అమ్మ ఎగురుతోంది | pilot salwa fathima story | Sakshi
Sakshi News home page

అమ్మ ఎగురుతోంది

Published Mon, Dec 11 2017 12:28 AM | Last Updated on Mon, Dec 11 2017 4:26 AM

pilot salwa fathima story - Sakshi

ఆకాశం నుంచి  కిందకు చూస్తే అరమరికలు కనపడవు. మనిషికి మనిషికి తేడా అనిపించదు. ఆడ, మగ భేదం తెలయదు. లోకమంతా అందంగా అల్లాహ్‌ సృష్టిలా కనపడతుంది. సృష్టిలో ఈ అందాన్నీ కిందున్న మనుషులూ గుర్తిస్తే ఎంత బాగుండు! కానీ.. అంత ఎత్తుకు ఎగరాలంటే... రెక్కల కింది గాలి ఎంత బలంగా ఉండాలి? ఆ కనపడని బలమైన గాలే విశ్వాసం!! అదీ తల్లి సల్వా ఫాతిమా విశ్వాసం!! అదే కూతురు మరియం ఫాతిమా ఆశ!!

ముందు గదిలో కూర్చొని పేపర్‌ చదువుతున్న మామయ్యను కర్టెన్‌ చాటు నుంచి మాటిమాటికీ చూస్తోంది. ఆ పిల్ల ఆరాటం అతనికి తెలియదు. మధ్యమధ్యలో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ దాదాపు అరగంట పేపర్‌ మీద కాలక్షేపం చేశాడు. ఆ పేపర్‌ దీవాన్‌ మీద పడ్డ మరుక్షణమే వచ్చి వాలిపోయింది పదమూడేళ్లు దాటని ఆ అమ్మాయి. ఆత్రంగా  ఆ వార్తా పత్రికలోనే పేజీలన్నీ తిప్పుతోంది. ఒక్కచోట ఆగిపోయింది.

విమాన యానానికి సంబంధించిన వార్త అది. ఆసక్తిగా చదివింది. తర్వాత వాటెండ్‌ కాలమ్‌లోని విమానసంబంధ ఉద్యోగాల గురించి చూసింది. పేపర్‌ను మడత పెట్టి అక్కడే ఉన్న కిటికీలో కూర్చోని ఆకాశం వైపు తలెత్తింది. తన కల రెక్కలు తొడుక్కుని విహంగంలా విహరిస్తుంటే ఆస్వాదిస్తోంది. ఇంట్లో వాళ్లు తట్టి పిలిచే వరకూ ఆమె ఉనికి ఆ ఊహలోనే. ఇది ఒక్కరోజు చర్య కాదు.. దాదాపుగా అదే దినచర్య! ఆమె పేరు సల్వా ఫాతిమా. ది కమర్షియల్‌ పైలెట్‌ ఫ్రమ్‌ హైదరాబాద్‌. అలా నింగిలో ఎగరడానికి నేల మీద కష్టాల ప్రయాణం చేసి గమ్యానికి ఎగసిన సాహసి!

పరిచయం..
సల్వా ఫాతిమా తండ్రి అష్వాక్‌ అహ్మద్‌.  హైదరాబాద్‌లోని ఒక బేకరీలో రోజువారీ ఉద్యోగి. చార్మినార్‌ దగ్గర్లోని ఒక ఇరుకు గల్లీలోని అద్దె ఇంట్లో నివాసం. చాలీచాలని తండ్రి సంపాదనతో ముగ్గురు పిల్లల సంసారాన్ని ఈదుతున్న అమ్మ కష్టం చూస్తే సల్వాకు పుట్టెడు దుఃఖం వచ్చేది. ‘అల్లాహ్‌ మాకే ఎందుకు ఈ కష్టాలు?’ అంటూ కుమిలిపోయేది. అప్పుడు అమ్మమ్మ ‘కష్టాలు కలకాలం ఉండవు. మనమెప్పుడూ మన కిందివాళ్లను చూసి ఎంత మెరుగ్గా ఉన్నామో అని ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అంటూ ఊరట ఇచ్చేది. 

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోతగరతి నుంచి పది (అయిజా స్కూల్‌) వరకు  అజాంపురలోని అమ్మమ్మ ఇంట్లో  ఉండి చదువుకుంది సల్వా. వాళ్లింట్లో  టీవీ ఉండేది. దూరదర్శన్‌లోని కొన్ని సీరియల్స్‌ చూసేది. ఆకాశం, విమానం, పైలెట్‌ అనే అంశాలు కన్పిస్తే చాలు ఆమె కళ్లు విప్పారేవి. పైలెట్‌ కావాలనే ఆశ మొగ్గ తొడిగింది. పేపర్లలో వచ్చే సంబంధిత వార్తలతో  దానికి జీవం పోసేది.  పేపర్‌ కటింగ్స్‌ను దాచుకునేది. మరిన్ని వివరాలను  మేనమామను అడిగి తెలుసుకునేది. ఒక్కోసారి ‘నీకెందుకివన్నీ?’ అని అడిగేవాడు. ఆ ప్రశ్నకు సల్వా నవ్వేది. తను పేపర్లో చదివినవి, సీరియల్స్‌లో చూసినవి, మేనమామ చెప్పినవి ఫ్రెండ్స్‌తో డిస్కస్‌ చేసేది.

ఫ్రెండ్‌ కోసం వెళ్లి...
టెన్త్‌ మంచి మార్కులతో పాస్‌ అయింది సల్వా. ఆమె స్నేహితులంతా ఇంటర్‌ కోసం మంచి పేరున్న కాలేజ్‌లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అవన్నీ బాగా ఫీజులున్న కాలేజ్‌లు. అందులో చేరడానికి ఆమె ఆర్థిక పరిస్థితి అనుమతించదని తెలిసి  గవర్నమెంట్‌ కాలేజ్‌ను నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ రోజు తన స్నేహితురాలు మెహదీపట్నంలోని సెయింట్‌ ఆన్స్‌లో అడ్మిషన్‌ కోసం వెళుతూ సల్వానూ తోడు తీసుకెళ్లింది. ఆ కాలేజ్‌ ఆమెకు బాగా నచ్చింది. కాని డబ్బులూ గుర్తొచ్చి గమ్మున ఊరుకుంది. ఫ్రెండ్‌ బలవంతం మీద ప్రిన్సిపల్‌ రూమ్‌ దాకా వెళ్లింది సల్వా.

‘ఏ గ్రూప్‌లో అడ్మిషన్‌ కావాలి, టెన్త్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి?’ అని సల్వా స్నేహితురాలిని ప్రశ్నించింది ప్రిన్సిపల్‌. ‘బైపీసీ, 386 మార్కులు’ అని జవాబిచ్చింది ఫ్రెండ్‌. ‘నీకు?’ అంటూ సల్వాని అడిగింది ప్రిన్సిపల్‌. ‘నేను తనకు తోడుగా వచ్చా..’ అని చెప్పబోతుంటే సల్వా ఫ్రెండ్‌ అడ్డుతగిలి ‘తనకు నాకన్నా ఎక్కువ మార్కులే వచ్చాయి మేడం’ అంది. మరి అడ్మిషన్‌ ఎందుకు తీసుకోవట్లేదు అన్న ప్రిన్సిపల్‌ ప్రశ్నకు ‘మాకంత స్థోమత లేదు’ అంటూ ఏడ్చేసింది సల్వా.

అప్పుడు మంచి నీళ్లు తెప్పించి, ‘మరేం పర్వాలేదు. నాకు చేతనైన సాయం చేస్తా, అడ్మిషన్‌ తీసుకో’ అంటూ భరోసా ఇచ్చింది ప్రిన్సిపల్‌. అప్పట్లో ఆ కాలేజ్‌లో బైపీసీకి 12 వేల రూపాయాల ఫీజు. అడ్మిషన్‌ తీసుకుంది. మెరిట్‌ స్టూడెంట్‌ అవడం వల్ల ఫీజులో కన్సేషన్‌ దొరికింది. ఆరువేల రూపాయలతో ఫస్ట్‌ ఇయర్‌ పూర్తయిపోయింది. సెకండియర్‌లో సంగీతారెడ్డి అనే లెక్చరర్‌ సహాయం అందించింది. అలా ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసింది సల్వా.

సియాసత్‌ కోచింగ్‌
తర్వాత చదువులు ఎట్లా అనుకుంటున్న సమయంలోనే  సియాసత్‌ ఉర్దూ పేపర్‌ ఆ వేసవి సెలవుల్లో  ఉచిత ఎమ్‌సెట్‌ కోచింగ్‌ క్యాంప్‌ పెట్టారు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడమెందుకని అందులో చేరింది సల్వా. ఆ కోర్స్‌ ముగింపు రోజు సియాసత్‌ ఎడిటర్‌  జాహేద్‌అలీ ఖాన్‌ వచ్చారు. ఆ సందర్భంగా కోచింగ్‌ తీసుకున్న అమ్మాయిల అభిప్రాయాలు చెప్పాలని అడిగారు. అప్పుడే తనకు పైలెట్‌ కావాలనుందని చెప్పింది సల్వా. ఆ ఆశయం జాహేద్‌అలీ ఖాన్‌కు నచ్చి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారు. అలా 2007లో ఏపీ ఏవియేషన్‌ కోర్స్‌లో చేరి శిక్షణ పూర్తిచేసుకుంది సల్వా ఫాతిమా.

అడ్డంకులు..
సల్వా పైలెట్‌ శిక్షణకు వెళ్తున్నట్లు తెలియగానే బంధువులతోపాటు ఇరుగుపొరుగూ పెద్ద చర్చనే పెట్టారు. ‘పైలెట్‌ కోచింగ్‌ అంటే రోజుల తరబడి మీ అమ్మాయి బయట ఉండాల్సి వస్తుంది. రేపు జరగరానిది ఏదైనా జరిగితే మొత్తం ముస్లిం సమాజానికి ఏం సమాధానం చెప్తారు? మేమైతే మీకు సపోర్ట్‌ చేయం’అంటూ సల్వా తండ్రిని నిలదీశారు. 

అలాగే ‘కోచింగ్‌ చోట అందరూ మగవాళ్లే ఉంటారు. అమ్మాయికి జాగ్రత్తలు చెప్పండి. పైలెట్‌ అవ్వగానే సరిపోదు కదా. అమ్మాయికి పెళ్లీ చేయాలి. పైలెట్‌ ఉద్యోగం వల్ల ఎప్పుడూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధాలు వస్తాయో లేదో? ఈ కోర్స్‌ కన్నా ఏ ఇంజనీరింగ్‌ డిగ్రీ చేయించినా అయిపోయేది కదా’ అంటూ సల్వా వాళ్ల అమ్మనూ వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. ఇలా అందరి ఒత్తిళ్లను తట్టుకొని  సల్వాకు  అండగా నిలిచింది ఆ కుటుంబం.  ముఖ్యంగా సల్వా అమ్మమ్మ, తండ్రి, మేనమామ సల్వాను ప్రోత్సహించారు.

పెళ్లి.. పైలెట్‌  
కోచింగ్‌  పూర్తి అయిన వెంటనే అంటే  2013, అక్టోబర్‌లో సల్వా పెళ్లి అయింది.  ఈ సంబంధం సల్వా కుటుంబానికి బాగా కావల్సిన వాళ్ల నుంచి వచ్చింది. ఆమె కోర్స్‌ వివరాలు అన్నీ నచ్చే అమ్మాయిని తమింటి కోడలుగా  చేసుకున్నారు. పైలెట్‌కి సంబంధించి ఇంకా చాలా కోర్సులు మిగిలి ఉన్నాయని, వాటి కోసం విదేశాలకూ వెళ్లాల్సి ఉంటుందని కూడా అబ్బాయి వాళ్లకు ముందే చెప్పారు సల్వా తల్లిదండ్రులు. దానికీ వాళ్లు అనుమతినిచ్చారు.

అంతేకాదు అమ్మాయి పైలెట్‌ ఉద్యోగం చేయడం పట్లా తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ తెలిపారు. దాంతో మిగిలిన కోర్సులనూ సల్వా విజయవంతంగా పూర్తిచేసుకోగలిగింది. కమర్షియల్‌ పైలెట్‌  లైసెన్స్‌ను పొందింది. ఏవియేషన్‌ టైప్‌ రైటింగ్‌ సర్టిఫికెట్‌ కూడా తీసుకుంది. ప్రస్తుతం ఇండిగోలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది.

ఒక్క మాట
పదేళ్ల కిందట నేను పైలెట్‌ శిక్షణకు వెళ్లినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. నేడు ముస్లిం  అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందు ఉన్నారు అన్ని రంగాల్లో. మహళలు ముందు వెళ్లాలని నిర్ణయించుకుంటే అందరూ  సహకరిస్తారు. మతపరంగా ఎలాంటి ఒత్తిళ్లూ ఉండవు. అమ్మాయిల చదువు విషయంలో ప్రతి ముస్లిం కుటుంబం చాలా శ్రద్ధ తీసుకుంటోంది.  అంతేకాదు ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు  వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.  రాత్రిపగలు అనే తేడా లేకుండా వెహికిల్స్,  క్యాబ్స్‌లో  ఉద్యోగాలకు వెళ్తున్నారు.  నా లక్ష్య సాధనకు సహకరించిన తెలంగాణ సీఎం కేసీఆర్, జాహెద్‌ అలీఖాన్, కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు.  నాకు ఉద్యోగం వస్తే ఆశయాలున్న పేదింటి అమ్మాయిలకు నాచేతనైన సహాయం చేస్తాను.

విహంగ వీక్షణం..
సల్వా 2013లో సెస్‌నా 152 విమానాన్ని 200 గంటల పాటు, సోలో ఫ్లైట్‌ను 123 గంటల పాటు నడిపించి పైలట్‌ శిక్షణ పూర్తి చేసుకుంది. 2016లో బహుళ ఇంజిన్‌ ట్రైనింగ్‌కు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.36 లక్షలు అందజేసింది. ఈ సమయంలో ఆమె గర్భిణి. అయినా వెనకడుగు వేయకుండా న్యూజిలాండ్‌లో 15 గంటల పాటు బహుళ ఇంజిన్‌ విమానాన్ని నడిపి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2017, నవంబర్‌లో బహ్రెయిన్‌లో ఎయిర్‌బస్‌ 320 విమానాన్ని 60 గంటల పాటు నడిపి, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ సాధించింది.

(కూతురు మరియం  ఫాతిమా, భర్త మహ్మద్‌ షఖీల్‌తో సల్వా ఫాతిమా)


– ముహ్మద్‌ మంజూర్, సాక్షి హైదరాబాద్‌ సిటీ బ్యూరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement