పిల్లలు... చినుకులు... తల్లులు...
వర్షాకాలంలో ఏ సమయంలో వాన పడుతుందో ఎవరికీ తెలీదు. గంటల తరబడి ట్రాఫిక్ జాములు, ఆరోగ్యసమస్యలు వంటివి ఎన్నో మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇవన్నీ ఒక రకం సమస్యలైతే ఈ కాలంలో తల్లులకు మరో టెన్షన్. అదే పిల్లల సంరక్షణ. పెద్దలు తీసుకునేంత జాగ్రత్తలు పిల్లలు తీసుకోలేరు. వారికి ఆ అవగాహన కూడా ఉండదు. కాబట్టి తల్లులు తమ పిల్లలు స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్లాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ కింది చిట్కాలను పాటిస్తే సరి.
పిల్లలను స్కూల్‌కు పంపేటప్పుడు వీలయినంతవరకు వాటర్ ప్రూఫ్‌వే ఉపయోగిస్తే మంచిది. మంచి రెయిన్‌కోట్, గొడుగు, షూజ్ తప్పక పిల్లలకు కొనిపెట్టాల్సిందే. ఇవి లేకుండా పిల్లలను ఇంట్లోంచి బయటికి పంపకండి.వర్షంలో పిల్లల టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్ తడిసి, పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బుక్స్ అన్నింటినీ ఓ పాలిథిన్ కవర్‌లో ఉంచి, దానిని బ్యాగ్‌లో పెట్టాలి.
{పథమ చికిత్స తప్పనిసరి: పిల్లలు వర్షంలో ఆడటానికి ఎంతో ఇష్టపడతారు. వద్దన్నా వినరు. అలా ఆడేటప్పుడు తరచూ దెబ్బలు తాకుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఈ కాలంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా సోకే అవకాశం ఉండటం వల్ల రోజూ రెండుసార్లు యాంటీ ఫంగల్ సోప్‌తో స్నానం చేయిస్తే మంచిది.
ఆరోగ్యకర ఆహారం: ఈ వర్షాకాలంలో ముఖ్యంగా నీరు, ఆహారం కలుషితమవుతాయి. దాని కారణంగా పిల్లలు జబ్బు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారు బయటి ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అలాగే స్కూల్ బ్యాగ్‌లో వాటర్ బాటిల్ పెట్టడం మరచిపోవద్దు.