మరిన్ని పార్టీల మద్దతు కూడగట్టే యోచనలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టడానికి అధికార కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కొత్త మిత్రులను కూడగట్టుకుని విస్తృత యూపీఏ-3 ఏర్పాటు ఆలోచనల్లో మునిగింది. నాయకత్వం విషయంపై నోరుమెదపకుండానే బీజేపీ ప్రధాని అభ్యర్థిని నరేంద్ర మోడీని ఎలాగైనా కట్టడి చేసే పనిలో పడింది. అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు వచ్చే సీట్లను బట్టి తగిన నిర్ణయాలు ఉంటాయని కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నేత పేర్కొన్నారు. బాధ్యత గల జాతీయ పార్టీగా దేశ ప్రయోజనాల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తుందని, ఆ దిశగా భావ సారూప్య పార్టీలతో కలిసి పనిచేస్తామని వివరించారు.
ప్రాంతీయ పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్యపైనే తర్వాతి పరిణామాలు ఆధారపడి ఉంటాయని, వాటిలో కొన్ని ఎట్టిపరిస్థితుల్లో మోడీతో చేతులు కలపలేవని వ్యాఖ్యానించారు. పార్టీల సీట్ల సంఖ్యను బట్టి నాయకత్వం విషయంలో తమ పార్టీ పట్టువిడుపుల ధోరణి అనుసరిస్తుందని సదరు నేత చెప్పారు. అలాగని 20 సీట్లు వచ్చిన పార్టీ.. వంద సీట్లు వచ్చిన పార్టీకి నేతృత్వం వహించే ప్రయత్నం చేయబోవని, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకే కాంగ్రెస్ కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు.
విస్తృత యూపీఏ-3కి యత్నాలు
Published Thu, May 8 2014 4:17 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement