వినిపించని శబ్దాలతో ఆరోగ్యానికి విపత్తులు
పరిపరి శోధన
కర్ణకఠోరంగా వినిపించే శబ్దాలతో మానసిక ఆందోళన, గుండెదడ, రక్తపోటు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనేది తెలిసిందే. అయితే మనుషుల చెవులు సాధారణంగా గ్రహించలేని ‘అల్ట్రాసౌండ్’ శబ్దాలతో కూడా ఆరోగ్యానికి చేటు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. లౌడ్ స్పీకర్స్, ఆటోమేటిక్ డోర్స్, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఆధునిక కార్యాలయాల్లో ఎక్కడికక్కడ అల్ట్రాసౌండ్ తరంగాలు వెలువడుతూనే ఉంటాయని వాటి ప్రభావం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి, మగతగా ఉండటం, చురుకుదనం లోపించడం వంటి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సౌత్‌హాంప్టన్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఆధునిక జీవితంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడుక పెరిగే కొద్దీ ‘అల్ట్రాసౌండ్’ కాలుష్యం కూడా ఎక్కువవుతోందని, దీనివల్ల పెద్దల కంటే పిల్లలకే ఎక్కువగా సమస్యలు వస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందని వారు అంటున్నారు.