ఎవరూ మాట్లాడని చలం నవల- మార్తా
ప్రేమంటే ఏమిటి? చలంగారు బహుశా తన జీవితమంతా ఈ ప్రశ్న మీదనే ఆలోచిస్తూ వచ్చారు. ‘శశిరేఖ’ నుంచి ‘జీవితాదర్శం’ వరకు దాదాపు ముప్పై యేళ్ల పాటు ఆయన దానికి సంబంధించిన తన అంతర్మథనమంతా 8 నవలల్లో ఇమిడ్చి పెట్టారు. వాటిల్లో ‘అమీనా’ కావడానికి చిన్న నవలే అయినా రాయడానికి చాలా కాలం పట్టిన నవల. మొదటి రెండు భాగాలూ 1926లో రాస్తే తర్వాత రెండు భాగాలూ 1942లో రాశారు. అంతకాలం పాటు ఆయన దృష్టి పెట్టిన నవల కాబట్టి ‘అమీనా’ చలం అంతఃకరణ చిత్రణ అని ఆర్.ఎస్.సుదర్శనం అంటారు. ప్రేమ గురించి, జీవితం గురించి, స్త్రీపురుష సంబంధాల గురించి చలం అన్వేషణ ‘పురూరవ’ నాటకంతోనూ, ‘జీవితాదర్శం’ నవలతోనూ పరిపూర్ణతకి చేరుకున్నట్టు చాలామంది భావిస్తారు.
అయితే చలం జీవితకాల అన్వేషణ పరిపూర్ణతకి చేరుకున్న రచన ఇదేదీ కాదు. ఆయన అరుణాచలానికి వెళ్లి పదేళ్లు గడిచిన తర్వాత రాసిన నవల ‘మార్తా’. అందులో ఆయన తనను వేధిస్తున్న సామాజిక, మానసిక, కళాత్మక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ ఒక సమాధానం కోసం వెతికారు. కానీ ఆ నవల గురించి ఎవరూ ఎక్కడా ఏమంత మాట్లాడినట్టు కనిపించదు. 1961లో రాసిన ఆ పుస్తకాన్ని ఆళ్ల గురుప్రసాదరావు 2000లో తిరిగి ముద్రించే దాకా అటువంటి రచన ఒకటుందని కూడా ఎవరికీ పెద్దగా తెలిసినట్టు లేదు. ‘మార్తా’ బైబిల్లో సువార్తల్లో కనవచ్చే ఒక పాత్ర. ముఖ్యంగా లూకా సువార్తలో (10:38-40) నాలుగు వాక్యాల్లో పేర్కొన్న ఒక సంఘటన మీద చలం ఆ నవల రాశారు. సువార్తలో ఆ సన్నివేశం ఇట్లా ఉంది:
‘యేసు, ఆయన శిష్యులు తమ దారిలో ఒక గ్రామాన్ని చేరుకున్నప్పుడు మార్తా అనే ఒక స్త్రీ ఆయన్ను తన ఇంటికి ఆహ్వానించింది. ఆమెకి మరియ అనే సోదరి కూడా ఉంది. యేసు రావడంతోనే మరియ ఆయన పాదాల దగ్గరే కూర్చుండి ఆయనేది చెప్తే అది వింటూ ఉండిపోయింది. ఇంటికొచ్చిన అతిథికి చెయ్యవలసిన ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్న మార్తా ఏసు దగ్గరకు వచ్చి ‘ప్రభూ.. చూడు.. మా చెల్లెలు పనులన్నీ నాకు వదిలేసి నీ దగ్గరకొచ్చి కూచుంది. ఆమెని నాకు సాయం చెయ్యమని చెప్పవూ?’ అనడిగింది.
అందుకు ఏసు ‘మార్తా... నువ్వు చాలా వాటి గురించి ఆలోచిస్తున్నావు. ఆందోళన పడుతున్నావు. కాని నిజంగా పట్టించుకో వలసింది కొన్ని విషయాలే. ఆ మాటకొస్తే ఒకే ఒక్క విషయం మటుకే. ఏది మంచిదో దాన్నే మరియ ఎంచుకుంది. దానిని ఆమె నుంచి ఎవరూ తీసుకోలేరు’ అన్నాడు.
నాలుగైదు వాక్యాల ఈ సన్నివేశం గొప్ప ఆధ్యాత్మిక చర్చకు కేంద్రంగా నిలబడింది. కర్మ, భక్తి, యోగాలకు చిహ్నాలుగా నిలబడ్డ ఆ ఇద్దరు అక్కచెల్లెళ్లనీ, యేసునీ కలిపి చిత్రించడానికి ప్రసిద్ధి చెందిన ప్రతి పాశ్చాత్య చిత్రకారుడూ ఉత్సాహపడ్డాడు. అయితే చలం ఆ కథని చెప్పాలనుకోవడానికీ, చెప్పిన సమయానికీ చాలా ప్రత్యేకత ఉంది. ఆయన జీవించిన జీవితం- అంటే బ్రహ్మసమాజం రోజుల నుంచీ అరుణాచలంలో తొలినాళ్ల దాకా మార్తాలాగా ‘చాలా విషయాల గురించి’ పట్టించుకున్న జీవితం. చాలావాటి గురించి ఆందోళన చెందిన జీవితం. కాని మరియలాగా నిజంగా పట్టించుకోవలసినవి కొన్ని మాత్రమేననీ ఆ మాటకొస్తే ఒకే ఒక్కటి మాత్రమేననే మెలకువ కలుగుతున్న కాలంలో ఆయన ఈ నవల రాశారు.
అంతే కాదు చలం మొదటి 8 నవలల్లో భాషకీ శైలికీ ఈ నవలలో భాషకీ శైలికీ మధ్య చాలా వ్యత్యాసముంది. అమీనా నవల చివరి భాగాల నాటికే చలంకు తన శైలిపట్ల అసహనం స్పష్టపడింది. ‘నా శైలీ నా రచనలూ తగలబడనూ నా అమీనా.. నా అమీనా’ అన్న వాక్యం మీద సుదర్శనం చాలానే చర్చించారు. మార్తా నవలా శైలి వేరు. అప్పటికి చలం గీతాంజలితో సహా టాగోర్ కవిత్వాన్ని చాలానే తెలుగులోకి తీసుకు వచ్చారు. గీతాంజలి అనుసృజన చేసిన కలం మాత్రమే మార్తా నవల రాయగలదనిపిస్తుంది. కేవలం శైలి మాత్రమే కాదు బైబిల్‌ని నిర్దుష్టంగా చదువుకున్నవాడు మాత్రమే అటువంటి కథనానికి పూనుకోగలడు. అంత విస్పష్టమైన బైబిల్ పాండిత్యం మరే తెలుగు రచయితలోనూ మనకి కనబడదు. అప్పటికే చలం నాలుగు సువార్తల్నీ ‘శుభవార్తలు’ పేరిట తెలుగు చేయడం కూడా అందుకు కారణం కావచ్చు.
ఏసు ప్రేమని, ఆయన యెరుషలేంలో అడుగుపెట్టడాన్ని, ఆయన్ను సుగంధతైలంతో మూర్ధాభిషిక్తుణ్ణి చెయ్యడాన్ని, ఆయన్ను శిలువ వెయ్యడాన్ని, సమాధిలో ఉంచబడటాన్ని, తిరిగి పునరుత్థానాన్నీ ఇవన్నీ చూసిన మహిళలుగా మార్తా, మేరీ, మేరీ మాగ్దలేనూ బైబిల్లో ప్రసిద్ధి చెందారు. అందులో శిలువ వెయ్యబడ్డ దృశ్యం వరకూ చలం తన నవలలో చిత్రించారు. పునరుత్థానాన్ని వదిలి పెట్టేశారు. అయితే తన నవలని మరింత మాతృహృదయస్ఫోరకంగా ముగించారు. సువార్తల్లో చెదురుమదురుగా ఉన్న కొన్ని వాక్యాలు ఆధారంగా మార్తా కథ చెప్పడంలో చలం చూపించిన కథనకౌశలం గురించి మరింత వివరంగా ముచ్చటించు కోవాలి. కాని ఆ కథ ద్వారా ఆయన తన జీవితకాలం అన్వేషణకొక సమాధానం వెతుక్కున్నారని మాత్రం చెప్పితీరాలి.
మళ్లా మన ప్రశ్న దగ్గరికే వద్దాం. ప్రేమంటే ఏమిటి? బహుశా దాన్ని మనం రెస్పాన్సిబిలిటీ అనో ఇర్రెస్పాన్సిబిలిటీ అనో వివరించలేం. మనం ప్రేమ పేరిట ప్రతి అనుబంధాన్ని బంధంగా మారుస్తున్నట్టున్నాం. అందుకే ఉక్కిరిబిక్కిరవు తున్నాం. కాని నిజంగా చెయ్యవలసింది ప్రతి బంధాన్ని అనుబంధంగా మార్చుకోవడం. రామాయణంలో రాముడు చేసిందీ బైబిల్లో ఏసు చేసిందీ అదే.
చలంగారు మార్తా నవల ద్వారా సాధించిన సమాధానమిదేనననుకుంటాను.
- వాడ్రేవు చినవీరభద్రుడు
9490957129