సాక్షి, ఏలూరు : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ల పరిధిలోని ఏలూరు, దెందులూరు, పెదపాడు, పెదవేగి, భీమడోలు, నిడమర్రు, చింతలపూడి, ద్వారకాతిరుమల, గణపవరం, ఉంగుటూరు, టి.నర్సాపురం, కామవరపుకోట, లింగపాలెం, టీపీగూడెం, పెంటపాడు, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కొయ్యలగూడెం, గోపాలపు రం మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించారు. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో కొన్ని గంటలపాటు పోలింగ్ నిలిచిపోయింది. జీలుగుమిల్లి మండల పరిధిలోని దర్భగూడెం, జీలుగుమిల్లి, పి.అంకంపాలెంలో రాత్రి 11 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. ఓటరు స్లిప్పుల్లో తేడాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.
స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతమే
తొలివిడత పోలింగ్ నిర్వహించిన 22 మండలాల్లో 413 ఎంపీటీసీ స్థానాలకు , 22 జెడ్పీటీసీ పదవులకు 64 మంది తలపడ్డారు. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా మిగతాచోట్ల ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఏలూరు మండలం మానూరులో ఓటరు స్లిప్పు లు అందలేదని కొందరు మహిళలు పోలింగ్ బూత్ వద్ద ఆందోళనకు దిగారు. పెంటపాడులో ఎస్‌టీవీఎన్ హైస్కూల్ వద్ద టీడీపీ మద్దతుదారులు ఓటర్లకు సొమ్ములు పంచారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. దెందులూరు మండలం దోసపాడులో బ్యాలెట్ పేపర్‌లో టీడీపీ గుర్తు వద్ద ఇంకుముద్ర ఉండటంతో వైసీపీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. రిటర్నింగ్ అధికారి, అడిషల్ జేసీ నరసింగరావు అక్కడకు చేరుకుని ఆ బ్యాలెట్ పేపర్లను పరిగణనలోకి తీసుకునేది లేదని చెప్పడంతో పరిస్థితి చక్కబడింది. పెదపాడు మండలం తోటగూడెంలో వేరే ఊరి వాళ్లు వచ్చి గలాటా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఏలూరు డీఎస్పీ సత్తిబాబు లాఠీచార్జీ చేసి బయటవారిని చెదరగొట్టారు. పెదవేగి మండలం కొప్పాకలో టీడీపీ నాయకులు సొమ్ము పంపిణీ చేస్తుండగా వైసీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి డబ్బు పంచుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. జానంపేటలోనూ టీడీపీ డబ్బు పంచడాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో ఇరువర్గాలు కొట్లాటకు దిగడంతో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
రాట్నాలగుంటలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగింది. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తపై దాడిచేసి గాయపరి చారు. జానంపేట, రాట్నాలకుంట ఘర్షణల్లో గాయాలపాలైన వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెదవేగిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో వైసీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ఊరంతా జీపులో తిప్పి గాయపరచడంతో అవమానంగా భావించిన ఆ వ్యక్తి అప్పటినుంచి కనిపించకుండాపోయాడు. సాయంత్రం ఇంటికి చేరి వైసీపీ కార్యకర్తలతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. కొండలరాయుడుపాలెంలో పోలిం గ్ బూత్‌కు సమీపంలోని టీడీపీ కార్యకర్తలు పార్టీ గుర్తుతో ప్రచారం చేయడంతో వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఉంగుటూరు మండలం కైకరం, చేబ్రోలు, నీలాద్రిపురం, ఉప్పాకపాడులో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జీలుగుమిల్లి మండలం దర్భగూడెం, జీలుగుమిల్లి, పి.అంకంపాలెం, పండువారిగూడెం గ్రామాల్లో ఓటరు స్లిప్పుల్లో తేడాల వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొడటంతో ఉదయం అన్ని పార్టీలు రాస్తారోకో చేశాయి. దీంతో దాదాపు 3గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది. బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెంలో స్వతంత్ర అభ్యర్థి బన్నె రాములమ్మ తనకు కేటాయించిన కత్తెర గుర్తు నోటీసు బోర్డులో చిన్నగా ఉందంటూ దాదాపు అరగంటపాటు పోలింగ్‌ను అడ్డుకున్నారు. గుర్తు పెద్దదిగా చేసిన తర్వాతే ఆందోళన విరమించారు. నల్లజర్ల మండలం జగన్నాథపురంలో టీడీపీ అభ్యర్థి పంచిన రూ.వెయ్యి నోట్లు నకిలీవనే కలకలం రేగింది. అయితే అవి 2005కు ముందు ముద్రించినవిగా గుర్తించారు.