క్రిస్టీనా పిమెనోవా... ఈ పేరు మన దేశస్తులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ రష్యాలో ఈ పేరు విన్నవాళ్ల ముఖాల్లో ఓ వింత మెరుపు కనిపిస్తుంది. క్రిస్టీనా గురించి మాటల ప్రవాహం మొదలవుతుంది. ఎందుకంటే... ఏడేళ్ల ఆ చిన్నారి అంత ఫేమస్ మరి!
2005లో మాస్కోలో జన్మించింది క్రిస్టీనా. తండ్రి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తల్లి కూడా ఒకప్పుడు ఉద్యోగం చేసేది కానీ, ఇప్పుడు మానేసింది. దానికి కారణం క్రిస్టీనాయే. క్యూట్‌గా ఉండే క్రిస్టీనాని చూసినవాళ్లంతా... భలే ఉంది మీ అమ్మాయి, పెద్దయ్యాక సూపర్ మోడల్ అయిపోతుంది, తనని మోడల్‌నే చేయండి అనేవారట. ఆ మాటల్లో నిజం లేకపోలేదనిపించింది క్రిస్టీనా తల్లికి. అందుకే మూడేళ్ల వయసులోనే కూతురిని మోడల్‌ని చేసేసింది. యాడ్స్‌లో నటింపజేసింది. ముద్దులొలికే క్రిస్టీనా అందరి మనసులనూ దోచేసుకుంది. కళ్లు మూసి తెరిచేలోగా పెద్ద మోడల్ అయిపో యింది.
ఆమె కాల్షీట్లు చూడటానికి ఉద్యోగం మానేయాల్సి వచ్చింది ఆమె తల్లికి! డబ్బుకి డబ్బు, పేరుకి పేరు, దేశాలు తిరిగే చాన్స్... క్రిస్టీనా విషయంలో తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఏడేళ్ల చిన్నారిని ఇలా గ్లామర్ ప్రపంచంలో తిప్పడం ఆ చిన్నారి అందమైన బాల్యాన్ని హరించడమేనని అంటున్నారు కొందరు సామాజిక సంస్కర్తలు, మానవతావాదులు. మా చిన్నారిని చదివిస్తూనే ఇవన్నీ చేయిస్తున్నాం, ఎవరికో గానీ ఈ చాన్స్ రాదు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవడంలో తప్పేముంది అంటారు క్రిస్టీనా తల్లిదండ్రులు. ఈ రెండు వాదనలూ క్రిస్టీనాకు అర్థం కావు. ఆమెకి ఊళ్లు తిరగడం సరదాగా ఉంది. రకరకాల డ్రెస్సులు వేసుకోవడం, తనని అందరూ గుర్తు పట్టడం ఆనందంగా ఉంది.
భలే భార్యను పట్టాడు!
బ్రెజిల్‌కు చెందిన 74 యేళ్ల క్యాస్టాల్డో భార్యను కోల్పోయి చాలాకాలం అయ్యింది. ఏడుగురు పిల్లల్ని ఒంటరిగా కష్టపడి పెంచాడు. అయితే ఆ ఒంటరితనం విసుగనిపించి, మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వధువుని కూడా ఎంపిక చేసుకున్నాడు. ఆమె ఎవరో తెలుసా? అతడి పెంపుడు మేక కార్మెల్లా.కార్మెల్లాను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడట క్యాస్టాల్డో. అది చాలా సౌమ్యురాలట.
తను ఎలా చెబితే అలా వింటుందట. దానితో ఉంటే సమయమే తెలీదట. అంతకంటే మంచి భార్య ఎక్కడ దొరకుతుంది అనుకుని దాన్నే పెళ్లాడేయడానికి రెడీ అయిపోయాడు. కానీ ఆ పెళ్లితంతు జరపడానికి అక్కడి చర్చి యజమానులెవరూ ఒప్పుకోలేదు. నానా తంటాలు పడి చివరికి ఎక్కడో ఓ మూలనున్న చర్చివాళ్లను ఒప్పించాడు. అక్టోబర్ 13న నా పెళ్లికి రండి అంటూ ఆహ్వానాలు పంపుతున్నాడు. ఈ వయసులో ఇదేం పని, పైగా మేకను పెళ్లాడటమేంటి అంటే... నా ఏడుగురు పిల్లలూ కార్మెల్లాను తల్లిగా అంగీకరించారు, వాళ్లకు లేని బాధ మీకేంటి అంటూ మండిపడుతున్నాడు. ముసలాయనకి మతి భ్రమించలేదు కదా అంటూ గుసగుసలాడుతున్నారంతా!
విడ్డూరం: ఈ గడుగ్గాయి గ్లామర్ క్వీన్!
Published Sun, Sep 22 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement