అందరికీ అమ్మలు...ఆ అక్కచెల్లెళ్లు! | mrudula sisters run Old Age Home | Sakshi
Sakshi News home page

అందరికీ అమ్మలు...ఆ అక్కచెల్లెళ్లు!

Published Tue, Sep 30 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

అందరికీ అమ్మలు...ఆ అక్కచెల్లెళ్లు!

అందరికీ అమ్మలు...ఆ అక్కచెల్లెళ్లు!

ఆర్జించిన ధనానికి కవచం దానమే... పదార్థాలను త్యాగం చేయడం ద్వారా నిన్ను నీవు రక్షించుకో... దానం... త్యాగం ప్రాధాన్యాలను తెలిపే ఈ సూక్తులను ఎవరు చెప్పారు? విధుల... మృదుల అనే అక్క చెల్లెళ్లు చెప్తున్నారు... నిడదవోలులోని చర్ల సుశీల వృద్ధాశ్రమం వీరి నివాసం... తండ్రి గణపతి శాస్త్రి బోధించిన గాంధీ సూక్తులు వీరికి ఆదర్శం.
 
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ సాధారణమైన పాతకాలం నాటి భవనం. ఎటు చూసినా ఫలిత కేశాలతో, వెన్ను వంగిపోయి, పండుటాకులను తలపిస్తున్న వృద్ధులే కనిపిస్తున్నారు. వారిలో ఇద్దరు మహిళలు తెల్లటి నూలు దుస్తులు ధరించి గాంధీజీ ఆశయాలకు ప్రతీకల్లా, సరస్వతీ మాత రూపాల్లా ఉన్నారు. వారిద్దరూ ఆశ్రమం అంతా కలియ తిరుగుతూ బాధ్యతగా అందరినీ పలకరిస్తున్నారు.

ప్రాంగణం దగ్గరకు వెళ్తే ‘చర్ల సుశీల వృద్ధాశ్రమం, శ్రీ కస్తూరిబాయి మహిళా సమాజం’ అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు మీద గణపతి శాస్త్రి, సుశీల ఫొటో ఉంది. ఆ ఫొటోలో ఉన్న దంపతుల కూతుళ్లే విధుల, మృదుల. తల్లి సుశీల పేరుతో ఆశ్రమాన్ని స్థాపించి తండ్రి ఆశయాలకు రూపమిస్తున్నారు. అభాగ్యులకు ఆశ్రయమిస్తున్నారు. అనాథలకు జీవితాన్నిస్తున్నారు.

తండ్రి బాటలో సొదరీమణులు..: చర్ల గణపతి శాస్త్రి స్వాతంత్య్ర సమరయోధుడు. కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కూడా. జాతీయోద్యమ కాలంలో గాంధీజీ ప్రబోధాల ప్రభావంతో ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి,  ఉద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు గణపతి శాస్త్రిని కొవ్వూరు జైలులో పెట్టారు. జైలు నుంచి విడుదలైన తరువాత ఆయన చాగల్లులో గాంధీ ఆశయాలతో ఆశ్రమ పాఠశాల నిర్మించారు. అది బాపూ హైస్కూల్‌గా కొనసాగుతోంది.

గణపతి శాస్త్రి వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగించారు. పేద ప్రజలకు విద్య, వైద్య సేవలను అందించారు. మహిళల కోసం నిడదవోలు పట్టణంలో 1950లో కస్తూరిబా మహిళా సమాజాన్ని స్ధాపించారు. నిరక్ష్యరాస్యత నిర్మూలన, మద్యపాన నిషేధంపై ప్రచారం నిర్వహించారు. గణపతి శాస్త్రి ఏనాడూ ఎవరినీ స్తోత్రాలు వల్లించి దీవించలేదు. ‘మంచి చేయండి. మీ పిల్లలకు మంచి జరుగుతుంద’ని చెప్పేవారు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల భూమిని వినోభాబావే భూదాన ఉద్యమం నిర్వహించిన సమయంలో విరాళంగా ఇచ్చారు.

ఆయన జీవితమంతా ప్రజల కోసమే పని చేసి 1996లో గుండెపోటుతో దూరమయ్యారు. గణపతి శాస్త్రి భార్య చర్ల సుశీలమ్మ అన్నదానాలు చేసేవారు. విధుల, మృదుల కుమారికి కూడా అదే సేవాగుణం అలవడింది.
 
తండ్రి మార్గదర్శనం...:
తండ్రి కోరుకున్న విధంగా మహిళా సమాజాన్ని నడిపిన ఈ అక్కాచెల్లెళ్లు ఆపన్నులకు ఆశ్రయం కూడా అక్కడే కల్పించాలనుకున్నారు. అలా 2000లో ఐదుగురితో వృద్ధాశ్రమం స్థాపించారు. వీరిలో పెద్దామె విధులకు 76 సంవత్సరాలు. ఎంఏ బిఈడీ చదివి హిందీలో డాక్టరేట్ పట్టా పొందారు. విశాఖపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. గాంధేయవాది అయిన తండ్రిని గుర్తు చేసుకున్నారామె. ‘‘నా ఉద్యోగ జీవితంలో అధ్యాపకురాలుగానే కాకుండా భారత స్కాట్స్ అండ్ గైడ్స్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా పని చేశాను.

దేశభక్తి, అనాథల సేవలాంటి సద్గుణాలను చిన్నతనంలో మానాన్న గారి నుంచి నేర్చుకున్నాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేసేవారు నాన్న. ఆయన సేవా నిరతి నాకిప్పటికీ గుర్తుంది. మా అన్నయ్య అకాల మరణం తట్టుకోలేక అమ్మ కూడా చనిపోయింది. పోయినవాళ్ళు అదృష్టవంతులు మీరు బాధపడకూడదని మా ఇద్దరికీ హితవు చెప్పారు నాన్న. అలాంటి తండ్రికి బిడ్డలుగా పుట్టడం ఎంతో అదృష్టం. ఇక మా అమ్మ...’’ అంటూ కొద్దిసేపు ఆగారామె. ‘‘అనాథలైన వృద్ధులకు సేవ చేయాలనేది అమ్మ కోరిక. ఆ ఆశయసాధన కోసమే అమ్మపేరున ఒక వృద్ధాశ్రమం నెలకొల్పాం. నాకు ప్రతి నెలా వస్తున్న పెన్షన్, దాతల సహకారంతో దీనిని నిర్వహిస్తున్నాం. కుటుంబ జీవిత చట్రంలో ఇరుక్కుపోతే వారి ఆశయాలను నిర్వహించలేమని అవివాహితులుగా ఉండిపోయాం’’ అన్నారు విధుల కుమారి.
 
ఉన్నత విద్యావంతులు కావడంతో...
ఈ సోదరీమణులిద్దరూ ఉన్నత విద్యావంతులు. విధుల చెల్లెలు మృదుల విశాఖపట్నంలోని వి.ఎం.సీ మహిళా విద్యాపీఠ్‌లో హిందీ లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. తండ్రి గణపతి శాస్త్రి ఎప్పుడూ... ‘దేశం మాకేం ఇచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏం చేశాం’ అని ఆలోచించాలని ఉద్బోధించేవారని గుర్తు చేసుకున్నారామె. ‘‘సేవ, సకల జీవుల పట్ల దయతో ఉండటం, మానవసేవయే మాధవ సేవ ఇత్యాది సుగుణాలను నాన్న నేర్పించారు. భగవంతుడు దీనజనుల్లోనే ఉన్నాడు. వారికి సేవ చేస్తే దైవాన్ని సేవించినట్లేనని చెప్తుండేవారు.

ఆయన ఆశయాలకు అనుగుణంగా అక్కతో కలిసి అభాగ్యుల సేవలో కొనసాగుతున్నాను. అనాథలు, వృద్ధులకు మాకు చేతనైనంత చేస్తున్నాం. అక్క, నేను ఇద్దరం చదువుకున్న వాళ్లం కావడంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలకు చదువు చెప్తున్నాం. వారు ప్రైవేట్‌గా డిగ్రీ చదువుకుంటున్నారు. అంధులు కూడా కంప్యూటర్ నేర్చుకుని ఉపయోగిస్తున్నారు. మాకు మా వ్యక్తిగత జీవితం గురించి ఆలోచన, చింతా ఏ కోశానా లేవు ’’ అన్నారు.

అందరి ఆకలి తీర్చడానికి...:  చర్ల సుశీల వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వాళ్లు రెండు వందల వరకు ఉంటారు. అయితే భోజన సమయానికి వచ్చి ఆకలి తీర్చుకుని వెళ్లే వాళ్లు కూడా ఎక్కువే. వీరికే కాకుండా రోడ్ల మీద బిచ్చమెత్తుకునే వారి ఆకలీ తీరుస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, రోడ్డు కూడళ్లలో అడుక్కునే వారికి ఉదయం 11 గంటలకు ఆశ్రమం నుంచి భోజనం తీసుకెళ్లి పెడతారు. ఈ ఆశ్రమంలో ఏటా గాంధీ జయంతి రోజున గాంధీజీకి పుష్పాంజలి, సర్వమత ప్రార్థన నిర్వహిస్తారు. దాంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, ఉత్తమ ఉపాధ్యాయులు, గాంధేయ వాదుల వంటి విశిష్ఠ వ్యక్తులకు గాంధీజీ స్మారక పురస్కారాలిస్తారు. విద్యార్థులకు గాంధీజీ జీవితం అనే అంశం ఆధారంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు.

డెబ్భై ఏళ్లు నిండితే మందు వేసుకోవడానికి నీళ్లందించే వారి కోసం చూస్తారు ఎవరైనా. మంచం మీద నుంచి లేవాలనిపిస్తే మనవడో, మనవరాలో ఆసరాగా ఉంటే బావుణ్ణు అనిపించే వయసది. అలాంటప్పుడు ఎవరైనా పిల్లల అండలో జీవితం కడతేరాలని కోరుకోవడం సహజం. ఆ అండలేని వారికి కొండంత అండగా నిలుస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అందుకు వారికి తమ వార్ధక్యం అడ్డురావడం లేదు. వారి ఆశయమే ఆసరాగా ఉంది.
- గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు

ఆత్మీయ సేవకు అందిన గుర్తింపు:
2007లో సహృదయ చారిటబుల్ సొసైటీ వారిచే ఉత్తమ సేవా అవార్డు. ఠి2010లో జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్ చేతుల మీదగా ఉత్తమ సేవా సంస్ధ అవార్డు, ఠి 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా సంస్ధ నిర్వాహక పురస్కారం. ఠి స్త్రీ శిశు సంక్షేమశాఖ నుంచి ఉత్తమ మహిళా సేవకురాలి అవార్డులు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement