జనమేజయం | Jaya Nama Samvatsara Ugadi | Sakshi
Sakshi News home page

జనమేజయం

Published Mon, Mar 31 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

Jaya Nama Samvatsara Ugadi

చింతపట్ల సుదర్శన్
 ‘ద్వినేత్రం ఏకలక్ష్యం
 ఏక లక్ష్యం గ్రహాధిపత్యం
 గ్రహాధిపత్యం సమన్యాయం
 సమన్యాయం కురుకురు’
 
 రెండు కళ్లూ మూసుకుని జపం చేసుకుంటున్నాడు చంద్రుడు. అదో దర్బారు హాలు. అక్కడ దేవుళ్ల అఖిలపక్ష సమావేశం జరుగుతున్నది. భూమ్మీదకు వస్తున్న ‘జయ’నామ సంవత్సరం వెంట గవర్నింగ్ బాడీగా ఎవరెవర్ని పంపాలన్నదాని మీద ‘హాట్‌హాట్’ చర్చలు జరుగుతున్నవి. మరీ వేడెక్కిన బుర్రల వాళ్లు కొందరు కిరీటాలు తీసి జుత్తు పీక్కుంటున్నారు.
 ఈసారి భూమ్మీద జయను మానిటర్ చెయ్యడానికి యే గ్రహాన్ని రాజ్యాధిపతిగా పంపడం అన్నది ముందుగా డిసైడ్ చేద్దాం అన్నాడు దేవుళ్ల సి.ఇ.వో.
 
 ఈ సంవత్సరానికి చంద్రున్ని రాజును చేస్తే సరి అన్నాడో గాడ్ ఆ గోడ చాటు నుంచి.
 అవునవును చంద్రునికి బ్రెయినెక్కువ అన్నారెవరో ఈ గోడ వెనుక నుంచి
 ఎవర్రాఅదీ... ముందుకొచ్చి కూయండి మతీశ్రుతీ  తప్పినట్టున్నా యిరా మీకు అన్నాడు గురుడు కుర్చీలోంచి లేవడానికి అవస్థ పడుతూ
 ఆవేశపడకండి గురూజీ మీకసలే హైబీపీ. సమస్యల్ని సంప్రదింపుల్తో పరిష్కరించుకుందాం. అందుకే గదా ఈ అఖిలపక్షం అన్నాడు ‘హెడ్ గాడ్’.
 
 చంద్రుడికేం తక్కువ. మచ్చొక్కటి వున్నంత మాత్రాన రాజవ్వద్దా అనరిచారెవరో.
 ఎందుకవ్వాలి? చంద్రుడి సంగతి అందరికీ తెల్సిందే కదా. తారతో అతని తిరుగుళ్లు గుర్తుకు వచ్చి వూగిపోయాడు గురుడు కానీ నలుగురిలో ఆ ప్రసక్తి బాగుండదని తమాయించుకుని
 ముక్కోటి దేవుళ్ల ప్రతిని ధులారా.. దేవుళ్ల పార్లమెంటు మెంబర్లారా చంద్రు డికి ఈ మధ్య చూపు సరిగ్గా ఆనడం లేద ని, తిరుగుడు కళ్ల జబ్బని, తను ఏ వైపు చూస్తు న్నాడో ఎవరికీ అర్థం కావడం లేదనీ తెలియ వచ్చింది. ‘డ్యూయల్‌సైట్’ ప్రాబ్లమ్ వున్న ఇతగాడికి గ్రహాధిపత్యం అప్పగించడం అన్యాయమే కాదు ఘోరం.. మహాపాపం కూడా అన్నాడు
 
 ఈ మాటలకు చిర్రెత్తి చేసుకుంటున్న మంత్రజపం డిస్‌కంటిన్యూ చేసి కనుబొమలెగరేసుకుంటూ చూపుడు వేలు తిప్పుకుంటూ లేచి నిలబడ్డాడు చంద్రుడు.
 
 నాది చూపు కాదు ‘విజన్’. మాములు చూపు కాదది అదో ముందు చూపు. కాలానికీ, దూరానికీ అంతుచిక్కని చూపు. నేను రెండు కళ్లతో రెండు వైపులా చూడగలను. కుడివైపు చూస్తున్నప్పుడు ఎడమవైపు ఎవడు కొంప ముంచుతాడోనని ఎడం కన్ను ఎడమవైపే చూస్తుంది. ఎడమవైపు చూస్తున్నప్పుడు కుడివైపు ఎవడు కొంప కూల్చుతాడోనని కుడి కన్ను కుడివైపే చూస్తుంది. ఇది గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలు నేర్చిన నాకే సాధ్యం అన్నాడు పైకి. మనసులో మాత్రం
 నా చూపు ఓ హైడ్రామా.. దాని ఏకైక లక్ష్యం వేరే అనుకుంటూ కుర్చీలో కూచుని ‘సమన్యాయం కురుకురు’ జపం మళ్లీ ఆరంభించాడు.
 
 చంద్రుడి నేత్ర విజ్ఞాన శాస్త్రం అర్థం కాక సభికులు మొగాలు చూసుకున్నారు.
 
 ఇంతలోనే జెయింట్ పూల బాణంతో భుజమ్మీద ఎర్రముక్కు రామచిలకతో వచ్చాడు మన్మథరావు.
 రారా! కొత్త సంవత్సరం జయతో పాటు వెళ్లడానికి వసంతుడూ, కోయిల్లూ రడీనే కదా. ఈ సంవత్సరానికి రాజూ మంత్రీ సేనాధిపతీ రసాధిపతి నీరసాధిపతి ఎవరో తేల్చడానికే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అన్నాడు ‘గాడ్స్ కే గాడ్’
 
 ముందు రాజెవ్వడో తేల్చండి అన్నాడు గురుడు అనీజీగా కమండలం నేల కోసి కొడ్తూ..
 చూపు శాస్త్రం బాగా తెల్సిన మన్మథరావు చంద్రుడి చూపులపై రగడ జరుగుతున్నదిక్కడ. నీవేమైనా ఈ చిక్కు విప్పగలవా అనడిగాడు బాస్.
 
 నాకు తెల్సినవి దొంగచూపులూ, ఓరచూపులూ, చిలిపిచూపులే కాని రెండు చూపుల గురించి తెలీదంటూ సెలైంటయిపోయాడాయన.
 
 గురుడు గుర్రుమన్నాడు. కట్టి పెట్టవోయ్ నీ నేత్రావధానం. పూర్వం నీకు భూమ్మీద అధికారమిస్తే యేం వెలగబెట్టావు. ఉద్యోగుల్నీ, రైతుల్నీ వికలాంగుల్నీ, మహిళల్నీ రాచిరంపాన పెట్టలేదూ. ఎవర్ని వదిలావు. అందరి ఉసురు పోసుకున్నావు గనకనే నీకు ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చంద్రామణీ’ అనే బిరుదు ఇచ్చారు కదా అంటూ చెప్పరాని బూతుల్తో వుతికి ఆరేశాడు వెండి గడ్డం చంద్రుడ్ని గురుడు.
 చంద్రుడిందుకు సమాధానం చెప్పలేక తన దగ్గరున్న వెయ్యిన్నొక్క హామీల చిట్టా గడగడా చదివి వినిసించాడు. సందట్లో సడేమియాలా లేచా డు బుధుడు పల్చటి గడ్డం తో కల్సిపోయిన మీసాల్తో. చంద్రుడూ గురువేనా పోటీ పడేది. గడ్డం గీసుకునే సింహాన్ని నేను. నాకు దమ్మూధైర్యం సాహసం వున్నాయి. ఒక చెంప మీద కొట్టి చూడండి. రెండు చెంపలూ పగలగొడ్తా.. అంటూ వీరంగం చేశాడు.
 నేనసలు గ్రౌండులోనే లేననుకుం టున్నారా? అంటూ ఎంటరయ్యాడు రవికిరణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సరంజామాతో.
 
 వచ్చావా. ఈ మధ్య నీ కిరణాలకేదో వైరస్ సోకిందంటున్నారు అన్నాడు బుధుడు వెక్కిరిస్తూ
 నాపేరు సీతయ్య కాదు అయినా నేనెవరి మాటావిన్ను. నా స్ఫూర్తి క్రీడా స్ఫూర్తి. ఆఖరి బంతిని కూడా బౌండరీ దాటించకుండా వదల్ను. నా పట్టే పట్టు. పట్టిన పట్టూ ఎత్తిన బ్యాటూ దించేది లేదు అన్నాడు రవి.
 
 చెప్పావులే సెల్ఫ్ వికెట్ అవుటని అంటున్నారు. అలీబాబా అరడజను దొంగలన్నట్టు ఆ ఆరుగురినీ పెట్టుకుని ఏం పీకుతావులే గడ్డీ, ఆ గురుడి గడ్డమూ తప్ప అన్నాడు బుధుడు సినిమా స్టయిల్లో.
 ఏ పాపమూ తెలియని నన్ను బలి పశువును చేశారు చేతులు నెప్పెట్టినా చివరిదాకా ఫైళ్లు సంతకం చేశాను. నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయని ప్రెస్‌మీట్లు పెట్టాను. నేను నమ్ముకున్నవాళ్లు జంపు జిలానీలయినా నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం నేనున్నాను అంటూ గొంతు చించుకున్నాడు సూర్యుడు.
 
 అరచి అరచి అలసిపోయిన ప్రధాన గ్రహాలు మాటల్తో లాభం లేదని చేతుల్ని యాక్టివేట్ చేశారు. చంద్రుడు గురుడి గడ్డం దొరకబుచ్చు కున్నాడు. గురుడు చంద్రుడి కాలర్ పట్టుకున్నాడు. బుధుడూ రవీ డబ్లుడబ్లుఎఫ్ మొదలెట్టారు. తర్వాత ఏం జరిగిందో దేవుళ్లకే ఎరుక! టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. హాలు తలుపులు మూశారని, లోపల దండాలు విరిగాయని కమండలాలు పగిలాయని, గడ్డాలు విగ్గులు వూడివచ్చేట్టు తన్నులాట జరిగిందని వార్తలు లీకయ్యాయి. చివరికి ఎంపికయిన గవర్నింగ్ బాడీతో భూమ్మీదకు లాండయిపోయింది జయనామ సంవత్సరం.
 ఇక ఈ లాండ్ మీద ఉగాది పచ్చడితో చేదు రుచి చూపించేది ‘జయ’ ఎవరికి ‘జయం’ ప్రసాదించాలో నిర్ణయించేది చూపుడువేలు మీద చుక్క పెట్టించుకునే సామామాన్యులే!



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement