రన్‌ ఫర్‌ ఫార్మర్‌ | Phanindra Fight For Farmer Support Price | Sakshi
Sakshi News home page

రన్‌ ఫర్‌ ఫార్మర్‌

Published Sat, Dec 28 2019 2:17 AM | Last Updated on Sat, Dec 28 2019 2:17 AM

Phanindra Fight For Farmer Support Price - Sakshi

‘‘నేను చేస్తున్న పోరాటం నా కోసం కాదు.. నేను పడుతున్న వేదన నా కుటుంబం కోసం కాదు.. నేను చేస్తున్న యుద్ధం నా ఊరి కోసం కాదు.. నా పోరాటం.. వేదన.. యుద్ధం అంతా కూడా అన్నదాత కోసం.. పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతన్న కోసం.. ‘‘ఈ పోరాటంలో నా ప్రాణాలు పోయినా పర్లేదు అన్నదాత గుండెచప్పుడు ప్రభుత్వానికి వినబడితే చాలు’’ అంటున్నాడు ఫణీంద్ర. అన్నదాతల గోడును సర్కారీ పెద్దలకు విన్నవించాలనే సంకల్పంతో  ‘రన్‌ ఫర్‌ ఫార్మర్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించాడతడు. హైదరాబాద్‌ నుంచి అమరావతి వరకూ పరుగు పూర్తి చేశాడు.  ఈ యువకుడి పరుగు కథ ఏంటో చూద్దాం.

కృష్ణా జిల్లా అప్పిగట్ల గ్రామానికి చెందిన ఫణీంద్ర పుట్టింది ఓ సాధారణ రైతు కుటుంబంలో. చిన్ననాటి నుంచి తన తండ్రి పడుతున్న కష్టాలను దగ్గర నుంచి చూశాడు. తుఫాన్ల నుంచి పండించిన పంటను రక్షించుకోలేక.. మిగిలిన పంటకు గిట్టుబాటు ధర లభించక తండ్రి పడుతున్న ఆవేదన ఫణీంద్రను కదిలించి వేసింది. తన తండ్రిలానే ప్రతి రైతు కుటుంబం ఇలానే కష్టాలు పడుతుందని తెలుసుకున్నాడు. వాళ్లకోసం ఏమైనా చేయాలని బలంగా నిర్ణయించుకున్నాడు.  అయితే ఏం చేయాలో అప్పటికి అర్థం కాలేదతనికి. ఆర్థిక ఇబ్బందులతోనే ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. 2012లో సివిల్స్‌కు  ప్రిపేర్‌ అవ్వడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే ఒకవైపు సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నా.. మరోవైపు మనసు మాత్రం రైతులకు ఏదో చేయాలని ఆరాట పడుతుండేది..

ఆ కథనం చదివి..
రైతులకోసం ఏదో చేయాలని ఉన్నా.. ఏం చేయాలో ఫణీంద్రకు దిక్కుతోచలేదు. అయితే ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నాసిక్‌ నుంచి మహారాష్ట్ర వరకు రైతులు చేసిన 165 కి.మీ పాదయాత్రకు సంబంధించిన వార్త ఫణీంద్రలో ఓ వినూత్న ఆలోచనకు అంకురం వేసింది. ఆ స్ఫూర్తితో ‘రన్‌ ఫర్‌ ఫార్మర్‌’ కార్యక్రమం మొదలు పెడదామని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా జాతీయ జెండాను చేత పట్టుకుని ప్రజలలో చైతన్యం కల్పించేందుకు పరుగు మొదలుపెట్టాడు. రాష్ట్రంలో ఎక్కడ మారథన్‌ కార్యక్రమాలు జరిగినా అక్కడ ఫణీంద్ర ప్రత్యక్షమయ్యేవాడు. అందరూ వారి కార్యక్రమ ఉద్దేశం కోసం పరుగెడుతుంటే.. ఫణీంద్ర మాత్రం రైతు జెండా పట్టుకుని ‘సేవ్‌ ద ఫార్మర్స్‌’ అంటూ నినాదాలు చేసేవాడు.

అసెంబ్లీ నుంచి అసెంబ్లీకి...
అప్పటివరకు ఎన్నో కార్యక్రమాలలో ఫణీంద్ర పాల్గొన్నా.. ఎవరూ పట్టించుకోలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని.. భగత్‌ సింగ్‌ను గుర్తు చేసుకుంటూ ‘అసెంబ్లీ టూ అసెంబ్లీ’ పరుగెత్తాలని నిర్ణయించుకున్నాడు. 2018 ఏప్రిల్‌లో మండుటెండలను లెక్కచేయకుండా.. ‘రైతు కోసం పరుగు’ పేరుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వరకు ఏకధాటిగా పరుగెత్తాడు. 325 కిలోమీటర్లను ఐదు రోజులలో పూర్తి చేసి.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాలు అందజేశాడు. రైతుల బాధలు అర్థం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకున్నాడు.

ఆడపిల్లకు రక్షణ కల్పించండి...
ఫణీందర్‌ జీవితంలో ఈ ఏడాది ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వరకట్న వేధింపులతో సోదరి మరణించడంతో ఫణీంద్ర కుదేలయ్యాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. అప్పటివరకు రైతుకు న్యాయం జరగాలనే పోరాటం చేసిన ఫణీంద్ర.. ఆడపిల్లకు రక్షణ కల్పించేందుకు సైతం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. తన చెల్లెలి పేరును టీ షర్టుపై రాయించుకుని  ‘ఆడపిల్లకు రక్షణ కల్పించండి..’ అంటూ సరికొత్త పరుగు మొదలు పెట్టాడు. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌ డే సందర్భంగా రన్‌ ఫర్‌ ఫార్మర్‌ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. రైతుకోసం చేస్తున్న పోరాటంలో ఫణీంద్ర తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఓ వైపు ఉద్యోగ అన్వేషణ చే స్తూనే.. మరోవైపు రన్‌ ఫర్‌ ఫార్మర్‌ కార్యక్రమాలు చేపడుతున్నాడు. రైతులలో చైతన్యం రావాలి... పాలకులకు రైతువాణి వినిపించాలి అంటూ అలుపెరగకుండా పరుగు పెడుతున్న ఫణీంద్ర ఆశయం సిద్ధించాలని కోరుకుందాం.

నా ప్రాణం పోయినా పర్లేదు..

పండించిన ప్రతి గింజకు మద్దతు ధర దక్కాలి.  ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ధర్నాలు చేస్తుంటే.. రైతు సంఘాల పేరుతో కొందరు నాయకులు రైతు కడుపు కొడుతున్నారు. రైతుల కోసం ఏ సంఘం కూడా క్షేత్ర స్థాయిలో నిజంగా పోరాడడం లేదు. షేర్‌ మార్కెట్లు పడిపోయినట్లుగా రైతుల పండించిన పంట ధర పడిపోవడమేంటి..? ప్రతి కంపెనీ తాము తయారు చేసిన వస్తువుకు ఖరీదు నిర్ణయిస్తున్నప్పుడు.. తాను పండించిన పంటకు ధర నిర్ణయించుకునే రైతుకు ఎందుకు అధికారం లేదు? 2006లో స్వామినాథన్‌ కమిషన్‌ సమర్పించిన నివేదిక ఇంకా ఎందుకు అమలు కావడం లేదు? రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటా. రైతు కోసం పరుగులో నా ప్రాణం పోయినా పర్లేదు..
– ఫణీంద్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement