2011-12లో భారత్‌లో పేదరికం 29.6 శాతం | C Rangarajan Committee on Poverty presented its report to Union Government | Sakshi
Sakshi News home page

2011-12లో భారత్‌లో పేదరికం 29.6 శాతం

Published Thu, Jul 10 2014 2:48 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

2011-12లో భారత్‌లో పేదరికం 29.6 శాతం - Sakshi

2011-12లో భారత్‌లో పేదరికం 29.6 శాతం

 వార్తల్లో వ్యక్తులు
 ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి పర్యటన
 ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ భారత పర్యటనలో జూలై 1న ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. పారిస్ సందర్శించవలసిందిగా ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె ఆహ్వానాన్ని మోడీకి అందజేశారు.
 
 ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ పర్యటన
 ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ భారత్‌లో 5 రోజులపాటు పర్యటించారు. శాండ్‌బర్గ్ ప్రధాని నరేంద్రమోడీని కలిసి సామాజిక మాధ్యమాల వినియోగంపై చర్చించారు. ఫేస్‌బుక్ సీఓఓ అయిన తర్వాత షెరిల్ తొలి విదేశీ పర్యటన ఇది.
 
 బెర్కిలీ న్యాయ వర్సిటీ డీన్‌గా సుజిత్ చౌదరి
 కాలిఫోర్నియాలోని బెర్కిలీ న్యాయ విశ్వవిద్యాలయం డీన్‌గా క్రిస్టోఫర్ ఎడ్లీ స్థానంలో భారత సంతతికి చెందిన సుజిత్ చౌదరి జూలై 1న నియమితులయ్యారు. ఈ హోదాను అలంకరించిన తొలి భారతీయ సంతతి వ్యక్తి చౌదరి. ఢిల్లీలో జన్మించిన చౌదరి టొరంటో, హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల నుంచి న్యాయవిద్యలో పట్టాలను పొందారు.
 
 మిజోరం గవర్నర్‌గా కమలా బెనివాల్
  గుజరాత్ గవర్నర్ కమలా బెనీవాల్‌ను మిజోరం గవర్నర్‌గా జూలై 6న నియమించినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఆమె పదవీ కాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. కాగా ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ ఆల్వాకు గుజరాత్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మిజోరం గవర్నర్‌గా ఉన్న పురుషోత్తమన్‌ను నాగాలాండ్ గవర్నర్‌గా పూర్తి బాధ్యతలు, త్రిపుర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
 
 జాతీయం
 దేశంలో అత్యంత వేగవంతమైన రైలు

 దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఢిల్లీ-ఆగ్రాల మధ్య విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేసే ఈ రైలుని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జూలై 3న ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఆగ్రాకు ప్రయాణ కాలం 120 నిమిషాలు. దీన్ని మరింత తగ్గించాలనే లక్ష్యంతో ఈ రైలును ప్రవేశపెట్టారు. నవంబర్ నుంచి ఈ రైలు సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
 
 దరఖాస్తులో మూడో వర్గాన్ని చేర్చిన ఫెర్గూసన్ దేశంలో మొదటిసారిగా పూణెకు చెందిన ఫెర్గూసన్ కాలేజీ దరఖాస్తు ఫారాల్లో మూడో లింగవర్గాన్ని (థర్డ్ జెండర్) జతచేసింది. 2014-15 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నిమిత్తం చేపట్టిన ప్రక్రియలో ఈ మార్పులను చేసింది. హిజ్రాలను (లింగమార్పిడి) మూడో లింగవర్గంగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 15న ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఫెర్గూసన్ కాలేజీ ఈ నిర్ణయం తీసుకుంది.
 
 రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా ఒంటె
 రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెను తమ రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. తగ్గిపోతున్న ఒంటెల సంఖ్యను అడ్డుకునేందుకు జూలై 1న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఒంటెల అక్రమ రవాణా, వథ నివారణకు కొత్త చట్టాన్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఆహార భద్రత కార్యక్రమంలో ఒంటె పాలను కూడా రాజస్థాన్ రాష్ట్రం చేర్చనుంది. 1997లో 6.68 లక్షలున్న ఒంటెల సంఖ్య 2008 నాటికి 4.30 లక్షలకు పడిపోయింది.
 
 ముగిసిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
 లడఖ్‌లో మూడో విడత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జూన్ 29న ముగిశాయి. ఇందులో ఇరాన్, కొరియాకు చెందిన పలు చిత్రాలను ప్రదర్శించారు. బాలీవుడ్ చిత్రం కాఫిరోన్ కి నమాజ్ (ద వర్జిన్ ఆర్గ్యుమెంట్స్) అత్యధికంగా నాలుగు అవార్డులను పొందగా, ఇరాన్‌కు చెందిన వెట్ లెటర్స్ మూడు అవార్డులను అందుకుంది.
 
 నిత్యావసర జాబితాలో ఉల్లి, బంగాళాదుంప
 ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం
 1955 కిందకు తెచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జూలై 2న ఆమోదం తెలిపింది. తద్వారా ఉల్లి, బంగాళాదుంపల లభ్యతను పెంచేందుకు, వాటి ధరలను నియంత్రించేందుకు వీలవుతుంది.
 
 ఉధంపూర్- కాట్రా రైలు మార్గం ప్రారంభం
 జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్-కాట్రా రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్రమోడీ జూలై 4న ప్రారంభించారు. ఈ మార్గం వల్ల వైష్ణోదేవీ ఆలయానికి చేరుకోవడం సులభమవుతుంది. 26 కిలోమీటర్ల ఈ రైలు మార్గాన్ని రూ.1,132.74 కోట్లతో నిర్మించారు. ఇదే పర్యటనలో నియంత్రణ రేఖవద్ద 240 మెగావాట్ల యూరి-2 జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.
 
 2011-12లో భారత్‌లో పేదరికం 29.6శాతం
 2011-12లో భారత్‌లో పేదరికం 29.6 శాతం ఉన్నట్లు రంగరాజన్ కమిటీ పేర్కొంది. కమిటీ పేదరికంపై తన నివేదికను ఇటీవల కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. రోజుకు పట్టణంలో రూ.47, గ్రామాల్లో రూ. 32 కంటే తక్కువ ఖర్చు చేసేవారిని పేదవారిగా రంగరాజన్ కమిటీ పేర్కొంది. 2009-10లో 38.2 శాతంగా ఉన్న పేదరికం 2011-12 నాటికి 29.6 శాతానికి తగ్గినట్లు కమిటీ తెలిపింది. గతంలో టెండూల్కర్ కమిటీ 21.9 శాతం పేదరికం ఉందని పేర్కొంది. దీనిపై విమర్శలు తలెత్తడంతో 2013లో కేంద్రం రంగరాజన్ కమిటీని నియమించింది.
 
 అంతర్జాతీయం
 అఫ్గాన్‌కు నూతన స్వేచ్ఛాయుత వీసా విధానం
 అఫ్గానిస్థాన్ దేశస్థుల కోసం నూతన స్వేచ్ఛాయుత వీసా విధానాన్ని భారత్ జూన్ 30న ప్రకటించింది. ఈ నిర్ణయం జూలై 1నుంచి అమల్లోకి వచ్చింది.
 
 అంటార్కిటికాలో పర్వతానికి సిన్హా పేరు
 అంటార్కిటికా ఖండంలోని ఓ పర్వతానికి భారత-అమెరికన్ శాస్త్రవేత్త అఖౌరి సిన్హా పేరు పెట్టారు. పరిశోధకుడిగా ఆయన అందించిన సేవలకు గుర్తుగా అంటార్కిటికాలోని మెక్ డొనాల్డ్ హైట్స్ దక్షిణ భాగంలో 930 మీటర్ల ఎత్తున్న ఓ పర్వతానికి మౌంట్ సిన్హా అని పేరు పెట్టేందుకు అమెరికా జియోలాజికల్ సర్వే , అంటార్కిటిక్ పేర్లపై ఏర్పాటైన సలహా సంఘం జూన్ 30న నిర్ణయించింది. సిన్హా మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో జన్యుశాస్త్రం, సెల్ బయాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
 
 కార్బన్ డై ఆక్సైడ్ అంచనాకు నాసా ఉపగ్రహం
 వాతావరణంలో ఉండే కార్బన్‌డై ఆక్సైడ్ (బొగ్గు పులుసు వాయువు)ను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రత్యేక ఉపగ్రహాన్ని జూలై 2న విజయవంతంగా ప్రయోగించింది. ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ -2 గా పిలిచే ఈ ఉపగ్రహ ం వల్ల భూమి మీద ఏయే ప్రాంతాల నుంచి అధికంగా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందో తెలుసుకోవచ్చు.
 
 మారకేశ్ ఒప్పందాన్ని ఆమోదించిన భారత్
 ప్రచురణలను అంధులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన మారకేశ్ ఒప్పందాన్ని భారత్ జూన్ 24న ఆమోదించింది. తద్వారా ఈ ఒప్పందంపై సంతకం చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ ఒప్పందాన్ని 2013 జూన్ 27న ప్రపంచ మేధోసంపత్తి హక్కుల సంస్థ (వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్)లోని 79 దేశాలు అంగీకరించాయి. ఈ ఆమోద పత్రాన్ని మేధో సంపత్తి హక్కుల సంస్థకు భారత్ సమర్పించింది. 20 దేశాలు ఆమోదిస్తే ఈ మారకేశ్ ఒప్పందం అమల్లోకి వస్తుంది. దీనిపై సంతకాలు చేసిన దేశాలు ప్రచురితమైన గ్రంథాలను బ్రెయిలీ లిపిలో అందుబాటులోకి తెచ్చేందుకు చట్టాలు రూపొందించాలి.
 
 యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడిగా జీన్‌క్లౌడ్
 యూరోపియన్ కమిషన్ నూతన అధ్యక్షుడిగా జీన్ క్లౌడ్ జంకర్ జూన్ 26న ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు జోస్ మాన్యుఎల్ బరోసో స్థానంలో ఆయన ఈఏడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు. జీన్ క్లౌడ్ 1995 -2013 వరకు లక్సెంబర్గ్ ప్రధానిగా, 2005-13 మధ్య యూరో సమాఖ్య తొలి శాశ్వత అధ్యక్షుడిగా పనిచేశారు. యూరో దేశాల సమాఖ్యలో ఒక దేశానికి సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన ఘనత క్లౌడ్‌దే.
 
 క్రీడలు
 వింబుల్డన్ విజేతలు

 మహిళల సింగిల్స్: పెట్రో క్విటోవా (చెక్ రిపబ్లిక్). ఫైనల్లో యూజీవ్ బౌచర్డ్ (కెనడా)పై విజయం.
 పురుషుల సింగిల్స్: నొవాక్ జొకోవిచ్ (సెర్బియా). ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)పై విజయం.
 మహిళల డబుల్స్: సారాఎరాని, రాబెర్టావిన్సీ జోడి (ఇటలీ)
 పురుషుల డబుల్స్: వాసెక్ పాస్ప్‌పిసిల్ (కెనడా), జాక్‌సోక్(అమెరికా) జోడీ. మిక్స్‌డ్ డబుల్స్: నీనద్ జిమోంజిక్ (సెర్బియా), సమంతాస్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీ.
 
 బ్రిటీష్ గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్
  బ్రిటీష్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిది ఐదో విజయం.
 
 ఆనంద్‌కు రష్యా ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అవార్డు
 భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రష్యా సమాఖ్యకు చెందిన ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇజ్రాయెల్‌కు చెందిన మరో చెస్ క్రీడాకారుడు బోరిస్ గేల్‌ఫాండ్‌ను కూడా ఎంపికచేసినట్లు జూలై 4న ఫిడే ప్రకటించింది. ఈ అవార్డును ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రష్యాతో స్నేహ పూర్వక, సహకార సంబంధాల విస్తరణకు కృషిచేసిన విదేశీయులకు గుర్తింపుగా ప్రదానం చేస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement