ఆర్టీసీపై బడ్జెట్ బండ | budget effect on RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై బడ్జెట్ బండ

Published Wed, Mar 2 2016 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

budget effect on RTC

రవాణా సంస్థను వణికిస్తున్న జైట్లీ ప్రకటన
* ప్రజా రవాణాలో ప్రైవేటుకు అవకాశం కల్పిస్తామన్న ఆర్థికమంత్రి
* కేంద్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరించనున్నట్టు సంకేతాలు
* సంస్థ మనుగడకే ప్రమాదమంటున్న కార్మిక సంఘాలు
* ప్రైవేటీకరణకు బాటలు పరుస్తున్నారంటూ ఆందోళన
* స్టేజీ క్యారియర్లపై సేవా పన్ను వేస్తామన్న కేంద్రం
* ఆర్టీసీపై ఏటా రూ.225 కోట్లకుపైగా భారం!
* స్పష్టత కోసం కేంద్ర ఆర్థిక శాఖను ఆశ్రయించిన ఆర్టీసీ అధికారులు

 సాక్షి, హైదరాబాద్

 ఆర్థిక నష్టాలతో కుదేలైన ఆర్టీసీకి కేంద్రం నుంచి కూడా ఏదో ఒక రూపంలో సాయం అందించేందుకు ఓవైపు కసరత్తు జరుగుతుంటే.. కేంద్ర సర్కారు మాత్రం ఆ సంస్థ మనుగడకే ఎసరు పెట్టే నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రైవేటుకు దారులు పర్చడమేగాకుండా పన్ను రూపంలో ఆర్టీసీ నుంచి ఏటా రూ.225 కోట్లు పిండుకునేందుకు ప్రణాళికలు రచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ మేరకు సంకేతాలివ్వడంతో ఆర్టీసీ ఉలిక్కిపడింది. దీనిపై మరింత స్పష్టత కోసం అధికారులు కేంద్ర ఆర్థిక శాఖను ఆశ్రయించారు.

పర్మిట్ల వేటలో ప్రైవేటు సంస్థలు
ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రజా రవాణాలో ప్రైవేటు సంస్థలకు అవకాశం లేదు. పూర్తిగా ఆర్టీసీ అధీనంలోనే ఉంది. కేంద్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరించి ప్రజా రవాణాలో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీని అమలులో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నా.. క్రమంగా అది ఆర్టీసీ ప్రైవేటీకరణకు బాటలు వే స్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రజా రవాణా ఆర్టీసీ గుత్తాధిపత్యంలోనే ఉన్నా.. ప్రతి పర్మిట్‌కు ఆ సంస్థ రవాణా శాఖకు దరఖాస్తు చేసుకొని అనుమతి పొందుతోంది. కేంద్రం చెబుతున్న దాని ప్రకారం.. ఈ పర్మిట్ల కోసం ఇకపై ప్రైవేటు సంస్థలు కూడా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందే అవకాశం ఉంటుంది.

లేదంటే ప్రభుత్వమే కొన్ని మార్గాలను వాటికి అప్పగించవచ్చు. ఆర్టీసీ నష్టాలను బూచీగా చూపి ప్రైవేటుకు పర్మిట్లు కట్టబెట్టే అవకాశం ఉంది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రానప్పటికీ.. స్థానికంగా కార్మిక సంఘాలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీకి సాయం చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ భారం తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. ప్రైవేటుకు బాటలు వేయొచ్చన్నది కార్మిక సంఘాల అనుమానం. మొత్తమ్మీద ఈ అంశం ఇప్పుడు ఆర్టీసీలో దుమారం రేపుతోంది.

సేవా పన్ను దెబ్బ..
ఆర్టీసీపై ఇప్పటివరకు సేవా పన్ను లేదు. అయితే స్టేజీ క్యారేజీ వాహనాలపై 5.6 శాతం సేవా పన్ను విధించనున్నట్టు బడ్జెట్‌లో కేంద్రం ప్రస్తావించింది. ఇది కేవలం ఏసీ వాహనాలకే పరిమితమవుతుందా? లేదా ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలకు కూడా వర్తిస్తుందా అన్న విషయం ఎక్కడా చెప్పకపోయినా.. అన్ని స్టేజీ క్యారియర్లకు వర్తిస్తుందనేసరికి ఆర్టీసీ వణికిపోతోంది. ఈ పన్ను విధిస్తే ఆర్టీసీపై రూ.225 కోట్ల భారం పడుతుందని అధికారులు లెక్కలు తేల్చారు. ఒకవేళ ఈ భారాన్ని మోసినా.. అది టికెట్ల చార్జీల పెంపు రూపంలో చివరికి ప్రయాణికులపైనే పడే ప్రమాదం ఉందంటున్నారు.

ప్రైవేటు సంస్థల లాబీయింగ్
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధీనంలోని ఆర్టీసీల పాత్ర చాలా పరిమితంగా ఉంది. రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో ప్రైవేటు సంస్థలే ఎక్కువగా ప్రజా రవాణాలో ఉన్నాయి. అక్కడి మాదిరే తెలంగాణలో కూడా పర్మిట్లు పొంది మార్గాలను దక్కించుకునేందుకు కొన్ని సంస్థలు లాబీయింగ్ జరుపుతున్నాయి. కేంద్రం ఆలోచనలతో ఇప్పుడు వాటికి బలం చేకూరుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఓ సంస్థ రవాణా శాఖ అధికారులను కలిసి హైదరాబాద్ సహా పలు నగరాలకు బస్సులు తిప్పుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోరింది. అలాగే అమెరికాలో స్థిరపడ్డ ఇద్దరు ప్రవాస భారతీయులు కూడా ఓ సంస్థను ఏర్పాటు చేసి బస్సులు తిప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు రవాణా శాఖను సంప్రదించారు. స్థానికంగా టూరిస్ట్ పర్మిట్లతో బస్సులు తిప్పుతున్న కొన్ని సంస్థలు సైతం ప్రజా రవాణా పర్మిట్ల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement