ఏమో గుర్రం ఎగరావచ్చు | funday cover story | Sakshi
Sakshi News home page

ఏమో గుర్రం ఎగరావచ్చు

Published Sun, Apr 15 2018 12:13 AM | Last Updated on Sun, Apr 15 2018 12:13 AM

funday cover story - Sakshi

ఎక్కడైనా గుర్రం ఎగురుతుందా? రెక్కలుంటే తప్పకుండా ఎగురుతుంది. గుర్రానికి రెక్కలుంటాయా? ఎందుకుండవూ?! ఈ జగత్తులో గుర్రాలకు రెక్కలుండకపోవచ్చు గాని, రెండు జగత్తుల్లో మాత్రం గుర్రాలకు రెక్కలుంటాయి. ఒకటి కలల జగత్తు, మరొకటి కళా జగత్తు. 

కళా జగత్తు ఒక రంగుల ప్రపంచం. ఇందులోకి అడుగుపెట్టే వారి కలలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. కొందరి కలలు వారు జీవించి ఉండగానే నెరవేరుతాయి. అలాంటి కళాకారులు అదృష్టవంతులు. ఇంకొందరికి పాపం మరణించిన తర్వాతే గుర్తింపు దొరుకుతుంది. నిరంతర సాధన, నైపుణ్యం, అనితర సాధ్యమైన ఊహాశక్తికి తోడు కొంచెం అదృష్టం కూడా ఉంటే కళా జగత్తులో ఎవరైనా జెండా ఎగరేయవచ్చు. ఏమో గుర్రం ఎగరా వచ్చుననే ఆశతోనే కొత్త కొత్త కళాకారులు కోటి కలలతో ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా కళారంగంపై ఒక సింహావలోకనం...

జీవితాంతం అతడు దేశ దిమ్మరిలాగానే గడిపాడు. ఎక్కడా స్థిరంగా ఎక్కువ కాలం జీవించలేదు. పొట్ట కూటి కోసం రకరకాల ఉద్యోగాలు చేశాడు. మొదట ఆర్ట్‌ డీలర్‌గా పనిచేశాడు. ఆ పని మొహం మొత్తేయడంతో మత బోధకుడిగా కొన్నాళ్లు పనిచేశాడు. ఆ ఉద్యోగం ఊడిపోవడంతో ఉపాధి కోసం బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. అద్భుతమైన కళా సృజన చేసిన కాలంలో కటిక దారిద్య్రాన్ని చవి చూశాడు. అతడి బొమ్మలు అంతగా అమ్ముడయ్యేవి కాదు. ఒకటీ అరా అమ్ముడైనా పొట్ట నింపుకోవడానికి తగిన ధర కూడా వచ్చేది కాదు. మానసికంగా కుంగిపోయాడు. చివరి దశలో మతిభ్రమించి మానసిక రోగిగా మారాడు. మతి చలించిన స్థితిలో ఒకసారి మద్యం మత్తులో మునిగి చెవి కోసేసుకున్నాడు. కోసేసిన చెవికి కట్టు కట్టించుకున్న తర్వాత తన అవతారాన్నే కాన్వాస్‌పైకి ఎక్కించాడు. మతి భ్రమించిన స్థితిలోనే 37 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణం తర్వాత గాని కళా ప్రపంచం అతడి ఘనతను గుర్తించలేదు. మరణానంతరం ప్రఖ్యాతుడైన ఆ కళాకారుడు విన్సెంట్‌ వాంగో. వాంగో చిత్రాల్లో ఒకటైన ‘పోర్రై్టట్‌ ఆఫ్‌ డాక్టర్‌ గాషెట్‌’కు 1990లో జరిగిన వేలంలో ఏకంగా 82.5 మిలియన్‌ డాలర్ల (రూ.536.29 కోట్లు) ధర పలికింది. ద్రవ్యోల్బణాన్ని లెక్కల్లోకి తీసుకుంటే, ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన పెయింటింగ్స్‌లో అప్పటికీ ఇప్పటికీ ఇదే రికార్డు. తన కుంచెతో చిత్రకళను సుసంపన్నం చేసినప్పటికీ వాంగో ఒక నిరుపేద.

విలాసాలకు కొదువలేని రాచ కుటుంబంలో పుట్టాడు. అంతమాత్రాన కళా పోషణతోనే సరిపెట్టుకోలేదు. స్వయంగా కళా సాధన చేపట్టాడు. రంగుల కలలకు రూపునిచ్చేందుకు కుంచె చేతపట్టాడు. వాస్తవిక చిత్రాలను చిత్రించడంలో పాశ్చాత్య శైలిని ఆకళింపు చేసుకుని, ఆ శైలిలో దేశీయ చిత్రాలను చిత్రించాడు. దేవతలు, దేవుళ్ల బొమ్మలను, పురాణాల్లోని సన్నివేశాలను తైలవర్ణాలతో అద్భుతంగా చిత్రించాడు. ఒక లిథోగ్రాఫ్‌ ప్రెస్‌ నెలకొల్పి, తన చిత్రాలకు నకళ్లను వేలాదిగా ముద్రించాడు. అతడు చిత్రించిన దేవతల బొమ్మల నకళ్లు ఆ రోజుల్లో ఇంటింటా పూజలందుకున్నాయి. భారతీయ చిత్రకళారంగంలో ఒక వెలుగు వెలిగిన ఆయన పేరు రాజా రవివర్మ. ఘనత వహించిన ట్రావెన్‌కోర్‌ రాచవంశానికి చెందిన రాజా రవివర్మ తొలి గురువు మన తెలుగు కళాకారుడే. ఆయన పేరు రామస్వామి నాయుడు. రాజా రవివర్మకు కళా ప్రస్థానంలో పెద్దల ప్రోత్సాహం దొరికింది. మెలకువలు నేర్పే గురువులు దొరికారు. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం సహా పలువురు సంస్థానాధీశుల నుంచి సన్మాన సత్కారాలూ దక్కాయి. నిజ జీవితంలోనే కాదు, చిత్రకళా రంగంలోనూ రాజా రవివర్మ ఒక రారాజు.

వెండితెర వెలుగులను తలదన్నే విపణి
రాజు పేద కథలు అన్ని రంగాల్లోనూ ఉంటాయి. ఈ కథలెలా ఉన్నా, వెండితెర వెలుగులను తలదన్నే విపణి చిత్రకళా రంగానిది.  సినీరంగంతో పోలిస్తే చిత్రకళా రంగానికి ఉన్న మార్కెట్‌ చాలా ఎక్కువ. ఇటీవలి లెక్కలనే తీసుకుంటే 2016 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్‌ మార్కెట్‌ వార్షిక టర్నోవర్‌ 4500 కోట్ల డాలర్లు (రూ.2.92 లక్షల కోట్లు). ఈ లెక్కలను ద యూరోపియన్‌ ఫైనార్ట్‌ ఫెయిర్‌ (టీఈఎఫ్‌ఏఎఫ్‌) వెల్లడించింది. ఇక అదే ఏడాది నాటికి ప్రపంచ సినీ పరిశ్రమ మార్కెట్‌ వార్షిక టర్నోవర్‌ 3860 కోట్ల డాలర్లు (రూ.2.50 లక్షల కోట్లు) మాత్రమేనని మోషన్‌ పిక్చర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా వెల్లడించింది. ఆర్ట్‌ మార్కెట్‌లో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఆ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ట్‌ మార్కెట్‌ టర్నోవర్‌ సినీ పరిశ్రమ టర్నోవర్‌ను మించి ఉంటే, భారత్‌లో మాత్రం సినీ పరిశ్రమదే అగ్రస్థానం. భారత సినీ పరిశ్రమ వార్షిక టర్నోవర్‌ 2016 నాటికి రూ.13,800 కోట్లు అయితే, ఆర్ట్‌ మార్కెట్‌ టర్నోవర్‌ రూ.1460 కోట్లు మాత్రమే. కళపై అధ్యయనం చేసేవారు, కళను ప్రోత్సహించేవారు మన దేశంలో తక్కువగా ఉండటమే ఈ పరిస్థితికి కారణం. అలాగే కళను కెరీర్‌గా ఎంచుకున్నా, ఈ రంగంలో నిలదొక్కుకోవడం వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం కావడంతో చాలామంది కళాకారులు ఉపాధి కోసం ఇతరేతర వృత్తి ఉద్యోగాల్లో ఉంటూ అమెచ్యూర్‌ ఆర్టిస్టులుగానే మిగిలి పోతున్నారు.

కళ కూడా వ్యాపారమే
కళ కూడా వ్యాపారమే. కళతో ఏమాత్రం సంబంధం లేని దళారులు, కళపై పెద్ద పరిజ్ఞానం లేని వ్యాపారులు కళాఖండాల మీద పెట్టుబడులు పెడుతుంటారు. పాతసామాన్లు అమ్మే దుకాణాలు మొదలుకొని బడా బడా వేలంశాలల నుంచి కళాఖండాలు కొనుగోలు చేస్తుంటారు. వాటి ధరకు రెక్కలు రాగానే అమ్మేసి, లాభాలు సంపాదిస్తారు. స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉంటాయేమో గాని, ఆర్ట్‌ మార్కెట్‌లో నష్టాలు వాటిల్లే అవకాశాలు దాదాపు ఉండవు. గుడ్డిగా నకిలీ కళాఖండాలు కొని మోసపోయిన వారు కొద్దిమంది అక్కడక్కడా ఉండొచ్చు గాని, ఆర్ట్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారు నష్టపోయే సందర్భాలు చాలా అరుదు. ఆర్ట్‌ మార్కెట్‌లో అదృష్టం కలిసొస్తే వచ్చే లాభాలు ఎలా ఉంటాయో ఒక చిన్న ఉదాహరణ. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆడమ్స్‌టౌన్‌ చిన్న పట్టణం. ఫిలడెల్ఫియాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు ఒకరు ఆడమ్స్‌టౌన్‌లో పని ఉండి వచ్చాడు. అక్కడ పాతసామాన్లు అమ్మే ఒక దుకాణంలో కనిపించిన పెయింటింగ్‌ ఫ్రేమ్‌ అతడిని ఆకట్టుకుంది. దానిని అతడు కేవలం 4 డాలర్లకు (రూ.260) కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి గోడకు తగిలించబోయే ముందు కాన్వాస్‌పై చిన్న చిరుగు గమనించాడు. దాని కోసం పెయింటింగ్‌ను ఇటూ అటూ తిప్పి చూస్తున్నప్పుడు బలహీనంగా ఉన్న ఫ్రేమ్‌ ఊడొచ్చేసింది. ఫ్రేమ్‌కు, కాన్వాస్‌కు మధ్య భద్రపరచి ఉంచిన పాత కాగితం ఒకటి బయటపడింది. అది అమెరికా వ్యవస్థాపకులు 1776లో రూపొందించిన ‘డిక్లరేషన్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌’ తొలి ప్రతుల్లో ఒకటి.. అధికారికంగా దానిని 500 ప్రతులు మాత్రమే ముద్రించారు. ఆ ప్రతిని అమ్మితే 24 లక్షల డాలర్లు (రూ.15.60 కోట్లు) వచ్చాయి. ఇలాంటిదే ఇంకో ఉదంతం. బ్రిటన్‌లో ఒక మతబోధకుడు పాతసామాన్ల దుకాణంలో కంటికి నదరుగా కనిపించిన పెయింటింగ్‌ను 400 పౌండ్లకు (సుమారు రూ.36,500) కొన్నాడు. ఆ పెయింటింగ్‌ వేసినది 17వ శతాబ్ది నాటి మేటి చిత్రకారుల్లో ఒకరైన సర్‌ ఆంథోనీ వాన్‌ డీక్‌. మతబోధకుడి వద్ద ఉన్న ఆ పెయింటింగ్‌ను ఒక కళాభిమాని 4 లక్షల పౌండ్లు (రూ.3.65 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో మరే వ్యాపారంలోనైనా ఈ స్థాయిలో లాభాలు వస్తాయంటారా? 

అనాది కళ
‘ఆదియందు అక్షరమున్నది’ అని బైబిల్‌ ఉవాచ. చిత్రకళ అక్షరానికంటే ముందే ఉనికిలో ఉండేది. చాలాచోట్ల ఆదిమానవులు నివసించిన గుహలలో వారు తీర్చిదిద్దిన చిత్రాలు బయటపడ్డాయి. వాటిపై పరిశోధనలు సాగించిన చరిత్రకారులు అవి క్రీస్తుపూర్వం 25000 ఏళ్ల నాటి చరిత్రపూర్వ యుగానికి చెందినవని తేల్చారు. అంతేకాదు, వాటిని తీర్చిదిద్దిన కళాకారుల్లో దాదాపు డెబ్బయి శాతం మంది మహిళలేనని వేలిముద్రల ఆనవాళ్ల ఆధారంగా నిగ్గుతేల్చారు. లోహయుగం మొదలైన తర్వాత అప్పటి మనుషులు శిల్పకళలో కూడా తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవడం ప్రారంభించారు. ఇంగ్లాండ్‌లోని శిలాతోరణం, ఈజిప్టులోని పిరమిడ్లు పురాతన మానవుల శిల్పకళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు. క్రమంగా నాగరికతలు వెలిశాక శిల్పకళ మరింతగా మెరుగులు దిద్దుకుంది. మన దేశంలోని పురాతన ఆలయాలతో పాటు వివిధ నాగరికతలు విలసిల్లిన ప్రాంతాల్లోని పురాతన కట్టడాలు అప్పటి కళాకారుల శిల్పకళా వైభవానికి నిదర్శనాలుగా నేటికీ నిలిచి ఉన్నాయి. అద్భుతమైన నైపుణ్యంతో నాటి కళాకారులు తీర్చిదిద్దిన పురాతన శిల్పాలు ఇప్పటికీ మ్యూజియంలలో దర్శనమిస్తాయి. వాటిని తీర్చిదిద్దిన కళాకారులెవరో, వారి పేర్లేమిటో ఎవరికీ తెలియదు. వారంతా అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయారు. అప్పటికి కళపై కాసుల ప్రభావం ఉండేది కాదు. కళాకారులకు ప్రచార సాధనాల ఆసరా ఉండేది కాదు. 

గ్యాలరీలు, మ్యూజియంలు
చాలామంది కళాకారులే కాదు, చాలా కళాఖండాలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల, మరికొన్ని మనుషుల మూర్ఖత్వం వల్ల. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగినప్పుడల్లా సైనికుల దాష్టీకాలకు ఎన్నో విలువైన కళాఖండాలు నాశనమయ్యాయి. మరెన్నో దోపిడీకి గురయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ సైనికులు చాలా చోట్ల కళాఖండాలను కొల్లగొట్టారు. మన సమకాలీన చరిత్రనే తీసుకుంటే అఫ్ఘానిస్తాన్‌లో బొమియాన్‌ బుద్ధ విగ్రహాలను తాలిబన్లు ధ్వంసం చేసి పారేశారు. తాలిబన్లు బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన అన్వేషణలో బుద్ధుని జీవిత ఘట్టాలతో కూడిన వెయ్యేళ్ల నాటి తైలవర్ణ చిత్రాలు బయటపడ్డాయి. ప్రపంచంలోనే ఇవి అత్యంత పురాతనమైన ఆయిల్‌ పెయింటింగ్స్‌. విలువైన కళాఖండాలను భావి తరాల కోసం పదిలపరచే ఉద్దేశంతో ఆధునిక యుగారంభంలో మ్యూజియంలు పుట్టుకొచ్చాయి. వివిధ మాధ్యమాల్లో చిత్రించిన విలువైన చిత్రాలు, శిల్పాలు వంటి కళాఖండాలను భద్రపరచిన మ్యూజియంలు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెలిశాయి. సమకాలీన కళాకారులు తమ కళాఖండాలను ప్రదర్శించుకోవడానికి, విక్రయించుకోవడానికి వీలుగా గ్యాలరీలు వెలిశాయి. వీటికి తోడు అత్యంత అమూల్యమైన కళాఖండాల విక్రయాల కోసం వేలంశాలలు కూడా ఉన్నాయి. మ్యూజియంలు, గ్యాలరీలతో పోలిస్తే వేలంశాలల సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి వేలంశాలల్లో క్రిస్టీస్, సోత్‌బీ వేలంశాలలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి.     

సెలిబ్రిటీలు, లెజెండ్‌లు
ప్రపంచంలో రాచరిక వ్యవస్థ మొదలైన తర్వాత కళాకారులకు రాజాశ్రయం లభించేది. రాజుల అండతో కళాకారులు అద్భుతమైన కళాఖండాలను సృష్టించారు. రాజాశ్రయం పొందిన కళాకారులు సైతం చాలా శతాబ్దాల పాటు అనామకంగానే మిగిలిపోయారు. కళారంగంలో తొలిసారిగా సెలిబ్రిటీ స్థాయిని ఆస్వాదించిన కళాకారుడు జాట్టో డి బండోనె. పదమూడో శతాబ్దికి చెందిన జాట్టో ఫ్లారెన్స్‌ రాజ్యంలో ఒక వెలుగు వెలిగాడు. చిత్రకారుడిగా, వాస్తుశిల్పిగా జాట్టో సృష్టించిన కళాఖండాలు అతడికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాట్టో తర్వాతే యూరోప్‌లోని మిగిలిన కళాకారులకు కూడా క్రమంగా సెలిబ్రిటీ స్థాయి లభించసాగింది. అయితే, పదిహేనో శతాబ్దికి చెందిన ఇటాలియన్‌ కళాకారుడు లియొనార్డో దవించిని తొలి లెజెండ్‌గా చెప్పుకోవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దవించి వేసిన చిత్రాల్లో పదిహేను మాత్రమే మిగిలి ఉన్నాయి. దవించి సమకాలికులైన మైకేల్‌ ఏంజిలో, రాఫెల్‌లతో పాటు ఆ తర్వాతి కాలాలకు చెందిన విన్సెంట్‌ వాంగో, రెంబ్రాంట్, పికాసో వంటి వాళ్లను కళారంగంలో లెజెండ్స్‌గా చెప్పుకోవచ్చు. వివిధ కాలాల్లో వివిధ శైలుల్లో వీరు చిత్రించిన చిత్రాలు, మలచిన శిల్పాలు కళా రంగాన్ని సుసంపన్నం చేశాయి. భారతీయ కళాకారుల్లోనైతే, రాజా రవివర్మ, ఎం.ఎఫ్‌.హుస్సేన్, తయ్యబ్‌ మెహతా, ఫ్రాన్సిస్‌ న్యూటన్‌ సౌజా, ఎస్‌.హెచ్‌.రజా, అమృతా షేర్‌గిల్, జామిని రాయ్, అబనీంద్రనాథ్‌ టాగోర్, నందలాల్‌ బోస్, చిత్తప్రసాద్, సతీష్‌ గుజ్రాల్, జతిన్‌ దాస్‌ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందారు. మన తెలుగు కళాకారుల్లో దామెర్ల రామారావు, అడవి బాపిరాజు, కొండపల్లి శేషగిరిరావు, పి.టి.రెడ్డి, వడ్డాది పాపయ్య, ఎస్వీ రామారావు తదితరులు విశేషంగా పేరు ప్రఖ్యాతులు పొందారు. 

కుంచె పట్టిన ప్రముఖులు
చిత్రకారులుగా ప్రఖ్యాతులైన వారు సరే, ఇతరేతర రంగాల్లో ప్రముఖులుగా గుర్తింపు పొందిన వారిలోనూ కొందరు కుంచె పట్టిన దాఖలాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. సాహితీవేత్తగా నోబెల్‌ బహుమతి అందుకున్న కవీంద్రుడు రవీంద్రనాథ్‌ టాగోర్‌ చిత్రకళలోనూ తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ రాజకీయాల్లో, పాలనా వ్యవహారాల నుంచి ఏమాత్రం తీరిక చిక్కినా కుంచెకు పనిచెప్పేవారు. ఒక పెయింటింగ్‌ వేస్తుండగానే గుండెపోటు వచ్చి ఆయన తుదిశ్వాస విడిచారు. అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో జిమ్మీ కార్టర్, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ కూడా చిత్రకారులే. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ 2014లో తన చిత్రాలతో ప్రదర్శనను కూడా నిర్వహించారు. బ్రిటిష్‌ ప్రధానిగా చరిత్ర ప్రసిద్ధుడైన విన్‌స్టన్‌ చర్చిల్‌ తీరిక వేళల్లో మంచి లాండ్‌స్కేప్‌ చిత్రాలు చిత్రించేవారు. బ్రిటిష్‌ యువరాజు ప్రిన్స్‌ చార్లెస్‌ కూడా మంచి చిత్రకారుడు. జర్మన్‌ నియంత హిట్లర్, స్పానిష్‌ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో కూడా చిత్రకారులే. హాలీవుడ్‌లో తారగా వెలుగొందిన మార్లిన్‌ మన్రో చక్కని చిత్రాలు చిత్రించేది. అప్పటి అమెరికన్‌ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీకి పుట్టిన రోజు కానుకగా ఆమె పంపిన ఎర్రగులాబీ పెయింటింగ్‌కు 2005లో జరిగిన వేలంలో 78 వేల డాలర్లు (రూ.50.66 లక్షలు) ధర పలికింది. హాలీవుడ్‌ నటుడు, రాక్‌ ఎన్‌ రోల్‌ స్టార్‌ జేమ్స్‌ డీన్‌ చేయి తిరిగిన చిత్రకారుడు మాత్రమే కాదు, గొప్ప శిల్పి కూడా. జేమ్స్‌ డీన్‌ బయోపిక్‌లో నటించిన జేమ్స్‌ ఫ్రాంకో కూడా చిత్రకారుడే కావడం విశేషం. హాలీవుడ్‌ నటుడు, గాయకుడు ఫ్రాంక్‌ సినత్రా చక్కని పెయింటింగ్స్‌ వేసేవాడు. హాలీవుడ్‌ కండల వీరుడు సిల్వస్టర్‌ స్టాలిన్‌ చిత్రకళలో చేయి తిరిగినవాడే. హాలీవుడ్‌ నటి లూసీ లియు ‘యు లింగ్‌’ అనే కుంచెపేరుతో చిత్రించిన తన పెయింటింగ్స్‌తో వీలు చిక్కినప్పుడల్లా ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తోంది. పెయింటింగ్స్‌ మీద వచ్చిన ఆదాయాన్ని ఆమె ‘యూనిసెఫ్‌’కు విరాళంగా ఇస్తోంది. హాలీవుడ్‌ ప్రముఖుల్లో ఇలాంటి చిత్రకారులు ఇంకా చాలామందే ఉన్నారు. బాలీవుడ్‌ ప్రముఖుల్లో శ్రీదేవి, సల్మాన్‌ ఖాన్‌లకు చిత్రకళలో మంచి నైపుణ్యం ఉంది. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరిక వేళల్లో పెయింటింగ్స్‌ వేస్తుంటారు. 
 – పన్యాల జగన్నాథదాసు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement