లగడపాటి రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాష్ట్రం విడిపోదని ఆయన ధీమా. ఆ ధీమా ఆయనకు ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధం కావడంలేదు. కాంగ్రెస్ పార్టీలో సమైక్యత కోసం మొదటి నుంచి ఆందోళన చేస్తున్న రాజగోపాల్ రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పటికీ అదే మాటమీద నిలబడినట్లు ఈ రోజు కూడా చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తు సమైక్యతతో ముడిపడి ఉందని కూడా ఆయన అన్నారు.
తమ పదవులకు రాజీనామాలు చేయకుండా, రోజుకో తీరున మాట్లాడుతున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిల నిజాయితీని శంకించినట్లుగానే లగడపాటి మాటలను కూడా జనం నమ్మే పరిస్థితిలేదు. మొదటలో సమైక్యవాదం వినిపించిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఆ తరువాత మాట మార్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం పదవులను లెక్కచేయం అని చెప్పారు. ఉత్తుత్తి రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలను ఆమోదింపజేసుకోలేదు. ఇప్పుడు విభజన అనివార్యం అని, చివరి దశకు వచ్చిందని, ఇంకా సమైక్యత అంటూ పాకులాడటం మంచిదికాదని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. జనం రాష్ట్ర విభజనను ఎంత వ్యతిరేకిస్తున్నా వారికి పట్టదు. వారిని నిలదీస్తున్నా తలవంచుకొని వెళ్లిపోతున్నారు. వారు విభజనకు సిద్దపడి ప్యాకేజీ అడుగుదాం అనే దగ్గరకు వచ్చారు. పదవుల కోసం ఎంతకైనా తెగిస్తారని స్పష్టమైపోతోంది.
ఇక లగడపాటి రాజగోపాల్ కూడా వారికి ఏమీ తీసిపోరు. ఆయనా రాజీనామా చేశారు. ఆమోదింపజేసుకోలేకపోయారు. రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో, తెలంగాణ బిల్లు రూపొందించే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతోంది. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చిన తరువాత కూడా రాష్ట్ర విభజన జరగదని లగడపాటి స్పష్టం చేస్తున్నారు. డిసెంబరు 5 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టరని కూడా ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సమైక్య రాష్ట్రంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయని లగడపాటి చెప్పారు. విభజనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ కూడా మిగలరని ఆయన పరోక్షంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను హెచ్చరించారు. తెలంగాణపై సిడబ్ల్యూసి చేసిన తీర్మానాన్నిముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అందరూ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విభజన జరిగే ప్రసక్తిలేదని ఆయన ఏ ధీమాతో చెబుతున్నారో అర్ధం కావడంలేదు.
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటి) చేయాలనే సీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, జెడి శీలం వాదనను ఆయన తప్పు పట్టారు. విభజన జరగకపోతే, జరుగుతుందని అనేవాళ్లు రాజీనామాలు చేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. తాను మాత్రం విభజన జరిగితే మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని చెప్పారు. విభజన ప్రక్రియ వేగంగా జరిగిపోతున్న నేపధ్యంలో జనం ఎవరి మాటలు నమ్మాలి? లగడపాటి రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉందా? లేదా? అనేది చెప్పాలంటే కొద్దిరోజులు వేచి ఉండక తప్పదు.