జాతీయ నాయకుడిగా ఎదుగుతున్న జగన్
పట్టువదలని విక్రమార్కుడిలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి సమైక్యాంధ్ర కోసం దేశమంతటా పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి నుంచి దేశంలోని ప్రతి జాతీయ నాయకుడిని కలిసి మద్దతు కూడగట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో సమైక్యాంధ్ర అంశమే ఈనాడు చర్చ అయింది. దేశం నలుమూలల సమైక్యవాదుల వాణి వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మన రాష్ట్ర సమస్యకు ప్రాధాన్యత పెరగడమే కాక జగన్ జాతీయ నాయకుడిగా కూడా ఎదుగుతున్నారు. అన్ని జాతీయ పార్టీలకు చెందిన నేతలతో పరిచయాలు పటిష్టమవుతున్నాయి.
రాష్ట్రం విడిపోతే ఏర్పడే సమస్యలు జగన్ వివరించడం - ఒక ప్రజా సమస్యపై అతను స్పందించిన తీరు - కేంద్రం చర్యలను ఇప్పుడు ఎవరూ ప్రతిఘటించకపోతే భవిష్యత్లో ఇతర రాష్ట్రాలను కూడా ఢిల్లీ నేతలు విభజిస్తారని జగన్ హెచ్చరించడం - అతని పట్టుదల - కార్యదీక్ష.... జాతీయ నాయకులను సైతం మగ్ధులను చేశాయి. అత్యధిక మంది నేతలు ఆయనకు మద్దతు పలికారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడారు. పార్లమెంటులో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఢిల్లీ, కోల్కతా పర్యటనలు ముగించుకొని, ఈరోజు భువనేశ్వర్ వెళ్లారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిశారు. నవీన్ పట్నాయక్తోపాటు కళింగాంధ్రలు కూడా జగన్ సంకల్పానికి మద్దతు పలికారు. జగన్ కలిసిన అనంతరం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ సంకుచిత రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని విడదీయరాదన్నారు. రాష్ట్ర విభజన అనేది సామాజిక, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలతో కూడిన చాలా సున్నితమైన అంశమని తెలిపారు. ఏ నిర్ణయం తీసుకునేముందైనా ఏకాభిప్రాయం సాధించడం చాలా అవసరమని చెప్పారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం రాష్ట్రాలను విడదీయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియలో రాజకీయవర్గాలతో నిశితంగా చర్చించాలన్న అంశాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని పట్నాయక్ మండిపడ్డారు.
జగన్ రేపు ముంబై వెళ్లి అక్కడ కూడా సమైక్యత గురించి ఎలుగెత్తి చాటుతారు. ముంబైలో జగన్ ఎన్సిపి అధినేత శరద్ పవార్ను, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేను కలుస్తారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వమని వారిని కోరతారు. రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజల అభిష్టం మేరకు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయుడుగా జాతీయ స్థాయిలో జగన్ గుర్తింపు పొందారు. రాష్ట్రం విడిపోకూడదని, సమైక్యంగా ఉండాలని స్పష్టమైన అభిప్రాయంతో అదే మాటపై నిలబడిన నేతగా సమైక్యవాదులకు అండగా జగన్ నిలిచారు. అదే లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ప్రజాపక్షంగా నిలిచి, దేశం నలుమూలల పర్యటిస్తూ, నేతలందరి మద్దతు కోరుతూ జగన్ గొప్ప నేతగా ఎదిగిపోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు.