ఈ బసంత్‌రెడ్డి దయ ఉన్నోడు! | Telangana gulf association president basanth reddy about dubai problems | Sakshi
Sakshi News home page

ఈ బసంత్‌రెడ్డి దయ ఉన్నోడు!

Published Mon, Jul 16 2018 12:01 AM | Last Updated on Mon, Jul 16 2018 12:34 PM

 Telangana gulf association president basanth reddy about dubai problems - Sakshi

పాట్కూరి బసంత్‌రెడ్డి

దయ ఉన్నోడు దమ్మున్నోడికన్నా ఎక్కువ. దమ్మున్నోడు ఏదైనా చెయ్యగలడేమో! దీనావస్థలో ఉన్నోళ్లని గల్ఫ్‌ నుంచి తప్పించడం.. తెప్పించడం.. దయ ఉన్నోడి వల్లనేఅవుతుంది. బసంత్‌రెడ్డి దయ ఉన్నోడు. ఇంత దయ.. అంత కాదు. ఎంత దయో తెలుసుకోవాలంటే.. నిజామాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లిన రణధీర్‌ గురించి తెలుసుకోవాలి. కరీంనగర్‌ నుంచి ఇరాక్‌ వెళ్లిన రాగుల కిష్టయ్య గురించి తెలుసుకోవాలి.

రణధీర్‌కి పాతికేళ్లు. నిజామాబాద్‌ జిల్లా కొలిప్యార్‌ గ్రామం. దుబాయ్‌కెళ్లి భవన నిర్మాణ రంగ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తెలియని కసితో పని చేశాడు. దుబాయ్‌ రావడానికి అయిన ఖర్చు కళ్ల ముందు కనిపిస్తోంది. సుఖంగా ఉద్యోగం చేసుకుంటూ కాలం గడిపితే అప్పులు తీరవు, నాలుగు డబ్బులు చేరవు. అందుకే శ్రమ అనే మాటకు తావులేకుండా ఒళ్లు తెలియకుండా పని చేశాడు. ఒళ్లు నొప్పులు పెడుతున్నా పని చేశాడు. ఆరు నెలలు గడిచాయి. ఓ రోజు అసలే లేవలేకపోయాడు. ‘అంతలా పని చేస్తుంటే... ఒళ్లు హూనమైపోదూ. రెండ్రోజుల్లో మామూలవుతాళ్లే’ అనుకున్నారు తోటివాళ్లు. అప్పటి నుంచి ఒకరోజు పని చేస్తే రెండు రోజులు మంచం పట్టేవాడు రణధీర్‌.

ఈ వయసులో ఇదేంటి అనుకున్నారు, కానీ అతడిని క్యాన్సర్‌ భూతం పీడిస్తోందని ఎవరూ ఊహించలేదు. క్యాన్సర్‌ చాపకింద నీరులా వ్యాపిస్తూ ఒంట్లోని శక్తిని హరిస్తూ  మనిషిని పీల్చి పిప్పి చేస్తోంది. అంతా జ్వరమనే అనుకున్నారు. తోటి ఉద్యోగులు అతడిని హాస్పిటల్‌లో చేర్చారు. దుబాయ్‌ షేక్‌లకు భారతీయులంటేనే చిన్న చూపు. ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా ఆ వివక్ష కొట్టొ్టచ్చినట్లు కనిపిస్తుంటుంది. పేషెంట్‌ ఏ కండిషన్‌లో వచ్చినా సరే, ‘ఏమీ కాదు, ఈ మందులు చాలు’ ఒక ఇంజక్షన్, రెండుమాత్రలు ఇస్తారు.

రణధీర్‌కి అందిన వైద్యం కూడా అలాంటిదే. మూడు నెలల పాటు హాస్పిటల్‌లోనే ఉన్నాడు. హాస్పిటల్‌లో తోడు ఎవరూ లేరు. కంపెనీ వాళ్లు పట్టించుకోలేదు. రెండు నెలలైనా ఇచ్చిన మందులకు రోగం నయం కావడం లేదని వైద్యులకు అప్పుడు అనుమానం వచ్చింది. కొన్ని ప్రాథమిక పరీక్షలు చేశారు. అప్పటికే క్యాన్సర్‌ వ్యాధి ముదిరిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే అతడి ప్రాణాలు దుబాయ్‌ గాల్లో కలిసిపోయాయి.

పక్కన ఉన్నది అతడొక్కడే
రణధీర్‌ పక్క ఊరే పాట్కూరి బసంత్‌రెడ్డిది. రణధీర్‌తోపాటు అదే కంపెనీలో పని చేసేవాడు. రణధీర్‌ని హాస్పిటల్‌లో చేర్పించింది అతడే. మధ్యలో వెళ్లి చూసి వచ్చిందీ అతడే. రణధీన్‌కి ఎందుకు తగ్గడం లేదని డాక్టర్లను బతిమాలి మెరుగైన వైద్యం చేయమని ప్రాధేయపడిన వ్యక్తీ అతడొక్కడే. రణధీర్‌ ప్రాణాలను కాపాడ్డమైతే ఎవరి తరమూ కాలేదు.

కనీసం అతడి దేహాన్నయినా అతడి వాళ్లకు చేర్చాలి. కంపెనీ ఆ చొరవ కూడా తీసుకోవడం లేదు. కంపెనీలో పై అధికారి దగ్గరకు పోయి అవసరమైన క్లియరెన్స్‌లు తీసుకుని రణధీర్‌ దేహాన్ని ఇండియాకు పంపించి కన్నీళ్లు తుడుచుకున్నాడు బసంత్‌ రెడ్డి. గల్ఫ్‌ బాధితులకు సహాయం చేయడం అలా మొదలైంది బసంత్‌ రెడ్డికి. అప్పట్లో అతడు కూడా అనుకోలేదు ఈ సేవ తన జీవితంలో తనతో మమేకమవుతుందని!

‘అమ్మా.. నేనొచ్చేస్తా’..
నిజామాబాద్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి 1996లో దుబాయ్‌కెళ్లాడు బసంత్‌రెడ్డి. అప్పటికి అతడికి 21 ఏళ్లు. ముగ్గురన్నదమ్ముల్లో చిన్నవాడు. సామాన్య రైతు కుటుంబం. ముగ్గురూ పంచుకోగా ఒక్కొక్కరికి పదెకరాల పొలం వచ్చింది. మట్టిలోనే అదృష్టాన్ని పరీక్షించుకుందామని బోర్లు వేస్తే నీరు పడలేదు. అప్పులు పెరిగిపోయాయి. ఓ ఐదారేళ్లు గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తే ఆర్థిక కష్టాలను గట్టెక్కవచ్చనుకున్నారు ఇంట్లో వాళ్లు. అలా వెళ్లిన బసంత్‌రెడ్డికి దుబాయ్‌లో నరకం కనిపించింది. ఏజెంట్‌ చేతిలో తాను మోసపోలేదు, కానీ అలా మోసపోయిన వాళ్ల కన్నీళ్లతో ఎడారి తడిసిపోతుందనిపించింది.

ఇప్పుడున్నట్లు అప్పట్లో మొబైల్‌ ఫోన్‌లు లేవు. సొంతూర్లో పోస్టాఫీస్‌ కూడా లేదు. గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఏ మూడేళ్లకోసారో ఇండియాకి వచ్చి ఇంట్లో వాళ్లను చూసుకునే వాళ్లు. అలా ఇండియాకి వచ్చే వాళ్ల కోసం ఆ ఇంటి వాళ్లే కాదు ఆ చుట్టు పక్కల ఊళ్ల వాళ్లు కూడా ఎదురు చూసేవాళ్లు. ఆ దేశాల్లో ఉన్న తమ వాళ్ల క్షేమ సమాచారాల కోసమే వాళ్లందరి ఎదురు చూపులు. దుబాయ్‌ నుంచి ఇండియాకి వచ్చే వాళ్ల వెంట తమ వాళ్లకు బహుమతులతోపాటు ఉత్తరం రాసి పంపేవాళ్లు అక్కడ ఉన్న వాళ్లు. ఉత్తరం రాయడం రాని వాళ్లు తమ మాటలను క్యాసెట్‌లలో రికార్డు చేసి పంపేవాళ్లు. ఇదీ అప్పట్లో ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వాళ్ల పరిస్థితి.

బసంత్‌ రెడ్డి పరిస్థితి అందుకు భిన్నమేమీ కాదు. ‘అమ్మా! ఇల్లు వదిలి నేనుండలేదెప్పుడూ. ఇక్కడ ఉండలేకపోతున్నాను. వచ్చేస్తాను’ అని ఓ రోజు తల్లికి ఉత్తరం రాసి, దగ్గర ఊరికి చెందిన గంగారామ్‌తో పంపించాడు. గంగారామ్‌ మూడు నెలల తర్వాత దుబాయ్‌కి తిరిగి వస్తాడు. అప్పుడు తన తల్లి రాసిచ్చిన సమాధానం తెస్తాడు, తల్లి ఉత్తరంలో తనను ఇండియాకి వచ్చేయమనే ఉంటుంది... అని ఎంతగానో ఎదురు చూశాడు. తల్లి నుంచి సమాధానం వచ్చింది, అయితే వెంటనే వచ్చేయమని కాదు. ‘వ్యవసాయంలో ఖర్చులు భరించలేక రెండు ఎడ్లను అమ్మేశాం చిన్నోడా’ అని ఉందా ఉత్తరంలో.

ఆ ఉత్తరాన్ని పదులసార్లు, వందలసార్లు చదువుకున్నాడు బసంత్‌రెడ్డి. చదివిన ప్రతిసారీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత కష్టమైనా సరే.. పని చేసి తీరాలని నిర్ణయించుకున్నాడు. పని చేస్తున్నప్పుడు కూడా తల్లి రాసిన ఉత్తరం లో అక్షరాలే కనిపించేవి. అమ్మేసిన ఎడ్లు కళ్ల ముందు మెదిలేవి. అలాగే పని చేశాడు. తర్వాత ఏడాది తల్లి నుంచే మరో ఉత్తరం. ‘పసుపు పంట బాగా వచ్చింది, వ్యవసాయం గాడిన పడింది. నువ్వు అక్కడ పడిన కష్టం చాలు, ఇక వచ్చెయ్యి. ఇక్కడే మన మట్టిలోనే కష్టపడదాం రారా చిన్నోడా’ అని రాసింది. ఆ ఉత్తరాన్ని చదివి పారేయకుండా దాచుకుని మరీ ఇండియాకి వచ్చేశాడు. ఐదున్నరేళ్ల దుబాయ్‌ జీవితం అతడి జీవన పథాన్ని మార్చేసింది.

మూడొందల మందికి విముక్తి!
ఇప్పుడు అతడు నిజామాబాద్‌లో వ్యవసాయం చేస్తున్నాడు. వాణిజ్య పంటల సాగులో బతుకు గాడిన పడింది. ఎవరైనా గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకు పోయారని తెలిస్తే వెంటనే ఆయా దేశాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్‌లతో మాట్లాడి, ఎంబసీలో వివరాలిచ్చి వారిని ఇండియాకి తీసుకువస్తున్నాడు. ఇప్పటికి మూడు వందలకు పైగా గల్ఫ్‌ బాధితులకు సహాయం చేశాడతడు.

తాను పెద్ద చదువులు చదవకపోయినా సరే, తన ఇద్దరు కూతుళ్లను పెద్ద చదువులు చదివించి తీరాలనుకున్నాడు. పెద్దమ్మాయి అశ్విని లా కోర్సు చేస్తోంది. ‘గల్ఫ్‌ బాధితుల తరఫున నేను మానవీయ సాయం మాత్రమే చేస్తున్నాను. బాధితులను కాపాడ్డం కోసం న్యాయపోరాటం చేయడానికి తన ఇంట్లో మరో తరం తయారవుతోంద’ంటాడు బసంత్‌రెడ్డి.


(డబ్బు కోసం వెళ్లితే దుబాయ్‌ ఇలా ఉంటుంది)


( డబ్బుండీ చూడ్డానికి వెళితే దుబాయ్‌ ఇలా ఉంటుంది)

పలికే ఆపద్భాంధవుడు
రాగుల కిష్టయ్యకి వయసు యాభైకి పైనే ఉంటుంది. కరీంనగర్‌ జిల్లా ధర్మపురి దగ్గర బుద్దేశ్‌ పల్లి నుంచి ఇరాక్‌ వెళ్లాడు ఉద్యోగానికి. మిలటరీ క్యాంపులో ఉద్యోగం అని చెప్పాడు ఏజెంట్‌. విజిటింగ్‌ వీసాతో వెళ్లాడతడు. అతడికా విషయం తెలియదు. ఇరాక్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే ఏజెంట్‌ మాయమయ్యాడు. ఏజెంట్‌ చెప్పిన ఉద్యోగమే లేదసలు. రోడ్డు మీద కనిపించిన హోటల్‌లో పని అడిగి కుదిరాడు. పని ఉన్న రోజు తిండి. రోజూ పని ఉండేది కాదు. చదువు రాదు, అక్కడి భాష తెలియదు, ఏ పనిలోనూ నైపుణ్యం లేదు.

ఇరాక్‌ సరిహద్దు ప్రాంతంలో కుర్దులకు– ఐసిస్‌కు మధ్య ఘర్షణలతో రోజూ ఏదో ఓ చోట బాంబుల శబ్దం. బాంబు పడిన శబ్దం వినపడగానే అతడికి గుండెలదిరిపోయేవి. ఓ రోజు రోడ్డు మీద నడుస్తున్న వాడల్లా దగ్గర్లో బాంబు పడిన శబ్దానికి ఉలిక్కి పడి, రోడ్డు మీద తట్టుకుని పడిపోయాడు. కాలికి గాయమైంది. వైద్యం చేయించడానికి ఎవరూ లేరు. కాలు వాచిపోయింది. అప్పుడు తానే హాస్పిటల్‌కెళ్లాడు, కానీ వైద్యులు చెప్పింది విని హతాశుడయ్యాడు. గాయం లోపల్లోపలే ఎముకను తినేసింది, కాలిని తీసేయాలన్నారు. అప్పుడు బసంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి ‘ఎలాగైనా సరే ఇండియాకి తెప్పించండి’ అని భోరుమన్నాడు.

ప్రభుత్వానికి నియమావళి
ఇప్పటికీ వారానికొకరు ‘మా అన్న సౌదీలో చిక్కుకుపోయాడు విడిపించండి, మా పిల్లాడు మస్కట్‌లో నుంచి రాలేకపోతున్నాడు తెప్పించండి’ అంటూ బసంత్‌ రెడ్డి దగ్గరకు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వారిని ఇండియాకి తీసుకురావడంతోపాటు గల్ఫ్‌ వెళ్లే వాళ్లకు జాగ్రత్తలు చెబుతుంటాడాయన. ‘గల్ఫ్‌ వెళ్లే ముందు తనను సంప్రదించిన వారి దగ్గరున్న డాక్యుమెంట్‌లు పరిశీలించి అవి అసలువా నకిలీవా అనేది చెప్తుంటాడు. కొంతమంది ఏజెంట్‌లు డమ్మీ టికెట్‌లతో మోసం చేస్తారు. ఆ టికెట్‌ నంబర్‌ వెబ్‌సైట్‌లో చెక్‌ చేస్తే అసలా పేరుతో టిక్కెట్టే బుక్కయి ఉండదు.

ఎవరి పేరుతోనో బుక్కయిన టిక్కెట్‌ మీద వీళ్ల పేరు వచ్చేట్టు మార్ఫింగ్‌ చేసి డబ్బు లాగేస్తారు. తీరా ఎయిర్‌పోర్టుకెళ్లాక ఫ్లయిట్‌ లేట్‌ అని చెప్పి వీళ్లను ఎక్కడో ఓ మూల కూర్చోబెట్టి ఏజెంట్‌లు మాయమై పోతుంటారు. ఇలాంటి మోసాలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంటుంది. కేరళ ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌ ట్రైనింగ్‌ ఇచ్చి, అసలైన పర్మిట్లతో పంపిస్తోంది. మన తెలుగు ప్రభుత్వాలు కూడా అంతే పక్కాగా అమలు చేస్తే ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టే వాళ్లకు ఇలాంటి వెతలు ఉండవు’ అంటారాయన. ఇందుకోసం ప్రభుత్వానికి ఒక నియమావళిని కూడా సూచించారు బసంత్‌రెడ్డి.

కిష్టయ్య అలా బయటపడ్డాడు\
‘‘కిష్టయ్యకి ఏజెంట్‌ వర్క్‌ పర్మిట్‌ కూడా ఇప్పించలేదు. వీసా గడువు ముగిసిపోయింది. ఇరాక్‌లో అధికారిక వీసా మీద వెళ్లి డ్రైవర్‌ ఉద్యోగం చేస్తున్న రాంచందర్‌కి ఫోన్‌ చేసి కిష్టయ్య వివరాలిచ్చాను. అతడు వెంటనే కిష్టయ్యని కలిసి వివరాలు తీసుకున్నాడు. నేనిక్కడ కిష్టయ్య సొంతూరికి వెళ్లి గ్రామ సర్పంచ్‌ చేత కిష్టయ్య తమ ఊరివాడేననే సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్‌లు రెడీ చేయించాను.

ఇరాక్‌ పోలీస్, సిఐడి, ఎంబసీలకు సబ్‌మిట్‌ చేయాల్సిన డాక్యుమెంట్లన్నీ రెడీ చేసి రాంచందర్‌కి పంపించాను. ఇదంతా సాక్షి పేపర్‌లో వచ్చింది. దాంతో ఎంపీ బాల్క సుమన్‌ కిష్టయ్య కుటుంబానికి ఆర్థిక సాయం చేశాడు. అక్కడ పనులన్నీ రాంచందర్‌ పూర్తి చేశాడు. ఇరాక్‌లోని తెలుగు వాళ్లు చందాలు వేసుకుని టికెట్‌ కొన్నారు. కిష్టయ్యను ఇండియాకు తెచ్చి మంచి వైద్యం చేయించాం.’’ – పాట్కూరి బసంత్‌రెడ్డి, తెలంగాణ గల్ఫ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు  


– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement