ఒక్క ముస్లిం ఎంపీ లేని ఉత్తరప్రదేశ్
దేశ చరిత్రలో తొలిసారి ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఈ సారి ఎన్నిక కాలేదు. దేశంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రమైన యూపీలో ఒక్క ముస్లిం కూడా ఎన్నిక కాకపోవడం చాలా మంది రాజకీయ పరిశీలకులను కంగు తినిపించింది.
ఉత్తరప్రదేశ్ లో కనీసం 35 ఎమ్మెల్యే సీట్లలో ముస్లిం ఓట్లు 33 శాతం వరకూ ఉంటాయి. మరో 38 చోట్ల వారి జనాభా 21 నుంచి 30 శాతం వరకూ ఉంటుంది. ఇంకో 145 స్థానాల్లో వారి జనాభా 11 నుంచి 20 శాతం వరకూ ఉంటుంది. అంటే మొత్తం 218 సీట్లలో ఎన్నికల ఫలితాలను ముస్లింలు ప్రభావితం చేయగలరు. కానీ అన్ని రాజకీయ లెక్కల్నీ తారుమారు చేస్తూ అత్యధిక ముస్లింటున్న సహారన్ పూర్, అమ్రోహా, శ్రావస్తి, బిజ్నోర్, ముజఫర్ నగర్, మురాదాబాద్, రామ్ పూర్ లలో తొలి సారి ముస్లిం అభ్యర్థులు ఓడిపోయారు.
ఇప్పటికే దేశంలోని పలు అసెంబ్లీలలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. గుజరాత్, ఢిల్లీ, ఉత్తరాంచల్, హర్యానా, పంజాబ్, హిమాచల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ముస్లిం ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు. ఆ జాబితాలో ఉత్తరప్రదేశ్ కూడా చేరింది.