హెయిరావతం | hair and dandruff problems and health tips | Sakshi
Sakshi News home page

హెయిరావతం

Published Wed, Nov 23 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

హెయిరావతం

హెయిరావతం

జుట్టు ఎంత కాస్ట్‌లీ గురూ! మొన్న శ్రీశైలంలో 25 లక్షల విలువైన జుట్టును ఎవరో ఎత్తుకుపోయారు. ఊడిపోతుందన్న భయం మాత్రమే కాదు... ఎత్తుకుపోతారన్న భయం కూడా! అంత కాస్ట్‌లీ అన్నమాట. అందుకే... హెయిర్ ఐరావతం. డెఫినెట్‌గా... హెయిరావతం. ఈ కాస్ట్‌లీ హెయిర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడం ఎలా? జుట్టుకు ఏమేం చిక్కులుంటాయి? వాటిని విప్పడం ఎలా? ఆయిల్ కంటే  మంచి సొల్యూషన్... ఈ ఆర్టికల్..

ప్రతివారూ తమ జీవితంలోని ఏదో ఒక దశలోనైనా తమ జుట్టు రాలిపోతుందని భావించడం అందరూ చేసే సాధారణ ఫిర్యాదే. కొందరికి మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు. మరికొందరిలో మందుల వల్ల కావచ్చు. ఇంకొందరికి ఇన్ఫెక్షన్లూ... ఇతర కారణాలూ ఉండవచ్చు. సమస్య ఏదైనా జుట్టు రాలడం మాత్రం కామన్. వారివారి పరిస్థితులను బట్టి వారికి జుట్టెందుకు రాలుతుందో... ఆ సమస్యను అధిగమించడానికీ, అరికట్టడానికి ఉన్న మార్గాలేమిటో తెలుసుకునేందుకు ఉపయోగపడే అంశాలివి. జుట్టు రాలడాన్ని అరికట్టుకోవడానికి ఇక చదవండి. చదివించండి.

జుట్టుపై రసాయనాల ప్రభావం
జుట్టుకు రంగువేయడం, స్ట్రెయిటెన్ చేసుకోవడం, బ్లీచింగ్ వంటి ప్రక్రియల్లో వెంట్రుకలు... రసాయనాలకు ఎక్స్‌పోజ్ అవుతుంటాయి. ఫలితంగా వాటిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల ఒక్కోసారి వెంట్రుకలు  బాగుచేయలేని విధంగా దెబ్బతినవచ్చు. మనకు కనిపించే వెంట్రుక పై పొర అయిన క్యూటికిల్ పూర్తిగా దెబ్బతినవచ్చు. ఇలా వెంట్రుక పైపొర అయిన క్యూటికిల్ దెబ్బతింటే లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటకు కనిపిస్తుంది. ఇది పైపొరలా నునుపుగా కాకుండా కాస్త గరుకుగా ఉంటుంది.  ఈ కార్టెక్స్ భాగం బయటపడిన జుట్టు నిర్జీవంగా, గజిబిజిగా కనిపిస్తుంటుంది.  ఇక నీళ్లలో, వాతావరణంలో, షాంపూల్లో, హెయిర్‌స్ప్రేలలో ఉండే రసాయనాలు క్యూటికిల్‌నే కాకుండా కార్టెక్స్‌నూ దెబ్బతీయవచ్చు. అప్పుడు వెంట్రుక తేలిగ్గా విరిగిపోతూ ఉంటుంది.

ఇలా చేస్తే... దెబ్బే!
విపరీతంగా దువ్వడం, చాలా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం, వెనక్కు దువ్వడం, బలమైన వేడిగాలి తగిలేలా డ్రైయర్‌ను ఉపయోగించడం వంటి ప్రక్రియలు సైతం వెంట్రుకలను దెబ్బతీస్తాయి. ఇలా భౌతికపద్ధతుల ద్వారా దెబ్బతిన్న వెంట్రుక సాఫీగా లేకుండా ఒకచోట ఉబ్బు, మరోచోట పలచబారినట్లుగా ఉంటుంది. ఇలా కనిపించే వెంట్రుకలను ‘బబుల్‌డ్ హెయిర్’ అంటారు. ఇలాంటి వెంట్రుకలు బలహీనంగా, తేలిగ్గా విరిగిపోయేలా ఉంటాయి.

జుట్టు ఎందుకు రాలుతుంది?
జట్టు రాలడానికి అనేక కారణాలు దోహదపడుతుంటాయి. అందులో ముఖ్యమైనవి...
మానసిక ఒత్తిడి: నిత్యం ఉండే ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలిపోయేలా చేస్తాయి.

అరికట్టడం ఇలా: ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.

గర్భధారణ తర్వాత: చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలి ఎక్కువగా పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం కూడా మరో కారణం. ఆ సమయంలో జుట్టుకు అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు దారిమళ్లి కడుపులోని బిడ్డకు అందడమే  ఇందుకు కారణం.

అరికట్టడం ఇలా: తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీ విటమిన్స్ జుట్టుకు అందే విధంగా చూడటం వల్ల దీన్ని అరికట్టవచ్చు.

ప్రోటీన్ లోపాల వల్ల : చాలామందిలో జుట్టు రాలిపోవడానికి  కారణం వారు తగినంతగా ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకోకపోవడమే. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్‌గా విభజితమై జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ దోహదపడతాయి.

అరికట్టడం ఇలా: ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం పుష్కలంగా తీసుకోవాలి. ఇక శాకాహారులైతే ఆకుకూరలు,  గ్రీన్‌పీస్, నట్స్, సెనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి.

 విటమిన్-ఏ మరింత ఎక్కువగా తీసుకోవడం వల్ల: ఆహారంలో విటమిన్-ఏ పాళ్లు మరీ ఎక్కువైతే కూడా జుట్టు రాలుతుంది. విటమిన్-ఏ అన్నది మనకు ప్రతిరోజూ 5000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) అవసరం. ప్రతిరోజూ మనం విటమిన్-ఏ ను 10,000 ఐయూ కంటే ఎక్కువగా తీసుకోవడంతో పాటు... ఇది దీర్ఘకాలం కొనసాగితే జుట్టు రాలుతుంది.

అరికట్టడం ఇలా: విటమిన్-ఏ టాబ్లెట్లను డాక్టర్ల సలహా మేరకు మాత్రమే, వారు నిర్ణయించిన మోతాదులోనే తీసుకోవాలి. 

హార్మోన్ లోపాల (హార్మోనల్ ఇంబ్యాలెన్స్) వల్ల : సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిలల్లో ఎక్కువ. మహిళల్లోనూ కొద్దిపాటి పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ స్రావం ఎక్కువ. దీంతో జుట్టు రాలుతుంది. ఇక హైపో థైరాయిడిజమ్ కండిషన్ కూడా జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది.

 అరికట్టడం ఇలా: పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ద్వారానూ, హైపోథైరాయిడిజమ్ ఉన్నవారు థైరాక్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు.

కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ల వల్ల :  మన రోగనిరోధకశక్తే మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్‌గా పేర్కొంటుంటారు. ఉదాహరణకు...  పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల మన మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి.  లెకైన్ ప్లానస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడవచ్చు.

అరికట్టడం ఇలా: ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటే డాక్టర్‌ను సంప్రదించి అవసరాన్ని బట్టి నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ రూపంలో స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

మందుల వల్లా... రాలుతుంది!
రకరకాల రుగ్మతలకు మందులు వాడుతున్న కొందరిలో వాటి దుష్ర్పభావం వల్ల జుట్టు రాలడం మామూలే. ఇక కొందరిలోనైతే ఇది అవాంఛిత రోమాల పెరుగుదలకూ దారితీస్తుంది. ఈ మందులు జుట్టు పెరుగుదలలో ఉండే మూడు ప్రధాన దశల్లో జోక్యం చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల/జీవిత చక్రాల (సైకిల్)లో మార్పు వస్తుంది. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లువియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి అవి  జుట్టు రాలేలా చేస్తాయి.

టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా రుగ్మతకు మందులు వాడటం మొదలుపెట్టాక  2 నుంచి 4 నెలల్లో మందు ప్రభావంతో వెంట్రుక ఫాలికిల్ విశ్రాంతి దశలోకి  వెళ్తుంది. ఫలితంగా జుట్టు రాలి మళ్లీ మొలవడం ఆలస్యం అవుతుంది.

అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ తరహా జుట్టు రాలడంలో వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలిపోతుంటాయి. కీమో తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలడం సంభవిస్తుంది. ఈ మందుల వల్ల కేవలం తలపైని జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి.

ఏయే మందులతో జుట్టు రాలవచ్చు?
మొటిమలకు వాడే మందులు  కొన్ని యాంటీ బయాటిక్స్ కొన్ని యాంటీ ఫంగల్ మందులు  యాంటీ డిప్రెసెంట్స్ నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు  రక్తాన్ని పలచబార్చే బ్లడ్ థిన్నర్స్  యాంటీ కొలెస్ట్రాల్ మందులు  హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్  వేగంగా మారిపోయే మూడ్స్‌ను నియంత్రించడానికి వాడే మందులు  నొప్పినివారణకు వాడే మందులు  స్టెరాయిడ్స్ థైరాయిడ్ మందులు.

అరికట్టడం ఇలా!
మందులు వాడటం మానేయగానే సాధారణంగా జుట్టు మళ్లీ రావచ్చు.  జుట్టు విపరీతంగా రాలుతుంటే ప్రత్యామ్నాయ మందులు వాడటం  జుట్టు రాలడాన్ని అరికట్టే మందులు వాడటం మొదలైన మార్గాల ద్వారా.

జుట్టు ఊడిపోయే ఇన్ఫెక్షన్లు
రింగ్‌వార్మ్ : ఇది ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ కండిషన్‌ను టీనియా కాపిటిస్ అంటారు. మొదట చిన్న మొటిమలా వచ్చి క్రమంగా సైజ్ పెరుగుతూ పోతుంది. విస్తరించిన చోట పొలుసుల్లా వచ్చి... ఆ ప్రదేశంలో తాత్కాలికంగా జుట్టు మొలవదు.

చికిత్స: టెర్బినఫిన్, ఫ్లుకోనజోల్, గ్రీషియోఫల్విన్, ఇట్రాకొనజోల్ వంటి యాంటీఫంగల్ మందులతో చికిత్స చేయవచ్చు.

ఫాలిక్యులైటిస్: జుట్టు ఫాలికిల్ (అంకురాల్లో) ఇన్‌ఫ్లమేషన్ (వాపు, నొప్పి) వచ్చే కండిషన్. ఇది వచ్చినవారిలో వెంట్రుక మొదల్లో ఎర్రటి పొక్కులు వస్తాయి. ఇది స్టెఫలోకాకస్, సూడోమొనాస్ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది.

చికిత్స: యాంటీ బయాటిక్ మందులతో దీన్ని తగ్గించవచ్చు.

పీడ్రా : ఇది వెంట్రుకకు వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్.

డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ : ఇది కనురెప్పల వెంట్రుకలను ప్రభావితం చేసే కండిషన్.  ఈ జబ్బుకు దారితీసే సూక్ష్మజీవి కనురెప్ప లను మెరిసేలా చేసే నూనెను ఎక్కువగా స్రవించేలా చేస్తుంది.

సెబోరిక్ డర్మటైటిస్: వాస్తవానికి ఇది ఇన్ఫెక్షన్ కాని కండిషన్. ఈ కండిషన్‌లో చర్మం పగుళ్లు ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో పాటు కలిసి వస్తాయి. ఈ పరిస్థితిని సల్ఫర్, సెలీనియమ్ సల్ఫైడ్, జింక్ పైరోథియాన్, తార్, శాల్సిలిక్ ఆసిడ్ లేదా ఆయిల్ ఆఫ్ లేడ్, కార్టికోస్టెరాయిడ్ లోషన్లతో చికిత్స చేసి, నియంత్రణలోకి తెస్తారు.

పుట్టుకతోనే జుట్టు రాలిపోయే కండిషన్లు
హైపోట్రైకోసిస్:
ఇదో తరహా జుట్టు సమస్య. అలొపేషియాలో మొదట జుట్టు ఉన్న చోట రాలిపోయి, మళ్లీ మొలవడంలో ఇబ్బందులు ఏర్పడటం. అయితే హైపోట్రైకోసిస్ అనే కండిషన్‌లో అసలు జుట్టు మొలవాల్సిన చోట... మొదట్నుంచి కూడా వెంట్రుకలు రావు. ఈ కారణంగా పుట్టుకతోనే జుట్టు మొలవకపోవడంతో పాటు... జీవితకాలంలో అసలెప్పుడూ జుట్టు మొలవదు.  ఇందుకు కారణాలు ప్రధానంగా జన్యుపరమైనవి. ఇక పిండదశలో వచ్చే లోపాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇక ఈ సమఝ్యతో పాటు కనిపించే గ్రాహమ్ లిటిల్ సిండ్రోమ్, ఒఫ్యూజీ సిండ్రోమ్, మేవిక్ క్లేవ్ సిండ్రోమ్ వంటివి కూడా కారణాలే.

కంజెనిటల్ అలొపేషియా : ఈ కండిషన్ కారణంగా పుట్టుకతోనే బట్టతల వస్తుంది.

ట్రయాంగ్యులార్ అలొపేషియా : ఈ కండిషన్‌లో కణతల వద్ద జుట్టు రాలిపోతుంది.

కంజెనిటల్ ఏట్రికియా : పిల్లల్లో కనిపించే ఈ కండిషన్‌లో మొదట వారికి ఒత్తై జుట్టు ఉండి, అది రాలిపోయి మళ్లీ మొలవదు.

వెంట్రుక షాఫ్ట్‌కు వచ్చే లోపాలు
వెంట్రుకలో మనకు పైకి కనిపించే భాగాన్ని షాఫ్ట్ అంటారు. ఈ లోపాలకు ప్రధాన కారణం జన్యుపరమైనవి. వాటిలో కొన్ని...

 లూజ్ అనాజెన్ సిండ్రోమ్: దీన్నే లూజ్ హెయిర్ సిండ్రోమ్ అంటారు. అంటే అనాజెన్ దశలో వెంట్రుక వదులుగా అయి చిన్నగా లాగినా ఊడి వచ్చేస్తుంది. ప్రధానంగా యుక్తవయస్కులైన బాలికల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఇలా ఊడిన జుట్టు ఒకపట్టాన మొలవదు. అందుకే మాడుపై జుట్టు పలచబారే అవకాశం ఉంది.
అధిగమించడం ఇలా: సాధారణంగా ఇలా ఊడిన జుట్టు దానంతట అదే రావాల్సిందే. చికిత్సతో పెద్దగా ప్రభావం ఉండదు.

ట్రాక్షన్ అలొపేషియా అండ్ ట్రైకో టిల్లోమేనియా: చాలామంది తల్లులు తమ పిల్లలకు జుట్టును బాగా లాగి టైట్‌గా జడవేస్తుంటారు. ఇలా దీర్ఘకాలం పాటు జుట్టును బలంగా లాగుతుండటం వల్ల జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది. ఇక ట్రైకో టిల్లోమేనియా అనే కండిషన్‌లో కొందరు తమ జుట్టును తామే బలంగా పీకేసుకుంటుంటారు. అంటే బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్న తరహాలోనే ఇలా పీకేసుకుంటుంటారు. ఇలా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలనూ లాగేసుకుంటూ ఉంటారు. తలలో వెంట్రుకలను లాగడం వల్ల వారి తల బట్టతలగా మారిపోతుంది. ఇక కొందరైతే తల పూర్తిగా ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా బట్టతలగా మారిపోయాక... కనురెప్పల వెంట్రుకలు, కనుబొమల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు.

ట్రైకోఫేజియా: ఇది కూడా తమ జుట్టు తాము లాక్కోవడం లాంటిదే. అయితే ఈ రుగ్మత ఉన్నవారు అలా లాగిన జుట్టును తినేస్తుంటారు. ఇది చాలా తీవ్రమైన జబ్బు. ఇలాంటి వారికి తక్షణమే అత్యవసర (ఎమర్జెన్సీ) చికిత్స అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement