తల్లిదండ్రులతో వధూవరులు
ఇటీవలే మసీదులో ఒక హిందూ జంట పెళ్లి జరిపించి లౌకిక తత్వాన్ని చాటుకుంది కేరళ. ఇప్పుడు మళ్లీ అలాంటి వేడుకతో మానవత్వానికీ ప్రతీకగా నిలిచింది. కేరళలోని కున్నరియమ్ పట్టణానికి చెందిన అబ్దుల్లా కుటుంబం రాజేశ్వరి అనే హిందూ అమ్మాయికి విష్ణు అనే అబ్బాయితో గుడిలో పెళ్లి జరిపించింది.
కున్నరియమ్‌కు చెందిన శరవణన్ అనే రైతుకూలీ కూతురు రాజేశ్వరి. అబ్దుల్లా ఇంట్లో, అతని తోటలో పనిచేసేవాడు శరవణన్. దాంతో చిన్నప్పటినుంచీ రాజేశ్వరికీ అబ్దుల్లా కుటుంబంతో చనువుండేది. రాజేశ్వరి తల్లిలేని పిల్ల. తండ్రితో రోజూ అబ్దుల్లా వాళ్లింటికి రావడం.. అక్కడే అతని పిల్లలతో ఆడుకోవడం చేస్తూండేది. ఈ క్రమంలో శరవణన్ కూడా అనారోగ్యం బారినపడి.. కన్నుమూశాడు. అప్పటికి రాజేశ్వరి వయసు ఏడేళ్లు. అనాథ అయిన ఆ అమ్మాయిని అబ్దుల్లా కుటుంబం అక్కున చేర్చుకుంది. తమ ముగ్గురు కొడుకులతోపాటు రాజేశ్వరినీ పెంచింది.
ఇప్పుడు రాజేశ్వరికి ఇరవై రెండేళ్లు. ఆ ఊరికే చెందిన విష్ణు అనే అబ్బాయి రాజేశ్వరిని ఇష్టపడ్డాడు. ఈ విషయం అబ్దుల్లా వాళ్లింట్లో తెలిసి పెళ్లి విషయం మాట్లాడ్డానికి అబ్బాయి వాళ్లింటికి వెళ్లాడు అబ్దుల్లా తన భార్యను తీసుకొని. ఆ ఇంటి వియ్యం అందుకోడానికి విష్ణు తల్లిదండ్రులు జయంతి, బాలచంద్రన్ సంతోషంగా ఒప్పుకున్నారు. కాని పెళ్లి గుడిలోనే జరగాలనే ఒక షరతుతో. ‘దానికేముంది తప్పకుండా’ అని వియ్యాల వారి కోరికను మన్నించారు అబ్దుల్లా అండ్ ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాలు కలిసి.. అన్ని మతాల వారికి ఆహ్వానం ఉండే గుడి కోసం వెదికి.. చివరకు కసరగాడ్ లోని మన్యొట్టు దేవాలయాన్ని ఓకే చేసుకున్నారు. ఆ గుడిలో అన్ని మతాలవారికి ప్రవేశం ఉంటుంది. పెళ్లిరోజు అమ్మాయి వాళ్లకన్నా ముందే అబ్బాయి వాళ్లు ఆ గుడికి చేరుకుని.. పెళ్లి కూతురి తరపు వాళ్లకు స్వాగతం పలికారు. ఆలయం లోపల.. వేడుక జరిగే చోట .. కాస్త దూరంగా నిలబడి చూస్తున్న అబ్దుల్లా కుటుంబాన్ని చేయిపట్టుకొని మరీ తీసుకొచ్చి అమ్మాయి పక్కన నిలబెట్టారు విష్ణు తల్లిదండ్రులు. ఈ పెళ్లికి అబ్దుల్లా తల్లి .. 84 ఏళ్ల సఫియుమ్మతో సహా అబ్దుల్లా బంధువులంతా హాజరయ్యారు. ఇదీ రాజేశ్వరీ పరిణయకథ.
Comments
Please login to add a commentAdd a comment