అతిథి సేవోభవ | special story on Gauri Ben | Sakshi
Sakshi News home page

అతిథి సేవోభవ

Published Tue, Jan 16 2018 11:43 PM | Last Updated on Sat, Feb 10 2018 4:44 PM

special story on Gauri Ben - Sakshi

బీడు భూమి నుంచి రొట్టెను తుంచితే అచ్చం చందమామలా ఉంటుంది.. చల్లగా! వచ్చిన అతిథి కడుపు చల్లగా. గుజరాత్‌లోని బాకుత్రా ప్రాంతంలో  అతిథులు కావలసినంతమంది.గింజే కరువవుతుంది.మగాళ్లయితే వలస పారిపోతారు.మహిళయితే బీడును పిండి, రొట్టెను చేసి అతిథికి అన్నం పెడుతుంది. జీవితాన్ని నిలబెట్టుకుంటుంది. అలాంటి మహిళల్లో గౌరీబెన్‌ ఒకరు.

‘‘వెల్‌కమ్‌ టు గుజరాత్‌.. హార్టీ వెల్‌కమ్‌ టు బాకుత్రా’’ స్థానిక వెలకమ్‌ డ్రింక్‌ (గంజి)తో ఆహ్వానం పలికింది గౌరీబెన్‌. అతిథుల్లో ఇద్దరు విదేశీయులు, ఒకరు దక్షిణాది రాష్ట్రం వారు. మూడు గదుల ఆ ఇంట్లో ముందు వరండాలాంటిది ఉంది. అందులో ఒక తూగుటుయ్యాల. దాని మీద ఆసీనులయ్యారు ఆ ముగ్గురూ! వచ్చిన కొత్తవాళ్లు కాస్త పాతబడ్డాక వరండాను ఆనుకొని ఉన్న కాస్త పెద్ద గదిలోకి తీసుకెళ్లింది గౌరీ. మూడు ఎయిర్‌బెడ్స్, వాటి మీద హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేసిన బెడ్‌షీట్స్‌ వేసి ఉన్నాయి. మట్టిగోడలకు వెదురు ఫ్రేమ్స్‌ ఉన్న పెద్ద కిటికీ ఉంది. 

దానికీ చేత్తో చేసిన ఎంబ్రాయిడరీ కర్టెన్స్‌ వేళ్లాడుతున్నాయి. ఓ మూలన చిన్న టేబుల్‌ ఉంది. దాని మీద కచ్‌ వర్క్‌ క్లాత్‌ పరచుకుని ఉంది. ఇంగ్లిష్‌ దినపత్రిక రెపరెపలాడుతోంది. వచ్చిన వాళ్లు కాస్త సేదతీరి స్నానానికి రెడీ అయ్యారు. వాళ్లు అలా ఫ్రెష్‌ అయి వచ్చేలోపు స్థానిక బ్రేక్‌ఫాస్ట్‌ను వేడివేడిగా ప్లేట్స్‌లో వడ్డించింది గౌరీ. తినేసి బయటకు వెళ్లి పోయారు. మళ్లీ సాయంకాలానికి ఆ గూటికి చేరారు. బయట నుంచి తెచ్చుకున్న డిన్నర్‌ ముగించి, మళ్లీకాసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి చీకటిపడ్డాక నైట్‌లైఫ్‌ చూడ్డానికి ఊళ్లోకి వచ్చారు. 

గుంపులు గుంపులుగా  ఆ ఊరివాళ్లు చేస్తున్న రాస్‌గర్బా నృత్యంలో వీళ్లూ చేరి అడుగులు వేస్తున్నారు. గుజరాతీ పదాల అర్థాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ప్రాంతీయ తినుబండారాలను రుచి చూస్తున్నారు. అలా స్థానికులతో ఆడిపాడి అలసిసొలసి గౌరీబెన్‌ ఇల్లు చేరి..  స్నానాల గదిలో పెట్టిన ఆమె పెట్టిన వేడినీళ్లతో స్నానం చేసి ఆదమరిచి నిద్రపోయారు. ఇలా మూడు రోజులు గౌరీబెన్‌ ఇంట్లో ఉండి బాకుత్రా, చుట్టుపక్కల ఊళ్లను చూసి నాలుగోరోజు గౌరీ చేతిలో కొంత పైకం పెట్టి వెళ్లిపోయారు.దాంతో ఆమె సంపాదన ఆ నెలకు 55వేల రూపాయలు! గౌరీ ఆనందానికి అవధుల్లేవు! ఆ డబ్బును బొడ్లో దోపుకున్న బట్వాలో దాచుకుని గతాన్ని గుర్తుచేసుకుంది ఒక్కసారిగా!

అదొక విషాదం
బాకుత్రానే కాదు ఆ చుట్టుపక్కలున్న మెహస్నా, ఛోటా ఉదేపూర్, సురేంద్రనగర్, ఆరావళి.. వంటి ఊళ్లో విపరీతమైన నీటి ఎద్దడి. కడివెడు నీటికోసం కోసుల దూరం నడిచివెళ్లాలి. వర్షాలు పడితేనే వ్యవసాయం. అదీ అప్పులమయం. సంవత్సరానికి కనాకష్టంగా రెండు పంటలు వస్తాయి. గౌరీబెన్‌కు ముగ్గురు కొడుకులు. మూడు ఎకరాల పొలం. యేడాదికి 45 వేల రూపాయల ఆదాయం. అందులోనే కుటుంబమంతటికీ కూడు, గుడ్డ, బడి, గుడి, ఆరోగ్యం అన్నీ! అప్పుల భారాన్నీ తగ్గించుకునేది ఆ డబ్బుతోనే! ఈ కష్టాలను ఈదాలంటే కళ్లల్లో నీళ్లొచ్చేవి గౌరీకి. అప్పటికే సెల్ఫ్‌ ఎంప్లాయ్డ్‌ విమెన్స్‌ అసోసియేషన్‌ (సేవా)లో చేరి ఎంబ్రాయిడరీ, కచ్‌వర్క్‌కు మెరుగులు దిద్దుకున్నారు గౌరీ, ఆమె ముగ్గురు కోడళ్లు.

 కుర్తీలు, చీరల మీద ఎంబ్రాయిడరీ కుట్టడాన్నీ ఒక వృత్తిగా చేసుకున్నారు అదనపు ఆదాయం కోసం. కాని అరకొరగానే ఉండేది. ఎందుకంటే ఆ ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లలోని చాలామంది మహిళలూ సేవాలో చేరారు.. ఇదే పనిచేస్తున్నారు. కాబట్టి వచ్చిన డబ్బును పంచుకోవాల్సి వచ్చేది. ఇది సేవాకూ సవాలే అయింది. అప్పుడు ఆ ప్రాంతాలను పరికించింది సేవా. టూరిజం ఎక్కువ. రాన్‌ ఆఫ్‌ కచ్‌కు దగ్గరగా ఉన్న ఆ ఊళ్లను చూడ్డానికి, ఆ జీవనశైలిని అధ్యయనం చేయడానికి, పరిశీలించడానికి నిరంతరం టూరిస్ట్‌లు వస్తూనే ఉంటారు.

 దరిదాపుల్లో మంచి హోటళ్లు లేవు. ‘హమ్‌ సబ్‌ ఏక్‌హై’అనే ప్రయోగాత్మక ప్రోగ్రామ్‌ కింద ఇళ్లల్లో టూరిస్ట్‌లకు బసను ఏర్పాటు చేసే ఎయిర్‌బిఎన్‌బి (అజీటbnb) అంటే ఎయిర్‌బెడ్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమాన్నీ ప్రారంభించింది సేవా. ఇదీ మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేదే. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలి. తొలుత కేవలం తొమ్మిది మందితోనే మొదలైంది. వాళ్లలో గౌరీబెన్‌ ఒకరు. ఈ తొమ్మిది మందికి వస్తున్న ఆదాయం చూసి మరికొంత మంది చేరారు. అలా గౌరీబెన్‌ తన చెల్లెలినీ చేర్పించింది. ఆమె కూడా నెలకు సగటున 45వేల రూపాయలు సంపాదిస్తోంది  టూరిస్ట్‌లకు ఆతిథ్యం ఇస్తూ.  ఎవరో తలుపు తట్టడంతో ఈ జ్ఞాపకాల్లోంచి బయట పడింది గౌరీబెన్‌. కొత్త అతిథులు అయిదుగురు గుమ్మం ముందు ఉన్నారు నవ్వుతూ! సాదరంగా ఆహ్వానిస్తూ తన రొటిన్‌పనిలో పడిపోయింది గౌరీబెన్‌. 

ఎంతోమందికి ఆధారం
ఇప్పుడు ఆ ఊళ్లల్లో ఈ ఎయిర్‌బిఎన్‌బిలో చేరిన  వాళ్ల సంఖ్య యాభై! నెలకు 35 వేల వరకు సంపాదిస్తున్నారు. సీజన్‌లో అంటే గుజరాత్‌ సందర్శనకు అనువైన కాలంలో ఒక్క నెలలోనే గరిష్టంగా ఎనభైవేలు సంపాదిస్తున్నారు. మెహసనా అనే ఊళ్లో నలభైఏళ్ల మాయాబెన్‌ది ఒకప్పుడు తన ఇద్దరు పిల్లలకు స్కూల్‌ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి. ఇప్పుడు నెలకు  30 వేల రూపాయలు గడిస్తోంది. మొన్న డిసెంబర్‌లో అయితే 80 వేల రూపాయలు సంపాదించింది. టూరిస్ట్‌లకు తన ఇల్లు సరిపోక పక్కనున్న ఇళ్లను కూడా అద్దెకు తీసుకుంది.

‘సముద్ర తీరంలో చింతపండు దొరకదు.. అడవిలో ఉప్పు  దొరకదు. ఈ రెండూ దొరికే చోట వీటిని కలిపి పచ్చడి చేసి అమ్మితే అదే ఉపాధి’ అని  ఓ సినిమాలోని డైలాగ్‌! గుజరాత్‌లోని ఈ ఊళ్లకు ఇలాంటి ఉపాయాన్నే కనిపెట్టి అక్కడ లేనిదాన్ని వదిలేసి ఉన్నదాంతో ఉపాధి చూపించింది ‘సేవా’! చదువు లేని మహిళలనూ ఎంట్రప్రెన్యూర్స్‌గా మార్చింది.  ఈ ఎయిర్‌బిఎన్‌బిని గుజరాత్‌ అంతటకీ విస్తరింపచేస్తూ రాజస్తాన్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్‌ కశ్మీర్, అస్సామ్, సిక్కిం, నాగాల్యాండ్‌ రాష్ట్రాల్లోనూ పరిచయం చేయాలనే ప్లాన్‌లో ఉంది సేవా.  ఈ స్ఫూర్తి మన ఊళ్లకూ విస్తరిస్తే, ఇక్కడి మహిళలకూ బాగుంటుంది.
– శరాది

టూరిస్ట్‌లు మా ఊళ్లు చూడ్డమే కాదు మా దగ్గర ఎంబ్రాయిడరీ, కచ్‌వర్క్స్‌ కూడా నేర్చుకుంటున్నారు. అవి నేర్పినందుకు ఎంతోకొంత డబ్బు ఇస్తున్నారు. మేమూ వాళ్ల దగ్గర ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఇంగ్లిష్‌లో ముఖ్యమైన పదాలన్నీ వచ్చు.  
– గౌరీబెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement