‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
* మన తలరాతలు మార్చే ఎన్నికలు జరగబోతున్నాయి
* ఈ ఎన్నికల్లో పేదల గుండె చప్పుడు తెలిసిన వ్యక్తినే సీఎంగా ఎన్నుకుందాం..
* వైఎస్ సువర్ణయుగాన్ని తిరిగి తెచ్చుకుందాం
* చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. అందుకే అధికారం కోసం సాధ్యంకాని హామీలిస్త్తున్నారు
* బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లయితే.. రూ.1.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటున్నారు
* నేను చంద్రబాబులా విశ్వసనీయత లేని, నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను
సాక్షి ప్రతినిధులు, విజయవాడ/ఏలూరు/కాకినాడ/ విశాఖపట్నం: ‘‘మరో ఐదురోజుల్లోపు మనం ఎన్నికలకు పోతున్నాం. ఈ ఎన్నికల్లో ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటుతో మన తలరాతలను మార్చుకోబోతున్నాం. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏ నాయకుడైతే ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో.. పేదవాడి మనసెరుగుతాడో.. చనిపోయిన తర్వాత కూడా పేదవారి గుండెల్లో నిలిచి ఉండాలని ఆరాటపడతాడో అటువంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తినే మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలి. అప్పుడే మన తలరాతలు మంచిగా మారతాయి.
ఈ ఎన్నికల్లో ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే.. మరోవైపు కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు పోటీపడుతున్నాయి. ఈ పోటీలో విశ్వనీయతకు ఓటేయండి.. ఆ దివంగత నేత కలలుగన్న సువర్ణయుగాన్ని మనందరం కలసికట్టుగా తెచ్చుకుందాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం ముందు సాగిలపడి మోకరిల్లే చంద్రబాబు నాయుడు కావాలో, కేంద్రం మెడలు వంచే జగన్‌మోహన్‌రెడ్డి కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో నిర్వహిస్తోన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ శనివారం ఒకేరోజు నాలుగు జిల్లాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాలకు హెలికాప్టర్‌లో వెళ్లి సభల్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం, విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించిన సభలకు పోటెత్తిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ఉద్వేగలంగా ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
ప్రధానిని మనమే నిర్ణయిద్దాం..
ఈ రోజు రాష్ట్రాన్ని విభజించిన సోనియా గాంధీకి, అందుకు పూర్తిగా మద్దతిచ్చిన నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు.. వీళ్లెవ్వరికీ మన మీద ప్రేమ లేదు. వీరికెవ్వరికీ మనమీద ఆప్యాయత లేదు. వీరికి కావాల్సిందల్లా ఓట్లు, సీట్లే. అందుకోసం ఏ గ డ్డి అయినా తింటారు. వీళ్లను ఎవరినీ నమ్మొద్దు. మన ప్రాంతంలో 25 ఎంపీ స్థానాలున్నాయి. ఒక్క సీటు కూడా పక్కకు పోకుండా 25 సీట్లను మనమే గెలుచుకుందాం. మన రాష్ట్రానికి మంచి చేస్తామని ఆ రోజు ఎవరు ముందుకు వస్తారో చూసి వారినే ప్రధాని సీట్లో కూర్చోబెడదాం. ఆ రోజు నరేంద్ర మోడీ కావచ్చు.. ఎల్లయ్య కావచ్చు.. పుల్లయ్య కావచ్చు.. ఎవరైనా కూడా మన రాష్ట్రం కోసం మనం చెప్పిన విధంగా నడచుకుంటామంటేనే వారిని ప్రధాన మంత్రి సీట్లో కూర్చోబెడదాం.
మొన్నటిదాకా తామే తెలంగాణ ఇచ్చామన్నారు..
ఈ రోజు రాజకీయ వ్యవస్థ ఎంతగా చెడిపోయిందంటే మొన్నటికి మొన్న ఇదే చంద్రబాబు, బీజేపీ నాయకులు అందరూ కూడా తిరుపతిలో మీటింగ్ పెట్టారు. తర్వాత ఐదారు మీటింగ్‌లు సీమాంధ్రలో పెట్టారు. వీళ్లు ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ కూడా తెలంగాణలో ఎన్నికలు అయ్యే దాకా ఏ రోజూ కూడా మాట్లాడలేదు. నరేంద్రమోడీ నుంచి సుష్మాస్వరాజ్ వరకు కూడా తెలంగాణలో పర్యటించినప్పుడు.. తాము మద్దతు ఇచ్చాం కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, లేదంటే తెలంగాణ రానే రాదని చెప్పుకొచ్చారు. ‘‘నేనిచ్చిన లేఖతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. నేను ఆ లేఖను వెనక్కు తీసుకొని ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు’’ అని చంద్రబాబు అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే వీరందరూ కూడా తెలంగాణలో 30వ తేదీన ఎన్నికలు అయిపోయిన రాత్రికి రాత్రే మాట మార్చేశారు. తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టి.. జగన్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అభాండాలు వేశారు. వీళ్లు అసలు రాజకీయ నాయకులేనా?
ఐదేళ్లలో ఒక్క మేలైనా చేశారా?
నిన్నటికి నిన్న ఇదే నరేంద్ర మోడీ, చంద్రబాబు వచ్చి తమకు ఓటేస్తే ఏమేమో చేస్తామని హామీలు గుప్పించారు. ఆకాశం నుంచి స్వర్గాన్ని అలాఅలా కిందికి తీసుకొస్తామని చెప్పారు. అయితే వారిని ఒక మాట అడుగుతున్నా... 1999 నుంచి 2004 వరకు ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో బీజేపీ చక్రం తిప్పాయని చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటే ఒక్క మేలు ఏంటో చెప్పగలరా అని చంద్రబాబును, బీజేపీని అడగదలచుకున్నా. రాష్ట్రం అంతా వెయ్యి కిలోమీటర్ల తీరం ఉందని, చంద్రబాబుకు ఓటేస్తేగొప్పగా బాగు పరుస్తారని మోడీ అంటున్నారు. ఇదే బీజేపీ, ఇదే చంద్రబాబులను ఒకటి అడగదలచుకున్నా.. 1999 నుంచి 2004 వరకు మీరు కలసి ఉన్నపుడు అప్పుడు మీకు ఈ వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం కనిపించలేదా? పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు నిర్మించాలని నాడు మీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారికివి గుర్తుకు రాలేదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి వీళ్లకు ఇప్పుడు ఇవి గుర్తుకు వస్తున్నాయి. కానీ, నేను మాటిస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరలోనే పూర్తి చేస్తా.’’
బాబూ.. దొంగ హామీలు కాదా?
‘‘చంద్రబాబు నాయుడు రకరకాల హామీలు ఇస్తున్నారు. దొంగ హామీలు ఇస్తున్నారు. అబద్ధాలు ఆడుతున్నారు. ఈ రోజు ‘ఈనాడు’ పత్రిక చదివితే నిజంగా మనసు తరుక్కుపోయింది. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ దిగజారిపోయారు. రైతన్నలకు రూ. 1.27 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటున్నారు. డ్వాక్రా రుణాలు రూ. 20 వేల కోట్లు మాఫీ చేస్తానంటున్నారు. ఈయన మాఫీ చేస్తానంటున్న వాటి మొత్తం విలువ లక్షన్నర కోట్ల రూపాయలు. మన బడ్జెట్ చూస్తే 1.25 లక్షల కోట్లయితే ఈయన ఇన్నిన్ని హామీలు ఇస్తున్నారు. ఒకవైపు 1.27 లక్షల కోట్ల రుణాలున్నాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ధారిస్తే ఇదే చంద్రబాబు వక్తలు టీవీల వద్దకు వెళ్లి ఒకడు 20 వేల కోట్లు, ఒకడు 30 వేల కోట్లు, ఒకడు 10 వేల కోట్లు అని చెప్తారు. అంటే 1.27 లక్షల కోట్లున్న రైతు రుణాలను వీళ్లంతట వీళ్లే దాన్ని ఇప్పుడే రూ.20 వేల కోట్లు లేదా రూ.10 వేల కోట్లకు కుదించి మాట్లాడుతున్నారంటే వీళ్ల చిత్తశుద్ధి ఏమిటో ఇప్పుడే అర్థమవుతోంది. రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లుంటే చంద్రబాబు మాత్రం ఇంటికో ఉద్యోగం ఇస్తానని అబద్ధమాడుతున్నాడు. 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు 65 ప్రభుత్వ సంస్థలను మూసివేయించి 26 వేల మందిని నడి రోడ్డు మీద నిలబెట్టింది చంద్రబాబు కాదా? స్వాతంత్య్రం వచ్చాక 60 ఏళ్లలో అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో అన్నీ కలిపి 20 లక్షల ఉద్యోగాలుంటే చంద్రబాబు మాత్రం 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పట్టపగలే అబద్ధాలు ఆడుతున్నాడు.’’
మోడీ.. దీనికెవరు కారణం?
‘‘ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్ దండిగా ఉందని, దీంతో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు. మన రాష్ట్రంలోని గ్యాస్‌లో మనకు ఎంత వాటా ఇస్తారో చెప్పకుండా.. మన గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం విడ్డూరం. ఇక్కడి గ్యాస్‌ను గుజరాత్‌కు తీసుకెళ్తున్నారు. గుజరాత్‌లో గ్యాస్ సిలెండర్ రూ. 200కు ఇస్తారు. మన రాష్ట్రంలో మాత్రం రూ. 450కు అమ్ముతున్నారు. దీనికి బాధ్యులెవరని అడుగుతున్నా.’’
విశ్వసనీయతకే ఓటేద్దాం
Published Sun, May 4 2014 2:02 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement