మహావిష్ణుయాగం | Mahavishnu Yagam | Sakshi
Sakshi News home page

మహావిష్ణుయాగం

Published Sun, Oct 15 2017 12:51 AM | Last Updated on Sun, Oct 15 2017 12:51 AM

Mahavishnu Yagam

సకల విశ్వశాంతి, సర్వమానవాళి మధ్యన సుహృద్భావన, పరస్పర సహకారం, మతసామరస్యంతో సహజీవనం, పర్యావరణ పరిరక్షణ, పాడి–పంటలు; సకాల వృష్ఠి, వసంతాది సకాల–సక్రమ ఋతు ప్రవేశాలు, భూకంపాలు–వరదలు–తుఫానులు–అతివృష్ఠి–అనావృష్ఠి–విషజ్వరాలు–అంటువ్యాధులు, మానవుల ఆటవిక ప్రవత్తి ఇత్యాదుల నివారణ కోసం మరికొన్నివేల సంవత్సరాలు ఈ జగత్తంతా శాంతిమయంగా కొనసాగాలనే లక్ష్యంతో జూన్‌ 28న యాదగిరిగుట్ట (యాదాద్రి)లో మహాక్రతువులు ఆరంభమయ్యాయి.    

జగత్‌ పరిరక్షకుడూ, సకల జీవరాశి పరిపోషకుడు శ్రీమహావిష్ణువు. అయనే జగత్కారకుడని సకల వేద–శాస్త్ర–ఇతిహాస–పురాణాదులు, ఉపనిషత్తులు నొక్కి వక్కాణిస్తున్నాయి. మంత్రపుష్పంలో ‘విశ్వం నారాయణం హరిం’ అనీ, యజ్ఞమంటేనే విష్ణువనీ... ఇలా అనేక విధాలుగా శ్రీమహావిష్ణువును గూర్చి వచించారు. స్థితికారకుడైన విష్ణుమూర్తి పేరిట ఏదైనా బృహత్కార్యం తలపెడితే, విశ్వశాంతి కలుగుతుందనే ఉద్దేశ్యంతో తలపెట్టిందే ఈ మహావిష్ణు యాగం.  

ఈ మహాయజ్ఞం శ్రీమహావిష్ణువు యోగనిద్రావస్తలో నుండే ఆషాఢమాసం నుండి పరమపవిత్రం, శివ–కేశవ ప్రీతికరమూ అయిన కార్తీక మాసం వరకూ గల చాతుర్మాస కాలంలో ‘అయుత శ్రీమహావిష్ణు మహాయాగం’ నిర్వహిస్తున్నారు. ఈ మహాక్రతువులను మూడు విభాగాలు చేసి ప్రథమ ఘట్టంలో పంచ నారసింహ క్షేత్రమైన యాదాద్రిలో ఐదు రోజులు నారసింహ ఉపాసన జరిగింది.

ద్వితీయ ఘట్టంలో 108 రోజులు 12 మంది ఋత్విజులచే నిత్యం 1,00,800 చొప్పున 108 రోజులలో ఒకకోటి ఎనిమిది లక్షలసార్లు శ్రీ నారాయణాష్టాక్షరీ జపం జరుగుతోంది. ఈ 108 రోజులలో తొలి ఏకాదశి తిథి నుండి 8 ఏకాదశి పర్వదినాలలో అహోరాత్రముగా (24 గంటలు) విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, నామ సంకీర్తన, భక్తి కీర్తనలు, భక్తిపాటలు, భజనాదులు, గురుపూర్ణిమాదిగా వచ్చే ప్రతి పర్వదినాన విశేష కార్యక్రమాలు, హోమాలు నిర్వహిస్తారు.

తృతీయ ఘట్టంలో 12 రోజులలో... ద్వితీయఘట్టంలో 108 రోజులపాటు నిర్వహించిన 1,08,00,000, నారాయణాక్షరీ జప దశాంశమైన 10,80,000 నారాయణాష్టాక్షరీ హోమాలు చేస్తారు. ‘అయుత’ అనేదానికి అర్థం ‘దశసహస్రం’ (పదివేలు). అటువంటి 10,000 పురుష సూక్త పూర్తి పాఠంతో నిర్వహింపబడే హోమాలు. కాబట్టి దీనికి అయుత అని పేరు. ఆవిధంగా పదివేల పురుషసూక్త హోమాలు నిర్వహించినప్పుడు దానికి పదిరెట్లు అనగా నియుత (ఒక లక్ష) పారాయణలు జరగాలి.

ఇక మహావిష్ణువుకు హోమాలు నిర్వహిస్తున్నప్పుడు ఆయన వక్షస్థల నివాసిని అమ్మవారిని గూడా సేవించుకొని తృప్తి పర్చాలిగదా. అందుకనే ఈ మహాక్రతువులలో  శ్రీమహాలక్ష్మికి ప్రీతికరంగా పదివేల ఎనిమిది వందలు (అయుత) శ్రీసూక్త పారాయణలు; దశాంశమైన 1,080 శ్రీసూక్త హోమాలు;  భూదేవికి ప్రీతికరంగా 1,080 భూసూక్త పారాయణలు, 108 భూసూక్త హోమాలూ, నిత్యం స్వామివారికి–అమ్మవారికీ అభిషేక–అర్చన–అలంకరణాదులతోబాటు స్తోత్ర పారాయణలు, నామసంకీర్తనలు, పంచాయతన దేవతలైన గణపతికి అభిషేకం, అర్చన, అలంకారం, శీర్షోపనిషత్, చతురావృత తర్పణాలు, గణపతి హోమం, ఆదిత్యునికి (సూర్యునికి) మనకు ప్రత్యక్షదైవమూ, ఆరోగ్యమూ (ఆరోగ్యం భాస్కరాదిచేత్‌‘) పాడిపంటలూ, ఋతుక్రమ పాలన ఇత్యాదులకు మూలమైన ప్రత్యక్ష నారాయణునకు ప్రీతికరంగా సూర్యనమస్కారాలు, అభిషేకం, మహాసౌర–అరుణ పారాయణలూ, అరుణ–సౌర హోమములు, రుద్ర(శివ) ప్రీతికరంగా నిత్యం 121 నమక–చమక పారాయణలతో కూడిన లఘు రుద్రాభిషేకంతో 11 రోజులలో మహారుద్రాభిషేకం, త్రిచార్చన–రుద్ర క్రమార్చన, రుద్రహోమం; దేవీ ప్రీతికరంగా ప్రతినిత్యం పూర్ణదీక్షాపరులు–ఉపాసకులైన ఋత్విజులతో శ్రీచక్ర నవావరణార్చన– చండీ పారాయణలు, హోమాలు, భక్తుల అభీష్టానుసారంగా జరిగే అనేక విశేషహోమాలు, చతుర్వేద పారాయణలు, పూర్తి వైదిక కార్యక్రమం కనుక ప్రవచనాలూ తదితర కార్యక్రమాల సమాహారంగా ఈ మహాక్రతువులు సకల విశ్వశాంతి, ప్రాణికోటి మరికొన్ని శతాబ్దాలపాటు సుఖజీవనం సలపాలని ఈ ‘శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీ మహావిష్ణు యాగాలు’ ‘శ్రీవైకుంఠనారాయణ మహాసుదర్శన యంత్ర ప్రస్తార యాగశాల – హోమకుండాలలో’ నిర్వహిస్తున్నారు.

జాతి–మత–కుల–వర్ణ–వర్గ భేదాలు లేకుండా దేశ–విదేశాలలో నున్న ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చుననీ, ప్రతినిత్యం సుమారు 50,000 నుండి–60,000 వరకు అన్న సమారాధన – యాగ పరిసమాపన దివసమైన కార్తీక శుక్ల ద్వాదశీ పర్వదినాన అనగా ది.01.11.2017 బుధవారం అర్చనాదులు, మహాశాంతి హోమం, పూర్ణాహుతి, అవబృధం, వేదోక్త మహదాశీర్వచనం తరువాత సుమారు లక్షా 50 వేలనుండి 2 లక్షలమంది వరకు మహాన్నసమారాధనా విశేషంగా చెప్పవలసిన అంశాలు.
 

యాగ విశేషాలు
లోకకల్యాణం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక ఇబ్బందుల నిర్మూలన, ప్రకృతి విపత్తుల నిర్మూలన, దేశ సంక్షేమం తదితరాలు...
యాగకర్తలు: కేసాప్రగడ హరిహరనాథ శర్మ, రాధాకృష్ణకుమారి దంపతులు
నిర్వాహకులు: కేపీ రాజశేఖర శర్మ
ఎప్పటినుంచి ఎప్పటివరకు?
అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 1 వరకు



సుమారు 350 మంది రుత్విక్కులు, వేద పండితులు, యాగ యాజ్ఞికులు వస్తున్నారు. నిర్వహణ చూసుకునేందుకు మరో 100 మంది  యాగ నిర్వాహకులు పాల్గొంటున్నారు.

హాజరు కానున్న ప్రముఖులు: శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి, ఉత్తరాధికారి విధుశేఖర భారతి, చిన్న జీయర్‌స్వామి, దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి, తోగుట్ట మాధవానంద స్వామిలతోబాటు ప్రవచనకర్తలు సామవేదం షణ్ముఖ శర్మ, మైలవరపు శ్రీనివాస రావు, కందాడై రామానుజాచార్యులు  తదితర పండితులు.


– ఆరుట్ల వేణుగోపాలాచార్యులు, సాక్షి, యాదాద్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement