మేనమామ ట్యూన్ చేశారు | Radio innermost | Sakshi
Sakshi News home page

మేనమామ ట్యూన్ చేశారు

Published Thu, Mar 19 2015 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

మేనమామ ట్యూన్ చేశారు

మేనమామ ట్యూన్ చేశారు

రేడియో అంతరంగాలు
 
రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు,  నవలలు, సినిమాలకు సంభాషణలు,  అనువాద వ్యాసాల రచన...  ఇలా అన్నింట్లో తన కలానికున్న సత్తా చాటారు  జీడిగుంట రామచంద్రమూర్తి. కేవలం రచనపై  ఉన్న ఆసక్తితోనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండిపోయారాయన. ఈ 75 ఏళ్ల వయసులోనూ కథలు రాస్తూ ఆనందంగా జీవనం సాగిస్తున్న  రామచంద్రమూర్తిని ‘రేడియో అంతరంగాలు’ కోసం ఇంటర్వ్యూ చేశారు ప్రముఖ రేడియో కళాకారిణి  శారదా శ్రీనివాసన్. రామచంద్రమూర్తి ఆకాశవాణి ఉద్యోగ విశేషాలు, ఇతర విషయాలు ఆయన మాటల్లోనే...
 
 ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఉద్యోగిగా ఉన్నప్పుడు రేడియోలో కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి స్క్రిప్ట్ రైటర్ కావాలన్న ప్రకటన చూశాను. ముందు నుంచీ రచనలపై ఆసక్తి ఉండడంతో అందులో చేరితే ఎలా ఉంటుందని రేడియోలో పని చేసే ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ గారిని అడిగాను. ‘‘ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని రేడియోలోకి వస్తావా!’’ అన్నారాయన. అయినా నా ఆసక్తి తగ్గలేదు. తర్వాత మలక్‌పేట్‌లో ఉండే మా మేనమామతో చెబితే ‘‘నువ్వు రేడియోలోకి వెళ్లు. అక్కడ ఎందరో మహానుభావులున్నారు. అక్కడంత బాలేదంటే ఏవో ట్యుటోరియల్స్ పెట్టుకుందువులే’’ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో ఇంటర్వ్యూకు హాజరై స్క్రిప్ట్ రచయితగా ఎంపికయ్యాను. అనంతరం 6 నెలలు, 3 ఏళ్ల ఒప్పందంతో పని చేసి పర్మినెంట్ అయ్యాను. ఇదంతా 1971 నాటి సంగతి.

రేడియో రైటర్‌గా...

‘కుటుంబ నియంత్రణ విభాగం’లో స్క్రిప్ట్ రచయితగా, తర్వాత ‘నాటక విభాగం’లో కార్యక్రమ నిర్వహణాధికారిగా పని చేశాను. అప్పుడే దాదాపు 40 నాటికల్ని, నాటకాల్ని రాసి ప్రసారం చేశా. అలాగే ప్రయోక్తగా మల్లాది వెంకటకృష్ణమూర్తి (మందాకిని), ముదిగొండ శివప్రసాద్ (అనుభవ మంటపం), వాసిరెడ్డి సీతాదేవి (ఉరితాడు), యండమూరి వీరేంద్రనాథ్ (నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య) లాంటి ప్రముఖ రచయితల నవలలను రేడియో నాటకాలుగా ప్రసారం చేశాను.

కార్మికుల కార్యక్రమం
 

రేడియోలో ఆదివారాల్లో వచ్చే ‘కార్మికుల కార్యక్రమం’లో ‘బాలయ్య’గా నన్ను అందరూ అభిమానించే వారు. చిన్నక్క, ఏకాంబరం పాత్రలతో పాటు బాలయ్యగా శ్రోతలు నన్నూ ఆదరించారు. సుమారు నాలుగేళ్లు ఈ కార్మికుల కార్యక్రమాన్ని నిర్వహించి రికార్డు సృష్టించాం.

మాటల కెరటాలు

1996 నుంచి ఓ ఏడాది పాటు ‘మాటల కెరటాలు’ పేరుతో ప్రముఖుల పరిచయ కార్యక్రమం ప్రసారం చేశాను. దీన్ని అక్కినేని నాగేశ్వరరావుతో ప్రారంభించి సి. నారాయణరెడ్డి, గొల్లపూడి మారుతీరావు, గణేశ్‌పాత్రో, రాజనాల, కాంతారావు, అంజలీదేవి, భానుమతి వంటి సాహితీ సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురిని పిలిచి పరిచయం చేసేవాణ్ణి. అప్పుడే పుట్టపర్తి నారాయణాచార్యులుగారితో పరిచయం ఏర్పడింది. ఆయనతో గడిపిన క్షణాలు నేనెప్పటికీ మరచిపోలేను.
 
‘నవలా స్రవంతి’

రేడియోలో ప్రసారమైన ‘నవలా స్రవంతి’ కార్యక్రమంలో నేను ప్రముఖుల రచనలను చదివాను. ‘పంచతంత్ర’ కథల సృష్టికర్త విష్ణుశర్మగారి కథలు, శంకరమంచి సత్యంగారి ‘అమరావతి కథలు’, గోపీచంద్‌గారి ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’ వంటి పుస్తకాల్లోని కథలను ఈ కార్యక్రమంలో ప్రతి మంగళవారం చదివేవాణ్ణి.

కుటుంబ విశేషాలు

మాకు ముగ్గురు కొడుకులు. కూతుళ్లు లేరనే బాధను నా ముగ్గురు కోడళ్లు తీర్చారు. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉంటారు. రెండో వాడు ‘జీడిగుంట శ్రీధర్’ టీవీ సీరియళ్లతో ఇక్కడ అందరికీ సుపరిచితుడే. అలాగే వెండితెరపై వర్ధమాన నటుడు వరుణ్‌సందేశ్ మా పెద్దబ్బాయి కొడుకే.             
 
 
సినీరంగ ప్రవేశం

ఈ రేడియో పుణ్యమా అని నాకు సినిమారంగంలోనూ పని చేసే అవకాశం దక్కింది. ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ‘అమెరికా అబ్బాయి’ సినిమాకు నాతో కథ రాయించుకున్నారు. దుక్కిపాటిగారికి రేడియో వాళ్లంటే ఎంతో అభిమానం. ఆ చిత్రానికి ప్రముఖ రేడియో ఆర్టిస్ట్ ఎర్రమనేని చంద్రమౌళి మాటలు రాశారు.  తర్వాత ‘ఈ ప్రశ్నకు బదులేది’, ‘పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు’ అనే సినిమాలకు సంభాషణలు రాశాను. ‘మరో మాయాబజార్’, ‘అమృత కలశం’ చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించాను. బుల్లితెరలో బాగా ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ సీరియల్‌కు 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశాను.
 
ఎలక్ట్రానిక్ మీడియాలో...

1997లో ఆకాశవాణి నుంచి పదవీ విరమణ పొందాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎలక్ట్రానిక్ మీడియా’లో నన్ను రేడియో కార్యక్రమాలు చేయడానికి  కో-ఆర్డినేటర్‌గా తీసుకున్నారు. అప్పుడే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ప్రచార చిత్రాలు, కథలు రాశాను. 2001-2003 మధ్యకాలంలో ‘ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ వాళ్లు  ఏర్పాటు చేసిన బాలల చలన చిత్ర రచనల కమిటీలో సభ్యుడిగా పని చేశాను.
 
పుస్తక రచయితగా...

నేను రాసిన కథల్లో కొన్నింటిని పుస్తక రూపంలో తీసుకొచ్చాను. ‘ప్రేమకు మిగిలింది’, ‘గోదానం’, ‘అమూల్యం’, ‘నిన్నటి కొడుకు’, ‘అమ్మకో ముదు’్ద, ‘జీడిగుంట రామచంద్రమూర్తి కథలు’, ‘వెండితెర సాక్షిగా’, ‘గుడిలో పువ్వు’లాంటివి అందులో కొన్ని. ప్రముఖ రేడియో కళాకారిణి రతన్‌ప్రసాద్‌గారు నా ‘అమ్మకో ముద్దు’ కథను ఆకాశవాణిలో ప్రొడ్యూస్ చేశారు.
 
అందుకున్న నందులు

జీడిగుంట రామచంద్రమూర్తి రచనా ప్రస్థానంలో మొత్తం నాలుగు నంది అవార్డులు ఆయనను వరించాయి. సారా నిషేధ ఉద్యమంపై రచించిన ‘పరివర్తన’కు ఉత్తమ రచయితగా, ‘ఊర్మిళ-ఉగాది రచనల పోటీ’కు ద్వితీయ ఉత్తమ రచయితగా, దూరదర్శన్‌లో ప్రసారమైన ‘పునరపి’ సీరియల్‌కు ఉత్తమ టెలీఫిల్మ్ రచయితగా, ‘భర్తృహరి సుభాషిత కథలు’ లఘుచిత్రాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డులు అందుకున్నాను. వీటితోపాటు మరెన్నో పురస్కారాలు ఆయన్ని వరించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement