మీ సామర్థ్యం ఏమైంది? | RTC BUS budget on cm kcr question! | Sakshi
Sakshi News home page

మీ సామర్థ్యం ఏమైంది?

Published Fri, Feb 19 2016 3:38 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

మీ సామర్థ్యం ఏమైంది? - Sakshi

మీ సామర్థ్యం ఏమైంది?

ఆర్టీసీకి సీఎం కేసీఆర్ ప్రశ్న
ప్రభుత్వ సాయంతోనే నెట్టుకురావాలనుకుంటే ఎలా?
అంతర్గత సామర్థ్యం పెంచుకోండి
రాష్ట్రవ్యాప్తంగా మినీ బస్సులు నడపండి
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ
44 శాతం ఫిట్‌మెంట్‌తో మరింత భారం
ఆదుకుంటామన్న కేసీఆర్ హామీతో బడ్జెట్‌పై ఆశలు
వన్‌టైం సెటిల్‌మెంట్ కింద నిధులు వస్తాయనే భావన
‘సాయం’పై ఏమీ తేల్చని ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వం నుంచి అవసరమైన సమయంలో సాయం అందుతుంది. కానీ ఆ సాయంతోనే నెట్టుకురావాలనుకోవడం సరికాదు.

ఆర్టీసీ అంతర్గత సామర్థ్యం పెంచుకునేందుకు ప్రణాళికలేవి..? ముందుగా వాటిపై దృష్టి సారించి సంస్థను లాభాల బాట పట్టించండి..’’.. ఆర్టీసీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఉద్బోధ ఇది. దాదాపు రూ. 2,500 కోట్ల అప్పు.. ఏటా రూ.150 కోట్ల వడ్డీ.. ఈ ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి రూ.550 కోట్ల నష్టాలు.. వెరసి ఆర్థిక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీకి సీఎం సూచనలు నిరాశ మిగిల్చాయి. వన్‌టైం సెటిల్‌మెంట్ రూపంలో ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో ఆదుకుంటుందన్న ఆశలన్నీ నీరుగారిపోయాయి.
 
సమస్యల సుడిగుండంలో ఆర్టీసీ
ఓవైపు అప్పులు, మరోవైపు ఏటికేడు పెరుగుతున్న నష్టాలతో ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దానికితోడు గత సంవత్సరం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం 44 శా తం ఫిట్‌మెంట్ ప్రకటించింది. అప్పటి వరకు ఏటా రూ. 1,500 కోట్ల మేర ఉండే జీతాల పద్దు ఒక్కసారిగా రూ.2,500 కోట్లకు పెరి గింది.

దీంతో ఆర్టీసీ మరింతగా ఇబ్బం దుల్లో కూరుకుపోయింది. అయితే ఈ ఫిట్‌మెంట్ ప్రకటించేటప్పుడు ఆర్టీసీని ఆదుకుంటామని, బడ్జెట్‌లో దానికి సాయం చేస్తావన్నారు. దాంతో ఈసారి బడ్జెట్‌పై ఆర్టీసీ ఆశలు పెట్టుకుంది. వన్‌టైం సెటిల్‌మెం ట్ కింద సంస్థ అప్పులు, నష్టాలను పూడిస్తే బాగుంటుందని ఆశించింది. బడ్జెట్‌పై సీఎం సమక్షంలో జరిగే సమావేశం కోసం ఎదురుచూసింది.
 
‘బడ్జెట్’ ఆశలు గల్లంతు
బడ్జెట్ కూర్పునకు సంబంధించి బుధవారం ముఖ్యమంత్రి ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా సంస్థ పరిస్థితికి సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సంస్థ దుస్థితిని ఆర్టీసీ జేఎండీ రమణారావు పూర్తిగా వివరించారు. అంతా విన్న సీఎం కేసీఆర్... ప్రభుత్వపరంగా ఎంత సాయం చేయనుందీ మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదని సమాచారం. అంతేగాకుండా ఫిట్‌మెంట్ ప్రకటించే సమయంలో తాను చెప్పిన అంశాలను మరోసారి పేర్కొన్నట్లు తెలిసింది.

ఆర్టీసీ అంతర్గత సామర్థ్యం పెంచుకోవడం ద్వారానే సంస్థను లాభాల బాట పట్టించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటుందని... కానీ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం ద్వారానే నష్టాల నుంచి బయటపడాలని పేర్కొన్నారు. సొంత కాళ్లపై నిలబడేలా ఆర్టీసీని బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

దీంతో ఇంతకాలంగా ప్రభుత్వంపై ఆశలు పెంచుకున్న ఆర్టీసీ అధికారులకు నిరాశే మిగిలినట్లయింది. అయితే ఆర్టీసీని బలోపేతం చేసుకోవాలని చెప్పిన సీఎం కేసీఆర్... పలు సూచనలు కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మినీ బస్సులను ప్రవేశపెట్టాలని చెప్పారు. తిరుపతి, ముంబై, షిర్డీ లాంటి దూర ప్రాంతాలకు సర్వీసులు పెంచి ఆదాయాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు.
 
పాసుల డబ్బులైనా ఇప్పించండి

విద్యార్థులు, వివిధ వర్గాలకు బస్సు పాసుల రూపంలో ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి సంస్థకు రావాల్సిన రూ.500 కోట్లను వెంటనే కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను జే ఎండీ రమణారావు కోరారు. కొత్త బస్సులు కొనేందుకు మరో రూ. 40 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై సీఎం కాస్త సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొత్తంగా దీంతో వన్‌టైం సెటిల్‌మెంట్ ఆశలు వదులుకున్న అధికారులు ఈ రూ. 540 కోట్లయినా వస్తాయని భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement