![Guru Nanak Was Born Into A Hindu Family - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/10/GURU.gif.webp?itok=cm2X-kD6)
విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు మతం లేదు. అతడు ఏ మతానికీ చెందిన వాడు కాదు. అతడు కాలానికి అతీతుడు. జనన మరణ చక్రానికి మించినవాడు. సృష్టికర్త ఈ విశ్వంలో ప్రతి ఒక్కరికీ ఆహారమూలాన్ని సృష్టించాడు. రాతిలోని పురుగుకు కూడా ఆహారాన్ని ఉంచాడు. మనిషికి పుట్టుక ఎంత సహజమో మరణమూ అంతే సహజం. ఈ ప్రపంచం తాత్కాలిక నివాసం... అని సృష్టికర్త తత్వాన్ని బోధించాడు గురు నానక్.
గురు నానక్ దేవుడిలో ఏకత్వాన్ని విశ్వసించాడు. నానక్ గొప్ప కవి, సంగీతకారుడు, తత్వవేత్త, శాస్త్రాలను ఔపోశన పట్టిన వాడు.నానక్ హిందూ కుటుంబంలో పుట్టాడు. అయితే ఆయన తనను తాను ఒక మతానికి పరిమితం చేసుకోలేదు. అన్ని మతాలలో ఉన్న మంచి బోధనలను స్వీకరించి తనను తాను మహోన్నతమైన వ్యక్తిగా మలుచుకున్నాడు.
తాను నమ్మిన మంచిని ఇతరులకు బోధించాడు. ‘మనం తినే దాన్ని ఇతరులతో పంచుకోవాలి. అవసరమైన వ్యక్తికి సహాయం చేయాలి. మనిషి తాను బతకడానికి డబ్బు సంపాదించాలి. అయితే అది దోపిడీ, మోసాలతో కూడుకున్నది కాకూడదు. నిజాయితీతో కూడిన సంపాదనతోనే జీవించాలని చెబుతూ... మానవులందరూ సమానమే. కులం, మతం, మత వివక్ష ఉండరాదని గురు నానక్ బోధించాడు. వివిధ వర్గాల ప్రజలను కలిసి కూర్చోమని ప్రోత్సహించాడు. సమసమాజాన్ని ఆకాంక్షించాడు. తాను నమ్మిన విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం జీవితాన్ని అంకితం చేశాడు.
సృష్టికర్తను నిత్యం ప్రార్థించాలి
మనిషి తన సొంత ప్రయోజనం కోసం తోటి వ్యక్తిని మోసం చేయకూడదు. అందం, యవ్వనం పట్ల మితిమీరిన మక్కువను పెంచుకోరాదు. అలా మక్కువ పెంచుకున్నవాడు మలమూత్రపు పురుగుగా పుడతాడని హెచ్చరించాడు నానక్. మనిషి తన సంపద, బలం, శక్తి సామర్థ్యాలను చూసుకుని గర్వించరాదని కూడా చెప్పాడు గురునానక్. అలా అహంకరించిన మనిషి విషయంలో అతడి అహంకారమే అతడిని మింగేసే రాక్షసునిగా మారుతుందని చెప్పాడు.
నిత్యం సృష్టికర్తను ప్రార్థిస్తూ వినయంగా జీవించాలి.ఆ వినయమే మనిషిని కాపాడే రక్షణ కవచమవుతుందని కూడా బోధించాడు. మనిషి గురువును ఎంచుకోవడంలో విజ్ఞత చూపించాలి. ఇక ఆ గురువే అతడిని నడిపిస్తాడు. సామాన్యుడికి సృష్టికర్తను బోధపరచగలిగిన వాడు గురువు. మనిషి గొప్ప మార్గంలో నడవడానికి, ‘దేవుడు ఉన్నాడు’ అని అనుకోవటానికి అవసరమైన విశ్వాసాన్ని మనిషిలో పాదుకొల్పగలిగిన వాడే గురువు అని గురువు ప్రాధాన్యతను వివరించాడు గురునానక్.
– రవీందర్ కౌర్
Comments
Please login to add a commentAdd a comment