కొత్త పరిశోధన
కదలకుండా ఒకేచోట కూర్చుని ఎక్కువసేపు పనిచేసే మహిళలకు కేన్సర్ ముప్పు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఆరుగంటల కంటే ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని, కదలకుండా ఉండే మహిళలకు రొమ్ము కేన్సర్, ఓవరీస్ కేన్సర్ వచ్చే అవకాశాలు పది శాతం మేరకు పెరుగుతాయని అమెరికన్ కేన్సర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
ఆఫీసు పనుల్లోనైనా, ఇళ్లల్లో టీవీ ముందైనా ఎక్కువసేపు కూర్చొని ఉండే మహిళలకు స్థూలకాయం, కీళ్లనొప్పులతో పాటు కేన్సర్ ముప్పు ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆమెరికన్ కేన్సర్ సొసైటీ నిపుణులు 1999-2009 మధ్య కాలంలో 1.46 లక్షల మందిపై అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల పురుషులకు కేన్సర్ ముప్పు పెరిగే అవకాశాలు పెద్దగా లేవని వారు చెబుతున్నారు.