును తక్షణమే అరెస్టు చేయాలి
►వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతోనే నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు జరిగాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే దాడి జరగడం దారుణమని పేర్కొన్నారు. అసలు నంద్యాలలో ఎన్నికల కోడ్ ఏమైందని అధికారులను ప్రశ్నించారు. ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన చక్రపాణిరెడ్డిపై కాల్పులు జరిపి హతమార్చేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణమైన సంఘటనగా పేర్కొన్నారు.
అసలు రౌడీషీటర్‌కు గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారని, కోడ్ అమలులో ఉండగానే తుపాకీతో కాల్పులు జరపడానికి అవకాశం కల్పించిందెవరని ప్రశ్నించారు. టీడీపీ రౌడీషీటర్ నడిరోడ్డుపై కత్తులతో స్వైరవిహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎన్నికల నిబంధనలు టీడీపీకి వర్తించవా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైనా జీవో ఇచ్చారేమో చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రౌడీషీటర్ అభిరుచి మధును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.