ఇంట్లో ఎన్ని మెషీన్‌లు ఉన్నా ఇంట్లో మనిషి మెషీన్‌లా పని చేయడం తప్పదని భావని అనుభవం చెబుతోంది. భావని లేని ఇల్లు, భావని లేందే ఇల్లు లేకపోవచ్చు. అయితే ఇంట్లో ఉండేది ఒక్క భావనియే కాదు కదా! తలా ఒక చెయ్యి వెయ్యమెందుకని?!
భావని వయసు నలభైల చివరికి వచ్చేసింది. నాలుగిళ్లలో పని చేస్తుంది ఆవిడ. ఇంట్లోంచి వెళ్లే ముందు ఇంటి పని మొత్తం చేసి వెళుతుంది. ఇంటికి వచ్చాక ఇంట్లో మిగిలి ఉన్న పనిని చక్కబెడుతుంది. ‘చక్కబెట్టడం’అనే మాటలో ఒడుపుగా చేసేయడం అనే అర్థం ధ్వనించవచ్చు. కానీ అది ఎంత శ్రమతో కూడిన పనో ఆమెకు మాత్రమే తెలుస్తుంది. భర్త, వాళ్ల ఐదుగురు పిల్లల పని కూడా ఇంట్లో ఆమెదే కనుక.. ఆమె పడే శ్రమ గురించి వారికి తెలియదు. పిల్లలైతే చదువుల చివరికి వచ్చేస్తున్నారు కానీ.. భర్త రామ్‌కుమార్ చేపల వ్యాపారం ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. వ్యాపారం అంటే పెద్ద వ్యాపారం కాదు. చెరువు దగ్గర చేపల్ని కొని తెచ్చి చుట్టుపక్కల అమ్మడం. భార్యాభర్తలకు బయట వచ్చేది తక్కువ. ఇంట్లో ఖర్చయ్యేది ఎక్కువ. భావనికి అదనంగా ఒంట్లో శక్తి కూడా ఖర్చవుతుంటుంది. భర్తకు, పిల్లలకు వండిపెట్టడం; వాళ్ల బట్టల్ని ఉతికి, ఇస్త్రీ చేసి ఉంచడం. తిన్నాక మళ్లీ గిన్నెల్ని కడిగి సర్దడం.. ఇవన్నీ తను కష్టం అనుకోదు కానీ, కొన్నిసార్లు కష్టం అవుతుంది.
‘చేయలేకపోతున్నాను’ అని ఒక్కరోజు కూడా భర్తతో గానీ, పిల్లలతో గానీ అనలేదు భావని. ఆర్నెల్ల క్రితం ఓరోజు రామ్‌కుమార్ చెప్పా పెట్టకుండా సెకండ్ హ్యాండ్ వాషింగ్ మెషీన్ తీసుకొచ్చాడు! ఒక కబడ్డీ ప్లేయర్ దగ్గర దానిని మూడు వేలకు కొన్నాడు. దాన్ని తెచ్చిన రోజున భావని కళ్లు మెరిశాయి. కళ్లు మెరిసింది భర్త తెచ్చిన వాషింగ్ మెషీన్‌ని చూసి కాదు. ‘నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను’ అనే భావం భర్త కళ్లల్లో కనిపించి! వాషింగ్ మెషీన్‌ని ఆపరేట్ చేయడం భావనికి కష్టం కాలేదు. తను పని చేసే మధ్యతరగతి ఇళ్లల్లో తను రోజూ చేసే పనే. బట్టలు వెయ్యడం, వాషింగ్ పౌడర్ చల్లడం. మెషీన్ బటన్‌ని నొక్కడం. అంతే. గుర్‌గ్రామ్ (హరియాణా)లోని 15వ సెక్టార్‌లో ఉండే ఝుగ్గీ ప్రాంతంలో ఓ చిన్న ఇంట్లో ఉంటోంది భావని కుటుంబం.
వాషింగ్‌మెషీన్‌కి ఇంట్లో చోటు లేక ఇంటి బయట గుమ్మం పక్కనే పెట్టుకున్నారు. ఆ పక్కనే రెండు మూడు బక్కెట్లు, డ్రమ్ముల నీళ్లు ఉంటాయి. ఆ బక్కెట్లు, డ్రమ్ములకు కూడా ఇంట్లో చోటు లేదు. ఎప్పుడు నీళ్లు రాకుండా పోతాయోనని ముందు జాగ్రత్తగా వాటినెప్పుడూ నింపి ఉంచుకుంటారు. వాషింగ్ మెషీన్.. బట్టల్ని ఎంతసేపట్లో ఉతికేస్తుందో, భావని కూడా అంతే సమయంలో ఉతికేయగలదు కానీ.. వాషింగ్ మెషీన్‌తో ఆ గంట కాస్త శారీరక శ్రమ తగ్గింది. అలాగని ఆమె జీవితమేమీ పూర్తిగా మారిపోలేదు. ‘‘ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్తాను. నేను పని చేసే ఇళ్లలో గిన్నెలు తోమి, బట్టలు ఉతికి, ఇల్లు తుడిచి.. అన్ని ఇళ్ల పనీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి చేరుకుంటాను. ఇంట్లోనూ మళ్లీ అదే పని. ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, వంట చేయడం. సాయంత్రం 5 గంటలకు మళ్లీ బయటి ఇళ్లలో పని. పూర్తయ్యేసరికి రాత్రి ఎనిమిది అవుతుంది. ఇంటికి రాగానే మళ్లీ వంట..’’ అని ముఖంపై చిరునవ్వును చెరగనీయకుండా చెబుతుంది భావని.
Comments
Please login to add a commentAdd a comment