వానొస్తే అంతే
సాక్షి, సిటీబ్యూరో: ఉన్నట్టుండి ఏకధాటి వాన.. నగరమంతా హైరానా. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. ఇళ్లకు చేరాల్సిన వారు వర్షంలో చిక్కుకుపోయారు. బస్తీల్లోకి వాన నీరు పోటెత్తింది. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మంగళవారం మాత్రమే కాదు.. ఏటా సీజన్‌లో వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సీన్. పదేపదే ఇదే పరిస్థితి తలెత్తుతున్నా యంత్రాంగం శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోతోంది.
వానా కాలం కష్టాలను తొలగిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు నీటి మీద రాతలే అవుతున్నాయి. నిజానికి మే నెలాఖరు నాటికే పూడికతీత, రోడ్ల ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం జూలై మూడో వారం ప్రారంభమైనా పనులు పూర్తికాలేదు. వానాకాలం కార్యాచరణ ప్రణాళికపై తాజాగా మంగళవారం మేయర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జీహెచ్‌ఎంసీ పనితీరుకు అద్దం పడుతోంది. ప్రణాళికలు రూపొందిస్తున్నా.. కార్యాచరణ కొరవడటంతో ప్రజల కడగండ్లు తీరడం లేదు.
సొంత లాభం కొంత మానితే..
ప్రజలకు అందుబాటులో ఉండేది తామేనని, సమస్యలొస్తే ప్రజలు నిలదీసేది తమనేనని చెప్పే కార్పొరేటర్లు వివిధ అంశాలపై గందరగోళం సృష్టిస్తున్నప్పటికీ.. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. డీసిల్టింగ్, డెబ్రిస్ తొలగింపు వంటి పనులకు అవి పూర్తయినట్లు కార్పొరేటర్ల నుంచి ‘సంతృప్తికర’ లేఖలు అందాలనే నిబంధన విధించారు. దీన్ని ఆసరా చేసుకున్న పలువురు కార్పొరేటర్లు.. పనులు చేపట్టే కాంట్రాక్టర్లు తమను సంతృప్తి పరిస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో కాంట్రాక్టర్లు సైతం కార్పొరేటర్లను మచ్చిక చేసుకొని వారు కోరినది వారికిస్తూ పనులు సంతృప్తికరంగా చేశారనే సర్టిఫికెట్లు పొందుతున్నారు.
ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం తాజాగా వర్షాకాల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించిన మేయర్ మాజిద్ హుస్సేన్ నాలాల డీసిల్టింగ్ పనులు పూర్తయినట్లు.. వారి నుంచి సంతృప్తికర లేఖలు పొందాలని చీఫ్ ఇంజినీర్‌కు సూచించారు. డీసిల్టింగ్ పనులు దాదాపు అన్నీ పూర్తయ్యాయని ఇంజినీర్లు చెబుతుండగా, కేవలం 12 మంది కార్పొరేటర్ల నుంచి మాత్రమే సంతృప్తికర లేఖలందాయి. మిగతా కార్పొరేటర్ల నుంచి రెండ్రోజుల్లోగా సదరు లేఖలు పొందాలని మేయర్ ఆదేశించారు. అంటే.. జరగబోయేదేమిటో ఎవరైనా ఊహించుకోవచ్చు. పనులపై కార్పొరేటర్ల అజమాయిషీ, పర్యవేక్షణ ఉండటం మంచిదే కానీ.. దీన్ని ఆసరా చేసుకుంటున్న కార్పొరేటర్లు పనులే జరగకున్నా తమ ‘ప్రయోజనాన్ని’ చూసుకుంటున్నారు. పనులెలా ఉన్నా తమ ముడుపు తమకు ముడితే చాలునన్నట్లు వ్యవహరిస్తున్న కార్పొరేటర్ల తీరు గ్రేటర్‌వాసులను ఏటా సీజన్‌లో ఇక్కట్ల పాల్జేస్తోంది.
వారంలో కార్పొరేటర్ల బడ్జెట్ మంజూరు
జలమండలి తదితర విభాగాలకు సంబంధించిన పనులకు కార్పొరేటర్ల బడ్జెట్ నిధులను వాడుకునేందుకు తీర్మానం చేయాల్సిందిగా కమిషనర్ సోమేశ్‌కుమార్ మేయర్ మాజిద్‌ను కోరగా, అందుకు సమ్మతించిన ఆయన ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రోలర్లు లేనందున రహదారులు వేసినా ప్రయోజనం కనిపించడం లేదని పలువురు మేయర్ దృష్టికి తేవడంతో వాటిని కొనాలని నిర్ణయించారు. కార్పొరేటర్ల బడ్జెట్ నిధులు వారంలోగా మంజూరు చేయాలని కమిషనర్ జోనల్ కమిషనర్లకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్, ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు.