అది ఓ ఆదివారం. ఓ ధనవంతుడు తన ఇంటి బాల్కనీలో పడక్కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో ఆయన దృష్టి ఓ మూలగా వెళ్తున్న చీమ మీద పడింది. అది తనకన్నా అనేక రెట్లు పెద్దదయిన ఓ ఆకును తీసుకుపోతోంది. అదేమీ హడావుడి పడటంలేదు. ఎంతో జాగర్తగా నెమ్మదిగా సాగుతోంది. సరిగ్గా అప్పుడే దానికి నేల మీద ఓ తీపి పదార్థం కనిపించింది. దాన్ని ఆకు మీదకు తీసుకుని పోతోంది. మధ్యలో దానికి కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ అది వాటిని ఎంతో నేర్పుతో ఓర్పుతో అధిగమించి ముందుకు పోతోంది.
ఈ చీమ పయనాన్ని ఆయన చాలాసేపే చూశాడు. ఓ చీమ పట్టుదల ప్రయాణం ఆయనను ఆలోచనలో పడేసింది. చీమ చతురత, తెలివితేటలు చూస్తే ఆయనకు చాలా ముచ్చటేసింది. దేవుడి సృష్టిని తలచుకుని అంతకు మించిన ఆశ్చర్యం కలిగింది.
చీమకూ, మనిషికీ మధ్య ఒకటి రెండు పోలికలు లేకపోలేదు. చీమ చివరికి తన గమ్యస్థానానికి చేరుకుంది. అది మరొకటి కాదు. చీమలపుట్ట. అది చిన్నదే కానీ లోతైనదిలా కనిపించింది. చీమ తన దగ్గరున్న ఆకుతో సహా అందులోకి ప్రవేశించలేకపోయింది. చీమ మాత్రమే అందులోకి వెళ్ళే వీలుంది. ఓ గంట పాటు ఆకును తీసుకుని ప్రయాణించిన చీమ ఇప్పుడేం చేయాలి? ఆకును పుట్ట బయటే విడిచిపెట్టి అది మాత్రమే లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి. అటువంటప్పుడు చీమ ఇంతసేపూ చేసిన ప్రయాణం వృధానే కదా... అనిపిస్తుంది. ఇంతోటి దానికి అది ఇంతగా శ్రమించకుండా ఉండాల్సింది కదా అనిపిస్తుంది చూసేవారికి.
ఈ నేపథ్యంలో చీమ నుంచి ఓ పాఠం నేర్చుకున్నాడా ధనవంతుడు... అనవసరంగా అవీ ఇవీ చేర్చుకుంటూ జీవితాన్ని లాగడం ఎందుకని తన డైరీలో రాసుకున్నాడు.
మనిషి తన జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రయత్నాలు చేసి కష్టించి శ్రమించి కావలసిన వసతులు సమకూర్చుకుం టాడు. ఓ పెద్ద భవనం కట్టుకుంటాడు. విలాసవంతమైన కారు కొంటాడు. ఆడంబ రమైన జీవితం సాగిస్తాడు. చివరికి అతను శ్మశానానికి పోయేటప్పుడు ఇంతకాలమూ అనుభవించిన వాటినన్నింటినీ విడిచిపెట్టి తాను మాత్రమే వెళ్ళక తప్పదు. – సాత్యకి యామిజాల
Comments
Please login to add a commentAdd a comment