నువ్వు బద్రి అయితే... నేను నందా!
ఉత్తమ విలన్
ఒరేయ్...
నా దగ్గరి నుంచి కోటి రూపాయలు పట్టుకుపో.
మళ్లీ సంపాయించుకుంటా.
పది కేజీల బంగారం పట్టుకుపో...
మళ్లీ సంపాయించుకుంటా.
నా గుండెలు పట్టుకుపోతే ఎట్టరా?
ఒరేయ్ అది నా హార్ట్ రా...
లైఫు... వైఫు... మై డార్లింగు
పవర్‌ఫుల్ డైలాగుకు పవర్‌ఫుల్ నటన తోడైతే విలనీజం ఏ లెవెల్లో పండుతుందో ‘ఒక్కడు’ సినిమాలో ఓబుల్‌రెడ్డి పాత్రతో నిరూపించారు ప్రకాష్‌రాజ్.‘ఒక్కడు’లో మోటు విలనిజాన్ని ప్రదర్శించిన ప్రకాష్‌రాజ్ ‘బద్రి’ సినిమాలో నందగా సాఫ్ట్ విలనిజాన్ని తనదైన శైలిలో చూపించారు. ఈ సినిమాలో డైలాగులే కాదు... ‘కూల్ డౌన్ కూల్ డౌన్’ అంటూ కుడి చేత్తో ఒక చెంప కొట్టుకోవడం, ఒక కన్ను నలుపుకుంటూ మరో కంటితో సీరియస్‌గా చూడడం... మొదలైన హావభావాలు ‘ప్రకాష్ మార్క్’ విలనిజాన్ని చూపాయి. ‘విలన్ అంటే... ప్రకాష్ రాజే’ అన్నంతగా చేశాయి.
∙∙
టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌లోనూ ‘మోస్ట్ వాంటెడ్ విలన్’ జాబితాలో ఉన్న ప్రకాష్‌రాజ్ ప్రయాణం ఎక్కడి నుంచి ఎలా మొదలైంది?బెంగళూరులో సెయింట్ జోసఫ్‌లో ఏడవతరగతి చదువుతున్నప్పుడు ఒక చిన్న నాటికలో నటించాడు ప్రకాష్. తన నటనకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎడతెగని చప్పట్లు! నటనలో ఉండే మజా ఏమిటో ఆ వయసులోనే తెలిసొచ్చింది.
ఆ వయసులో చదువు మీద కంటే నటన మీదే ప్రకాష్‌కు ఆసక్తిగా ఉండేది. ఇక కాలేజీ రోజుల్లో ధర్నాల్లో చురుగ్గా పాల్గొనడం, గ్యాంగ్‌లు మెయింటైన్ చేయడంతోనే సరిపోయింది. ఇది చూసి కాలేజీ ప్రిన్సిపల్ ఒకరోజు అన్నారు...‘‘కాలేజీలో నీ టైమంతా వృథా చేసుకుంటున్నావు’’ అని.నీతులు, ఉపదేశాలను పట్టించుకోని వేడి వయసు అది. అయినప్పటికీ ప్రిన్సిపల్ మాట ప్రకాష్‌ను బలంగా తాకింది. ఈ మాట చెవుల్లో గింగుర్లు తిరుగుతుండగా కాలేజీ నుంచి అయిదు కిలోమీటర్లు నడుచుకుంటూ ‘కళాక్షేత్ర’కు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి కళాక్షేత్రమే కాలేజీగా మారింది. ఆరు నెలల వరకు ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియదు. థియేటర్ రిహార్సల్స్‌తో యాక్టింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు ప్రకాష్. ఆ తరువాత టీవీలో నటించడం, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలైంది.
ఆ సమయంలోనే ప్రకాష్ గురించి నటి గీత, డైరెక్టర్ బాలచందర్‌కు చెప్పారు. అలా... మహాదర్శకుడిని కలుసుకునే అపురూప అవకాశం వచ్చింది ప్రకాష్‌కు. అయితే వెంటనే అవకాశలేమీ రాలేదు. ఒక సంవత్సరం తరువాత తన ‘డ్యూయెట్’ సినిమాలో ప్రకాష్‌రాజ్‌కు నటించే అవకాశం ఇచ్చారు బాలచందర్.మణిరత్నం ‘ఇద్దరు’ సినిమాలో నటించడం కూడా మరో అద్భుతం. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు.బాగా ఆకలితో ఉన్న ప్రకాష్ ముంగిట రకరకాల పాత్రలు రెక్కలు కట్టుకొని వాలాయి.తండ్రి పాత్రకు ‘ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుంది’ అనుకునే పరిస్థితి వచ్చింది. ‘బాగుంటుంది’ అనేది ఇక్కడితో ఆగిపోలేదు.‘మన సినిమాలో విలన్‌గా ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుంది’‘ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్‌గా చేసి ఉంటే ఇరగదీసేవాడు’.... ఇలా తన రేంజ్‌ను పెంచుకుంటూ పోయారు ప్రకాష్‌రాజ్.వెండి చెంచా నోట్లో పెట్టుకొని పుట్టలేదు ప్రకాష్. అటు ఏడు తరాల్లోనూ ఇటు ఏడు తరాల్లోనూ నటన అంటే తెలిసిన వాళ్లు లేరు. అయినా సరే... విధి ప్రకాష్ రాజ్ అనే మంచి నటుడిని చిత్రపరిశ్రమకు అందించింది.ఆరోజు ప్రకాష్ ‘కళాక్షేత్ర’ వైపు అడుగులు వేయడానికి కారణం ‘రాత్రికి రాత్రే గొప్ప నటుడిని కావాలి’ అనే మహా కోరిక కాకపోవచ్చు. అయితే... ఒక కల మాత్రం బలంగా అంకురించింది. అది బలమైన చెట్టుగా ఎదిగింది. విలన్ పాత్రలు ప్రకాష్‌రాజ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి.నాటి ‘బద్రి’ నుంచి నిన్న మొన్నటి ‘సింగం’ వరకు విలన్ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రకాష్ రాయ్ ఎలియాస్ ప్రకాష్‌రాజ్ ‘ఉత్తమ విలన్’గా వెండితెరపై ఎనలేని పేరు సొంతం చేసుకున్నారు.