అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేయాలి
భువనేశ్వర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఓట్లు, సీట్ల కోసం రాజ్యాంగంలోని మూడో అధికరణను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు వివరించారు. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్రాలను విభజించేందుకు అవకాశమిస్తున్న ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరముందని చెప్పారు. ఏదైనా రాష్ట్ర విభజనకు ఆ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించటం తప్పనిసరి చేయాలని.. కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీతో విభజనకు మద్దతివ్వటం తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.
అసెంబ్లీతో పాటు, పార్లమెంటులో కూడా మూడింట రెండు వంతుల మెజారిటీ మద్దతు ఇస్తేనే విభజన చేపట్టేలా మూడో అధికరణను సవరించాలన్నారు. లేదంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఏకపక్ష విభజన రేపు ఏ రాష్ట్రానికైనా జరగవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ రాజ్యాంగ సవరణ కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని నవీన్‌కు జగన్ విజ్ఞప్తి చేశారు. జగన్ చెప్పిన విషయూలన్నింటినీ కూలంకషంగా విన్న నవీన్ పట్నాయక్.. ఆయన అభిప్రాయాలు, వాదనలతో ఏకీభవించినట్లు సమాచారం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూ ఆయన ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
అడ్డగోలు విభజనపై నవీన్‌కు నివేదన
అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకోవటం కోసం, మూడో అధికరణ సవరణ కోసం వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బాలశౌరి, ఎం.వి.మైసూరారెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లతో కలిసి భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. జగన్ బృందాన్ని నవీన్ పట్నాయక్ ఆత్మీయంగా స్వాగతించారు. నవీన్ నివాసంలో దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశంలో.. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని జగన్ వివరించారు. ఆయా అంశాలపై ఒక వినతిపత్రాన్ని నవీన్‌కు అందించారు. పలు అంశాలను నవీన్ అడిగి తెలుసుకున్నారు.
ఈ విషయంలో మిగిలిన రాజకీయ పార్టీల స్పందన గురించి ఆరాతీశారు. అనంతరం నవీన్ పట్నాయక్, జగన్‌మోహన్‌రెడ్డి సంయుక్తంగా మీడియూ ముందుకు వచ్చారు. నవీన్ మాట్లాడిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించటాన్ని అడ్డుకునేందుకు, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించేందుకు దేశ వ్యాప్తంగా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టే కృషిలో భాగంగా.. బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను తాము కలిశామని చెప్పారు. తమ వాదనతో ఏకీభవించిన నవీన్ తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించారంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజిస్తున్నారు...
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్‌ఆర్‌సీ) సిఫారసుల ఆధారంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే నిర్ణయం తీసుకున్నారని తప్పుపట్టారు. గతంలో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయని.. ఆ తర్వాతే వాటిని విభజించారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో అలాంటి సంప్రదాయం పాటించలేదని.. రాజ్యాంగంలోని మూడో అధికరణ కింద అధికారం ఉంది కదా అని కేంద్రం ఇష్టానుసారంగా విభజన చేయూలనుకుంటోందని తప్పుపట్టారు. ఇలా చేయటం దుష్టసంప్రదాయాన్ని ప్రారంభిస్తుందని.. ఈ అధికరణ దుర్వినియోగం కావటాన్ని అడ్డుకోవటంలో అండగా నిలబడాలని నవీన్‌ను కోరినట్లు జగన్ చెప్పారు. రాజ్యంగంలోని మూడో అధికరణను సవరించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఏ రాష్ట్రానైనా విభజించాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం తప్పనిసరి చేయాలని, కనీసం మూడింట రెండొంతుల మెజారిటీతో అయినా విభజనకు ఆమోదం తెలపటం తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. అసెంబ్లీతో పాటు పార్లమెంటులోనూ మూడింట రెండొ వంతుల మెజారిటీతో విభజనకు ఆమోదం తెలిపితేనే.. ఆ రాష్ట్రాన్ని విభజించాలన్నారు. లేదంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అరుునా.. ఢిల్లీలో కూర్చుని ఓట్లు, సీట్ల కోసం ఏ రాష్ట్రాన్నైనా తమ ఇష్టానుసారం అడ్డుగోలుగా విభజిస్తుందని జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘తృతీయ ఫ్రంట్ అంశంపై చర్చించారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. ‘‘దయచేసి విషయూన్ని పక్కదారి పట్టించకండి.. రాష్ట్ర విభజన అనేది చాలా లోతైన, తీవ్రమైన అంశం. సాదాసీదా రాజకీయాలు కాదు.. ఈ విషయంలో మీతో సహా మేధావులందరి సంపూర్ణ మద్దతు మాకు అవసరం’’ అని జగన్ విజ్ఞప్తి చేశారు. నవీన్ పట్నాయక్‌తో తనకు బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఇవి కొనసాగుతాయని పేర్కొన్నారు.
భువనేశ్వర్‌లో జగన్‌కు తెలుగువారి ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్ ఏకపక్ష విభజనకు వ్యతిరేకంగా ఒడిశా సీఎం మద్దతు కోరేందుకు భువనేశ్వర్ వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని ఇక్కడి తెలుగు ప్రజలు అపూర్వంగా స్వాగతించారు. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు.. తెలుగు కల్చరల్ సొసైటీ, తెలుగు యూత్ ఫోరం, తెలుగు సొసైటీ ఆఫ్ ఒడిశా సంఘాల ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు ఘనంగా ఆహ్వానం పలికారు. ఒడిశా సంప్రదాయంలో శంఖం ఊదుతూ ఆయనను పూల వర్షంలో ముంచెత్తారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్లకార్డులు చేతబట్టి ‘జై జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ జై, వైఎస్ రాజశే ఖర్‌రెడ్డికి జై’ అంటూ నినాదాలు చేశారు. విమానాశ్రయం నుంచి జగన్ బస చేసిన హోటల్ వరకూ పెద్ద సంఖ్యలో అభిమానులు ర్యాలీగా వెంట వచ్చారు. హోటల్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న జగన్‌ను కలిసేందుకు చాలా మంది వరుసకట్టారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగు ప్రముఖులను కలిసిన జగన్.. ఒడిశాలోని ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. సమైక్యాంధ్రపై ఇక్కడి తెలుగువారి అభిప్రాయూన్ని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వచ్చిన తుపాను గురించి, దాని వల్ల జరిగిన నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ పర్యటన సందర్భంగా ఒడిశా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం హోటల్ నుంచి సీఎం ఇంటికి వెళ్లారు. జగన్ వెంట సేవాదళం రాష్ట్ర కార్యదర్శి సుంకరి చిన్నితో పాటు శ్రీకాకుళం నేతలు కణితి విశ్వనాథం, వరుదు కల్యాణి, నల్లా సూర్యప్రకాశరావు ఉన్నారు.
ప్రజల్లో ఏకాభిప్రాయం సాధించాలి
సంకుచిత ఎన్నికల లబ్ధి కోసం విభజన సరికాదు: నవీన్
ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ అంశాలపై జగన్‌మోహన్‌రెడ్డి తనతో చర్చించినట్లు నవీన్ మీడియాకు తెలిపారు. ‘‘రాష్ట్ర విభజన అనేది రాజకీయ, సామాజిక, మనోభావాలకు సంబంధించిన ఒక సున్నితమైన అంశం. ఆంధ్రప్రదేశ్ విషయంలో.. విభజన నిర్ణయం తీసుకోవటానికి ముందు రాష్ట్ర ప్రజలను సంప్రదించి ఉండాల్సింది. ఏకాభిప్రాయాన్ని సాధించి ఉండాల్సింది. సంకుచిత రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం రాష్ట్రాలను విభజించటం సరికాదు. ఈ ప్రక్రియ మొత్తంలో ఒక సున్నితమైన రాజకీయ చర్చ లోపించింది’’ అని ఒడిశా సీఎం వ్యాఖ్యానించారు. ‘తృతీయ కూటమి అంశంపై చర్చించారా?’ అన్న విలేకరుల ప్రశ్నకు.. అలాంటి చర్చలేమీ జరగలేదని నవీన్ స్పష్టంచేశారు. సాధారణంగా అత్యంత ముక్తసరిగా మాట్లాడే నవీన్.. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి తన అభిప్రాయాలను కాగితంపై రాసుకుని, మీడియాకు వివరంగా చదివి వినిపించటం విశేషం.