అధికారిని కాదు... శ్రీవారి సేవకుడిని! | Am not officer TTD, only servent to Sri venkateswara swamy | Sakshi
Sakshi News home page

అధికారిని కాదు... శ్రీవారి సేవకుడిని!

Published Sun, Sep 28 2014 1:41 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

అధికారిని కాదు... శ్రీవారి సేవకుడిని! - Sakshi

అధికారిని కాదు... శ్రీవారి సేవకుడిని!

‘‘తిరుమల జేఈవో అంటే అన్ని స్థాయుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగాన్ని కత్తిమీద సాములా చేయాల్సి ఉంటుంది. అయినా సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యతగా పారదర్శకమైన సంస్కరణలు చేపట్టాం. టీటీడీ విద్యాసంస్థల్లో చదువుకున్నాను. యాదృచ్ఛికంగా జేఈవోగా వచ్చాను. అందుకు నేనెంతో గర్వ పడుతున్నా’’నని అంటున్నారు నగరి సత్రంబడిలో చదువుకుని తిరుమల జేఈవో స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు. చిత్తూరు జిల్లా వాసి అయిన శ్రీనివాసరాజు తిరుమలతో తనకున్న అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు...
 
 చిత్తూరు జిల్లా వాసిని కావటంతో చిన్ననాటి నుంచీ తిరుమలతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆరునెలలకొకసారైనా స్వామి దగ్గరకు వచ్చేవాడిని. ఇప్పుడు నా వయసు నలభై తొమ్మిది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచీ దాదాపుగా నలభై ఏళ్లుగా కొండకు వస్తున్నట్టు గుర్తుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నగరి సత్రంబడిలో చదివాను. బీసీఎం జెడ్పీహైస్కూల్‌లో చదువుతూ వేసవి సెలవుల్లో ఎక్కువగా కుటుంబంతో వచ్చాను. ఇక ఏ ఇతర సెలవులు వచ్చినా కొండకు రావాల్సిందే. దర్శనం సాయంత్రమే కలిగినా కొండ మీదే నిద్ర చేసేవాళ్లం. అలా చేయటం ఇక్కడి సంప్రదాయం. అలా చేస్తేనే యాత్రకు పరిపూర్ణత ఉంటుందన్నది పెద్దల మాట. అప్పట్లో ఇంత జనం వచ్చేవారు కాదు. అన్నీ సులభంగానే లభించేవి. కుటుంబంతో కలసి స్వామిని దర్శించుకోవడం చాలా హాయి అనిపించేది. తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజిలో చదివే రోజుల్లో బైక్‌పై తిరుమల కొండెక్కి దిగటం ఓ సరదా. ఏక శిలాతోరణం కింది భాగంలోని చక్రతీర్థంలో మిత్రులతో కలసి స్నానం చేసేవాళ్లం.
 
 ఆలయం చుట్టూ ఊరుండేది...
 అప్పట్లో అన్ని ఆలయాల మాదిరిగానే ఇక్కడ కూడా చుట్టూ ఇళ్లు, దుకాణాలు, లాడ్జిలు, సత్రాలు, మఠాలు ఉండేవి. 1986 వరకు మహద్వారం నుంచే ఆలయంలోకి వెళ్లే వాళ్లం. తర్వాత ఎన్నో మార్పులొచ్చాయి. దశలవారీగా ఆలయం చుట్టూ విస్తరించారు. అప్పటి నుంచి ఆలయం తప్ప మారని స్థలమంటూ ఏదీలేదు. పెరిగే భక్తుల కోసం ఆ మార్పులు చేయక తప్పలేదు. అయితే, ఆ రోజైనా, ఈ రోజైనా స్వామి అనుగ్రహం కోసమే మనమందరం పరితపిస్తున్నామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
 
 స్వామి సేవ చేయాలన్న కోరిక...
 మాది చిత్తూరు జిల్లా కావటం, తిరుపతిలో, అందునా టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకోవడంవల్లేనేమో, ఏదో రూపంలో స్వామి సేవ చేయాలనే కోరిక నాలో బలంగా ఉండేది. అయితే, దేవుని సన్నిధిలోకే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జేఈవో)గా రావటం యాదృచ్ఛికమే.  ధార్మిక సంస్థలోకి నేనొక అధికారిని అన్న హోదాలో కాకుండా కేవలం సేవకుడిగానే నన్ను నేను భావించుకుని వచ్చాను.
 
 భక్తుల కోసం చేసిన సంస్కరణల్లో సంతృప్తి
  తిరుమలలో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇచ్చాం. పాలసీ నిర్ణయంతో రద్దు చేసిన అరుదైన అభిషేకం, తిరుప్పావడ, అర్చన, తోమాల వంటి ఎన్నో ఆర్జిత సేవల్ని పారదర్శకమైన పద్ధతిలో భక్తులకు అందించాం.
  ఆలయంలో అన్నింటికీ కచ్చితమైన పద్ధతి, సమయాన్ని నిర్దేశించాం. సంప్రదాయాలను కొనసాగిస్తూ, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆలయ పాలన సాగుతోంది. స్వామి సన్నిధిలో తప్పులు జరిగే అవకాశం లేకుండా చేయటం ఆనందాన్ని ఇచ్చింది.
  గదుల కేటాయింపుల్లో శాస్త్రీయ పద్ధతుల్లో దళారుల్ని అరికట్టాం. సిఫారసులు లేని భక్తులకు అదనంగా 1200 గదులు కల్పించాం. భక్తులకు ఉచితంగా అందించే 25 గ్రాముల చిన్నలడ్డును బయట కాకుండా, ఆలయ పోటులోనే సిద్ధమయ్యేలా చూడటం ప్రసాద వితరణలో గొప్ప కార్యంగా భావిస్తున్నా.
  తలనీలాల సాధారణ వేలంలో ఏడాదికి రూ.40 కోట్లు వచ్చే ఆదాయాన్ని అంతర్జాతీయ స్థాయిలో పారదర్శకమైన ఎంఎస్‌టీసీ ఈ-వేలం ద్వారా రూ.260 కోట్లకు పెంచగలిగాం. ఇప్పటికి 11 విడతల్లో మొత్తం రూ.723 కోట్లు స్వామి ఖాతాలో చేరేలా చూడటం గొప్ప ఆనందం.
  హుండీ కానుకలు లెక్కించే పరకామణిలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం నెగటివ్ ఛాంబర్, అదనపు పరకామణి ఏర్పాటు చేశాం. పరకామణి సేవలో ప్రభుత్వ, అనుబంధ ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించాం. మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్ అన్నిటికీ స్పెసిఫికేషన్స్ ఇచ్చాం.
  ఈవోగారి చొరవతో ఆలయంలో మూడు క్యూలైన్ల విధానాన్ని సక్రమమైన పద్ధతిలో అమలు చేసి తోపులాటల్లేకుండా చేశాం.  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆలోచనకు తగ్గట్టుగా... భక్తులు క్యూలైన్లలో వేచి ఉండకుండా రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌లో ప్రవేశ పెట్టి భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా చేశాం.
 
 డాక్టర్ గోపాల్‌రాజు కొడుకుగానే గుర్తింపు
 మా తల్లిదండ్రులు కె.రంగమ్మ, తండ్రి కె.గోపాల్‌రాజు. నాతోపాటు ఆరుగురు సోదరులు, మరో సోదరి. నాన్న శల్య వైద్య నిపుణులుగా పేరు గడించారు. 1987లో అప్పటి మున్సిపల్ అధికారులు తిరుపతిలోని ఓ కాలనీకి ‘డాక్టర్ గోపాల్‌రాజు కాలనీ అని పేరు పెట్టడం మాకు గర్వకారణం. నా సతీమణి శ్రీదేవి. మా కుమార్తె ఉర్వి, కుమారుడు పృథ్వి. ఇద్దరి పేర్లకూ భూమి అనే అర్థం. భూమాతకు ఉండే ఓర్పు మా పిల్లలకూ ఉండాలనే ఆ పేరు పెట్టాం. మా తండ్రిగారు నన్నీ ఉద్యోగంలో చూడలేకపోయారన్న లోటు మాత్రం మిగిలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement