అబౌట్ టర్న్!
అబౌట్ టర్న్!
Published Sun, Oct 6 2013 11:55 PM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.
ఇద్దరిని దిద్దిందీ కేంద్రీయ విద్యాలయాలే.
ఇద్దరూ చదువుల్లో ఫస్ట్. ఆటల్లో ది బెస్ట్.
త్రోబాల్, హాకీ, ఖోఖో, కబడ్డీ...
స్కూల్ లెవల్లో, స్టేట్ లెవల్లో... కప్పులన్నీ వారివే.
మిగిలింది నేషనల్ లెవల్.
‘చాలిక, ఆటలు ఆపండి’ అన్నారు మిస్టర్ దాస్!
నాన్న చెబితే అంతే. ఆయన మిలటరీ మేన్.
‘నాన్న మాటే నా మాట’ అన్నట్లు ఉండిపోయారు మిసెస్ దాస్.
ఎందుకిలా జరిగింది?
కూతుళ్లను ప్రాణపదంగా చూసుకునే తండ్రి...
వాళ్లకు ప్రాణప్రదమైన ఆటల్ని ఎందుకు ఆడనివ్వలేదు?
దేశమంతా ‘లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్’ కొట్టొచ్చిన ఈ సిపాయి...
పిల్లలు దేశాలు దాటుతామంటే ఎందుకు
‘అబౌట్ టర్న్’ అంటున్నారు?!
ఈవారం ‘లాలిపాఠం’ చదవండి.
కొంత డిఫరెంటుగా ఉంటుంది.
మిగతాదంతా అఫెక్షనేట్‌గా ఉంటుంది.
పశ్చిమ గోదావరి జిల్లా పసలపూడిలో పుట్టిన దాస్ ఉద్యోగరీత్యా కాశ్మీర్, పంజాబ్, నాగాలాండ్, మధ్యప్రదేశ్‌లలో పనిచేసి సికింద్రాబాద్‌లో రిటైరయ్యారు. ఆయన భార్య కాంతాదాస్‌కి పిల్లలే లోకం, ఇల్లే ప్రపంచం. ఒకరోజు దాస్ కాశ్మీర్‌లో బస్సులో వెళ్తున్నప్పుడు... చెట్టు కొమ్మకు అమర్చిన బాంబు పేలి, పక్కసీటులో ఉన్న వ్యక్తి చూపు కోల్పోవడం ప్రత్యక్షంగా చూశారు. అయినా బెంబేలు పడలేదు. కారణం ఆయన పనిచేసేది దేశ రక్షణ వ్యవస్థలో. ఆర్మీలో పని చేసేవాళ్లకు ఉండాల్సినంత గుండెధైర్యం ఆయనలో ఉంది, కానీ తన పిల్లలను ఒంటరిగా ఎక్కడికి పంపించాలన్నా భయపడతారు. పిల్లలు కాలనీలో ఆడుకుంటున్నప్పుడు కూడా వారికి తోడుగా ఉండమని భార్యకు గుర్తుచేస్తారు. సరిహద్దు రక్షణలో తన కర్తవ్యాన్ని ఎంత క్రమశిక్షణతో చేస్తున్నారో... అంతే క్రమశిక్షణతో ఉండేలా పిల్లలను పెంచుతారు. ఇంతటి మితిమీరిన భద్రత మధ్య పెరిగిన వీరి పిల్లలు ధానేశ్వరి, దివ్య. ఇద్దరూ ఆటల్లో ఫస్ట్, అల్లికల్లో బెస్ట్.
తల్లీకూతుళ్లు హైదరాబాద్‌లో...
భద్రత వ్యవస్థలో ఉద్యోగం అంటే ఎప్పుడు ఎక్కడ డ్యూటీ పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుందో తెలియదు. తరచూ కుటుంబం అంతా మారడం కొంచెం కష్టమే. దాంతో దాస్ భార్య కాంతాదాస్ పిల్లలను చూసుకుంటూ హైదరాబాద్‌లోనే ఉండేవారు. ‘‘కొంతకాలం పంజాబ్‌లో, ఝాన్సీ(మధ్యప్రదేశ్)లో ఉన్నాం. ఝాన్సీలో ఉన్నప్పుడు దివ్యను అక్కడి కేంద్రీయవిద్యాలయలో చేర్చాం. అప్పుడు ధానేశ్వరి మా అమ్మవాళ్ల దగ్గర హైదరాబాద్‌లోనే ఉండేది. తర్వాత కొన్నాళ్లకు మా వారికి నాగాలాండ్‌కి ట్రాన్స్‌ఫర్ కావడంతో నేను, దివ్య హైదరాబాద్‌కి వచ్చేశాం. అప్పటినుంచి పిల్లలిద్దరూ హైదరాబాద్‌లోని తిరుమల గిరి కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నారు. నేను చదివింది టెన్త్‌క్లాస్ వరకే. పిల్లలకు చదువు చెప్పడం, వాళ్లు హోమ్‌వర్క్ ఎలా చేశారో చెక్ చేయడం నాకు పెద్దగా వచ్చేది కాదు. అయితే ఎలా చదువుతున్నారో తెలుసుకోవడానికి స్కూల్‌కెళ్లి టీచర్లతో మాట్లాడేదాన్ని. నేను ప్రతి మీటింగ్‌కీ స్కూల్‌కెళ్తుంటే ‘మీ పిల్లల పెర్‌ఫార్మెన్స్ బాగుంది, మీటింగ్ కోసం మీరు రావడం ఎందుకు, ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం’ అనేవాళ్లు. టీచర్లు ఇలా చెప్తున్నారని చెప్పినా ఈయన మాత్రం ఒప్పుకునేవారు కాదు’’ అన్నారామె.
మంచి భవిష్యత్తు చదువుతోనే...
ధానేశ్వరి, దివ్య ఇద్దరూ ఒకే క్లాస్ కావడంతో ఆటల్లో కూడా కలిసే పాల్గొనేవారు. వాళ్లు తెచ్చుకున్న కప్పులను షెల్ఫ్‌లో వరుసగా సంవత్సరాల వారీగా సర్ది ఉంచుతారు. వాటిని చూపిస్తూ ‘‘త్రో బాల్, హాకీ, ఖోఖో, కబడ్డీ... అదీ ఇదీ అనే తేడా లేకుండా స్కూల్లో అన్ని ఆటలూ ఆడేవారు. రంగోలీ, డిబేట్‌లలో కూడా పాల్గొనేవారు. అలా స్టేట్ లెవెల్‌లో ఆడి నేషనల్స్‌కి ఎంపికయ్యారు’’ అని ఆగిపోయారు కాంతాదాస్. నేషనల్ లెవెల్ కబడీ పోటీలో ఏ ఏడాది పాల్గొన్నారన్నప్పుడు కొంచెం బిడియపడుతూ ‘‘మా పిల్లలు నేషనల్ లెవెల్స్ ఆడలేదు. స్కూల్ టీచర్‌లు ఫోన్ చేసి ‘నేషనల్స్‌లో మీ పిల్లలు గెలుస్తారు, అది మీకే కాదు స్కూల్‌కి కూడా విజయం అవుతుంది, పిల్లల్ని పంపించండి’ అని ఎంత అడిగినా, పంపలేకపోయాం’’ అన్నారు బాధగా.
వెంటనే దాస్ ‘‘నేనే వద్దన్నాను, ఆటల్లో ఎక్కువ కాలం కెరీర్ ఉండదు. భవిష్యత్తు స్థిరంగా ఉండాలంటే చదువే ముఖ్యం అని వద్దన్నాను’’ అన్నారు. అంతే కాకుండా చదువుకి తానెంత విలువ ఇస్తారో కూడా వివరించారు. ‘‘మా నాన్నగారికి మా పెద్దమ్మాయి అంటే చాలా ఇష్టం. తనకి వాళ్లమ్మ పేరునే (ధానేశ్వరికి తాతమ్మ) పెట్టారు కూడ. ఆయన ఆరోగ్యం బాగుండకపోవడంతో, ధానేశ్వరి పెళ్లి చూడాలని, వెంటనే చేయమని పట్టుపట్టారు. అప్పుడు ధానేశ్వరిని అడిగితే తాను ఇంకా చదువుకుంటానంది. దాంతో నేను... ‘ పెళ్లి తర్వాత చదువుకోవడానికి ఒప్పుకునే సంబంధాన్నే తెస్తాను’ అని నచ్చచెప్పి, పెళ్లి చేశాను. అల్లుడి ఉద్యోగం కూడా డిఫెన్స్‌లోనే. ఇప్పుడు ధానేశ్వరి సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది’’ అన్నారాయన.
ఇంట్లో సెంటర్ టేబుల్ మీదున్న గ్లాస్ టాప్‌కి వేసిన పెయింటింగ్‌ని, డోర్ కర్టెన్లని చూపిస్తూ... ‘‘ధానేశ్వరి, దివ్య ఇద్దరూ కుట్లు, అల్లికలు చక్కగా చేస్తారు. వాళ్ల నాన్న కబడ్డీ ఆడేవారు, నేను అల్లికలు బాగా చేసేదాన్ని. పిల్లలిద్దరికీ ఈ అలవాట్లు వచ్చాయి. పిల్లల్ని కబడ్డీలో కంటిన్యూ కానివ్వలేదు, కనీసం వీటిలోనైనా ప్రోత్సహిద్దామనుకుంటున్నాను’’ అన్నారు కాంతాదాస్.
దివ్య మాట్లాడుతూ... ‘‘మా ఫ్రెండ్స్ అంతా వేసవి సెలవుల్లో ఢిల్లీ టూర్‌కెళ్లాలనుకున్నారు. వాళ్లతో వెళ్తానని నాన్నను అడిగితే ‘మీ ఫ్రెండ్స్‌ని వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. అప్పుడు పంపిస్తాను’ అన్నారు. అదేమాట వాళ్లకు చెప్తే ‘అమ్మో! మీ నాన్నతో మాట్లాడడమా, మాకు భయం’ అని ఒక్కరూ రాలేదు.
మాకేమవుతుందోననే భయం తప్ప నాన్న మమ్మల్ని ఎప్పుడూ భయపెట్టడు. ఒకసారి రాత్రి తొమ్మిది దాటాక ‘రేపు స్కూల్‌కి కలర్ పెన్సిళ్లు తీసుకెళ్లాలి’ అని చెప్పాను. అప్పుడు తప్ప మరే సందర్భంలోనూ ఆయన మమ్మల్ని కోప్పడింది లేదు. ఆయన వద్దన్న పని చేయాలంటే చిన్నప్పుడు మాకే భయమేసేది. తర్వాత అదే అలవాటైంది. కానీ, కార్టూన్ నెట్‌వర్క్‌లో మాకు ఇష్టమైన ప్రోగ్రామ్ వస్తుంటే ‘మళ్లీ చదువుకోవచ్చులే రండి’ అని పిలిచి మరీ చూపిస్తారు. అక్క ఈ మధ్యనే డిగ్రీలో చేరింది. తనకు కాలేజ్‌కెళ్లే రూట్ అలవాటయ్యే వరకు తానే వెళ్లి దించేవారు. ఇప్పటికీ బయలుదేరిన తర్వాత కాలేజ్‌కి చేరాల్సిన టైమ్‌కి ఫోన్ చేసి కనుక్కుంటారు, సాయంత్రం కాలేజ్ పూర్తయ్యాక ఫోన్ చేసి, తనే వెళ్లి తీసుకొస్తారు లేదా బస్సెక్కించి తన పనులకు వెళ్లిపోతారు’’ అంది.
ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లల కోసం కష్టపడతారు. వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దాలని తపన పడతారు. వాళ్లు ఎదగడానికి ఆసరా అవుతారు. ఏ ఆసరా అక్కర్లేకుండా వాళ్లకై వాళ్లే ఎదుగుతుంటే పదిమందికి చెప్పుకుని మురిసిపోతారు. దాస్, కాంతాదాస్ కూడా అలాంటి తల్లిదండ్రులే. కానీ వీరికి పిల్లల విషయంలో భద్రత ఎక్కువైందనిపిస్తుంది. భద్రత కరవైన పిల్లలను చూసి జాలిపడతాం, అదే భద్రత ఎక్కువైతే? వీళ్లను చూస్తే మరీ ఎక్కువైన భద్రత వల్ల అవకాశాల రెక్కలు విరిగిపోతాయని అనుకోకుండా ఉండలేం. ఈ అమ్మాయిలకు జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చి ఉంటే అక్కడ గెలిచి రాష్ట్రానికి పతకాన్ని తెచ్చేవారు. ఆ క్రమం కొనసాగితే దేశానికి ప్రాతినిధ్యం వహించి ఇండియన్ కబడ్డీ సిస్టర్స్‌గా పేరు తెచ్చుకునేవారు కదా, అనిపించక మానదు.
తండ్రి సెన్సార్ చేసిన సినిమాలనే...
‘‘మా చిన్నమ్మాయి దివ్య అవంతీ కాలేజ్‌లో బిటెక్ చదువుతోంది. తను బాగా చదువుతుంది. కాలేజ్‌లో విద్యేతర కార్యక్రమాల్లో విద్యార్థినులకు ప్రతినిధి. ఇటీవల కాలేజ్‌లో జరిగిన టెక్నికల్ ఫెస్ట్‌లో దివ్య ఇచ్చిన ప్రెజెంటేషన్‌కి మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారి చేతుల మీద బహుమతి అందుకుంది కూడ. ఇంటర్‌కాలేజ్ కాంపిటీషన్‌లకి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్ వంటి వాటికి దివ్యనే పిలుస్తారు వాళ్ల లెక్చరర్లు. బీటెక్ తర్వాత అమెరికాలో ఎంఎస్ చేయాలని దివ్య కోరిక. అందుకు వాళ్ల నాన్నగారు ఇంకా తన అంగీకారం తెలుపనే లేదు. మా ఆయన చాలా నెమ్మది, అలాగే చాలా స్ట్రిక్టు కూడ. ‘ఆడపిల్లలు కదా జాగ్రత్తగా పెంచకపోతే ఎలా’ అంటారు. అశ్లీలమైన సినిమాల ప్రభావం పిల్లల మీద ఎక్కువగా ఉంటుందంటారు. ఏదైనా ఒక సినిమాకి బాగుందనే టాక్ వస్తే ముందు తను వెళ్లి చూసొస్తారు. తనకు నచ్చితే పిల్లల్ని తీసుకెళ్తారు’’.
- కాంతాదాస్, కబడ్డీ సిస్టర్స్ తల్లి
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ప్రతినిధి
ఫొటోలు: ఠాగూర్
Advertisement
Advertisement